MP Aravind: తెలంగాణ రాజకీయాల్లో మాటల మరాఠి అనదగ్గ కేసీఆర్ కు సరితూగే నాయకుల్లో నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ఒకరు. రేవంత్ రెడ్డి తర్వాత అంతటి గట్టిగా మాట్లాడగల ఓర్పు, నేర్పు అరవింద్ సొంతం. తెలంగాణ స్లాంగ్ లో అరవింద్ చేసే విమర్శలు చెణుకులకు ప్రత్యర్థులు విలవిలలాడాల్సిందే. మైక్ పట్టుకుంటే తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టడంలో అరవింద్ సిద్ధహస్తుడు. తాజాగా హుజూరాబాద్ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ అధికార టీఆర్ఎస్ చేస్తున్న మ్యాజిక్ లపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన ఆరోపణలు చేశారు.
సీఎం గతంలో దళితబంధుపై మాట్లాడిన వీడియోలను ప్రదర్శించి మరీ అర్వింద్ వేసిన సెటైర్లు అద్భుతంగా పేలాయి. బీజేపీ హైదరాబాద్ నాంపల్లి కార్యాలయంలో మాట్లాడిన ఎంపీ అరవింద్ కేసీఆర్, కేటీఆర్ లపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఇద్దరూ డ్రామాలాడుతున్నారని దుయ్యబట్టారు.
బీజేపీ నేతలు దళితబంధును అడ్డుకున్నారని.. తప్పుడు లేఖలు సృష్టించారని ఎంపీ అరవింద్ ఫైర్ అయ్యారు. హుజూరాబాద్ లో దళితబంధును ఆపించిందే సీఎం కేసీఆర్ అని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల కారణంగా దళితబంధు కొనసాగించలేని స్థితిలో తెలంగాణ ప్రభుత్వం ఉందని తనకు ఓ అధికారి చెప్పినట్లు సంచలన విషయాలను అరవింద్ పంచుకున్నారు.
సీఎం కేసీఆర్, టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సభలకు ఫండింగ్ చేస్తోందని ఒక్కరేనని ఎంపీ అరవింద్ సంచలన ఆరోపణలు చేశారు. ఆయన పేరు అందరికీ తెలుసన్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఈటల గెలుపుతో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలు అమలవుతాయని అరవింద్ హామీ ఇచ్చారు.
తెలంగాణ రాష్ట్ర ఖజానా దివాలా తీయడంతో దళితబంధు డబ్బులు ఎలా ఇవ్వాలో సీఎం కేసీఆర్ కు అర్థం కావడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. మంత్రి కేటీఆర్ అసమర్థత కారణంగానే ఈటల రాజేందర్ టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చారని అర్వింద్ అన్నారు.