Homeజాతీయ వార్తలుCM Shivraj Singh Chouhan: కాళ్ళు కడిగాడు.. తప్పయింది క్షమించమన్నాడు

CM Shivraj Singh Chouhan: కాళ్ళు కడిగాడు.. తప్పయింది క్షమించమన్నాడు

CM Shivraj Singh Chouhan: మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సిద్ధి జిల్లాలో భారతీయ జనతా పార్టీకి చెందిన ప్రవేశ శుక్లా అనే వ్యక్తి అవమానించిన గిరిజనుడికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ క్షమాపణ చెప్పాడు. బాధితుడి పాదాలను నీళ్లతో కడిగి, శాలువాతో సత్కరించాడు. నిందితుడిని బుధవారం తెల్లవారుజామున అరెస్టు చేయడంతో పాటు అతడి ఇంటిని బుల్డోజర్ తో కూల్చివేయించాడు. అంతేకాదు అతనిపై పలు శిక్షల కింద కేసులు నమోదు చేసేలా పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు.. ముఖ్యమంత్రి ఆదేశాలతో పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.

దశమత్ రావత్ అనే గిరిజన కూలి పై ప్రవేశ్ శుక్లా మూత్ర విసర్జన చేస్తున్నట్టు కనిపించిన ఒక వీడియో ఇటీవల బయటపడింది. దీనిపై దేశవ్యాప్తంగా భారీ ఎత్తున ఆగ్రహం వ్యక్తం అయింది. ఇది త్వరలో ఎన్నికలు జరగబోయే తన రాష్ట్రంలో పార్టీకి ఇబ్బంది కలిగిస్తుందని భావించి ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ రంగంలోకి దిగారు.. వెంటనే స్పందించి నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అంతేకాదు బాధితుడుని తాను స్వయంగా భోపాల్ లో కలుస్తానని, క్షమాపణ కూడా చెబుతానని ప్రకటించారు. చెప్పిన విధంగానే బుధవారం తెల్లవారుజామున నిందితుడిని అరెస్టు చేశారు. ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 294 (అసభ్యకర చర్యలకు పాల్పడటం), 504 (శాంతికి భంగం కలిగించే విధంగా, ఉద్దేశపూర్వకంగా అవమానించడం), ఎస్సీ, ఎస్టీ చట్టం, జాతీయ భద్రత చట్టం ప్రకారం నిందితుడిపై కేసు నమోదు చేశారు. బుధవారం నిందితుడు అక్రమంగా నిర్మించిన ఇంటిని బుల్డోజర్ తో కూల్చేశారు. ఆ సమయంలో ఆయన తల్లి స్పృహ కోల్పోయారు. దీనిపై మధ్యప్రదేశ్ హోంశాఖ మంత్రి నరోత్తం మిశ్రా మాట్లాడుతూ నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

సీఎం శివరాజ్ సింగ్ చౌహన్ బాధితుడు దశమత్ రావత్ ను గురువారం కలిశారు. రావత్ ను కుర్చీలో కూర్చోబెట్టి, ఆయన పాదాలను కడిగారు. ఆయనకు శాలువా కప్పి సత్కరించారు. క్షమాపణ చెప్పారు. దీనికి సంబంధించిన ఫోటోలను ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. ఈ ఘటన తన మనసును ఎంతగానో కలచివేసిందని, తన పార్టీకి చెందిన వ్యక్తి ఇలా చేయడం బాధించిందని ఆయన వాపోయారు. అందుకే బాధితుడి పాదాలు కడిగి ప్రాయశ్చిత్తం చేసుకున్నానని ప్రకటించారు.. కాగా ఈ సంఘటన దేశవ్యాప్తంగా వైరల్ గా మారింది.. శివరాజ్ సింగ్ చేసిన పనిని నెటిజన్లు అభినందిస్తున్నారు. ఇలాంటివారు పార్టీలో ఉండకూడదని, వారిని తక్షణమే బహిష్కరించాలని ముఖ్యమంత్రికి పిలుపునిస్తున్నారు.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version