పెళ్లి చేసుకుంటానని నమ్మించి, శారీరక వాంఛ తీర్చుకున్న తర్వాత యువతులను మోసగించేవారు ఎందరో ఉన్నారు. అలాంటి ఓ కేసు న్యాయస్థానం ముందుకు వచ్చింది. ఈ కేసును విచారించిన మధ్యప్రదేశ్ హైకోర్టు.. ఈ విషయంలో కీలక వ్యాఖ్యలు చేసింది. అమ్మాయిలు ఎలాంటి పరిస్థితుల్లో శారీరక సంబంధాలకు మొగ్గుచూపుతారో వివరించింది. అదే సమయంలో.. పురుషులకు హెచ్చరికలు కూడా జారీచేసింది.
ఉజ్జయినిలో ఈ ఘటన జరిగించింది. ఈ ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి ఓ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి, శారీరకంగా దగ్గరయ్యాడు. 2018 నుంచి ఈ వ్యవహారం కొనసాగించాడు. అయితే.. ఈ ఏడాది జూన్లో మరో అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యాడు. తనను మోసం చేయొద్దని బాధితురాలు ఎంతగా వేడుకున్నా వినలేదు. దీంతో.. బాధితురాలు ఆత్మహత్యకు యత్నించింది.
దీంతో.. నిందితుడిపై అత్యాచారం కేసు నమోదైంది. పోలీసులు అరెస్టు చేశారు. అయితే.. తనకు బెయిల్ ఇవ్వాలంటూ సదరు వ్యక్తి కోర్టును ఆశ్రయించాడు. దరఖాస్తును విచారించిన మధ్యప్రదేశ్ హైకోర్టు.. నిందితుడి వాదనతో ఏకీభవించలేదు. అతను దరఖాస్తులో ఏమన్నాడంటే.. సదరు యువతికి 21 ఏళ్లు నిండాయి కాబట్టి.. ఆమె మేజర్ కాబట్టి.. తన ఇష్ట ప్రకారమే తనతో శారీరక సంబంధం పెట్టుకుందని వాదించాడు.
దీనిపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. భారత్ ఒక సంప్రదాయ దేశమని, భారతీయ యువతులకు శారీరక సంబంధం పెట్టుకోవడం సరదా కాదని ఘాటుగా వ్యాఖ్యానించింది. పెళ్లి చేసుకుంటానని నమ్మకంగా చెబితే తప్ప.. పరాయి వ్యక్తితో శారీరక సంబంధానికి అంగీకరించబోరని తేల్చి చెప్పింది.
బాధితురాలిని మోసగించి, మరో పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడడంపైనా కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. బాధితురాలు ప్రాణాలు తీసుకునేందుకు సిద్ధపడడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోందని కోర్టు వ్యాఖ్యానించింది. పెళ్లి కాకుండా గర్భవతి అయితే.. సమాజంలో మహిళల పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఊహించడం కూడా కష్టమేనని మండిపడింది. ఈ పరిస్థితి కారకుడైన వ్యక్తికి బెయిల్ ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పింది న్యాయస్థానం.