MP Avinash Reddy: అనుకున్నంత అయ్యింది. చివరి నిమిషంలో కడప ఎంపీ అవినాష్ రెడ్డి సీబీఐకి దెబ్బేశారు. విచారణ కోసమంటూ కడప నుంచి హైదరాబాద్ బయలుదేరిన ఆయన చివరి నిమిషంలో హ్యాండిచ్చారు. వాహనాల రూటు మార్చి పులివెందుల వైపు యూటర్న్ తీసుకున్నారు. దీంతో సీబీఐ అధికారులకు మైండ్ బ్లాక్ అయ్యింది. ఈరోజు విచారణకు హాజరుకావాలంటూ సీబీఐ అవినాష్ రెడ్డికి నోటీసులిచ్చిన సంగతి తెలిసిందే. దీంతో శుక్రవారం అనుచరులతో కలిసి హైదరాబాద్ బయలుదేరడంతో అంతా విచారణకేనని భావించారు. కానీ అవినాష్ రెడ్డి గైర్హాజరయ్యారు. తన తల్లి లక్ష్మీదేవమ్మ అనారోగ్యానికి గురయ్యారని కారణం చూపుతూ హాజరుకాలేనని.. మరోరోజు హాజరవుతానని సీబీఐకి తేల్చిచెప్పారు.
అవినాష్ రెడ్డి ఇప్పటివరకూ ఆరుసార్లు సీబీఐ విచారణకు హాజరయ్యారు. విచారణకు హాజరవుతున్న ప్రతీసారి ఆయన అరెస్ట్ తప్పదన్న ప్రచారం సాగింది. ఇప్పటికే ఆయన తండ్రి భాస్కరరెడ్డిని సీబీఐ అదుపులోకి తీసుకుంది. ఆయనపై చార్జిషీట్ నమోదు చేసే క్రమంలో అవినాష్ రెడ్డిని సహ నిందితుడిగా పేర్కొంది. దీంతో తనను విచారణకు పిలిచి అరెస్ట్ చేస్తారని భావిస్తున్న అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ కు అప్లయ్ చేసుకున్నారు. కానీ కోర్టు విచారణలో ఉంది. ఈ సమయంలో కానీ తాను విచారణకు హాజరైతే అరెస్ట్ ఖాయమని భావిస్తున్నట్టున్నారు. అందుకే వివిధ కారణాలు చూపుతూ గైర్హాజరవుతున్నారు.
తొలుత ఈ నెల 16న విచారణకు హాజరుకావాలని అవినాష్ రెడ్డికి సీబీఐ నోటీసులిచ్చింది. కానీ తనకు ముందస్తు షెడ్యూల్ కార్యక్రమాలున్నాయని.. నాలుగు రోజులు సమయం కావాలని కోరుతూ విచారణకు హాజరుకాలేదు. దీంతో శుక్రవారం విచారణకు హాజరుకావాలని సీబీఐ మరోసారి నోటీసులిచ్చింది. కానీ మళ్లీ గైర్హాజరవుతారని టాక్ నడిచింది. కానీ హైదరాబాద్ వెళ్లినట్టే వెళ్లి.. కడపకు తిరుగుముఖం పట్టడం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం అవినాష్ రెడ్డి తల్లి లక్ష్మిదేవమ్మ పులివెందులలోని దినేష్ నర్సింగ్ హోంలో చేరారు.ఇది సీఎం జగన్ మామ గంగిరెడ్డికి చెందిన ఆస్పత్రి. అయితే అవినాష్‌రెడ్డి రావడం లేదన్న సమాచారం అందుకున్న సీబీఐ అధికారులు రెండు వాహనాల్లో హుటాహుటిన కార్యాలయం నుంచి బయల్దేరినట్టు ప్రచారం జరుగుతోంది. సీబీఐ అధికారులు హడావుడిగా ఎక్కడికి? ఎందుకు ప్రయాణం అయ్యారనేది తెలియాల్సి వుంది.