AP Employees: ప్రభుత్వమైనా.. ప్రైవేటు అయినా ఉద్యోగికి, కార్మికుడికి నిర్ధేశించిన సమయానికి జీతాలు పడతాయి. చేసిన పనికి వేతనం ఎలాగైనా ముడుతుంది. అయితే అంతకంటే బెనిఫిట్స్ రావాల్సినప్పుడు మాత్రం గొంతు సవరించక తప్పదు. రోడ్డుపైకి వచ్చి పోరాడక తప్పదు. అయితే విధి విచిత్రం. ఏపీ ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఏరికోరి తెచ్చుకున్న జగన్ సర్కారు హయాంలో అదనపు బెనిఫిట్స్ మాట అటుంచితే.. ఉన్న జీతాలు సమయానికి ఇవ్వండి అంటూ రోడ్డెక్కాల్సిన పరిస్థితి వేతన జీవులకు వచ్చింది. అది స్వయం కృతాపమో.. లేక కోరి కష్టాలు తెచ్చుకున్నారో కానీ అనుభవించక తప్పని పరిస్థితి ఉద్యోగ, ఉపాధ్యాయులది. ఒకప్పుడు గొంతెమ్మ కోరికల కోసం ప్రభుత్వాలనే బ్లాక్ మెయిల్ చేసే చరిత్ర ఉద్యోగులది. ప్రభుత్వానికి ఉరుకులు,పరుగులు పెట్టించి మరీ తమ కోరికలను నెరవేర్చుకునేవారు. అటువంటిది మేము కష్టపడిన పనికి జీతం చెల్లిస్తే చాలూ అన్న స్థితిలోకి వచ్చేశారు. జీతం ఇస్తారా? లేక రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేయమంటారా? అని నేరుగా హెచ్చరికలు చేసేందుకు కూడా భయపడుతున్నారు. దానికి కూడా వెయిట్ చేసి ఉద్యమిస్తామని చెబుతున్నారు.

తోటి ఉద్యోగులతో సమావేశమైన ఉద్యోగ సంఘ నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు వారు ఉద్యమానికి ముహూర్తం పెట్టారు. మేకకు అడిగి మంగళవారం చేసినట్టు సంక్రాంతి తరువాత ఉద్యమిస్తామని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం డిసెంబరు రెండోవారం దాటింది.. మూడో వారం సమీపిస్తోంది. కానీ 40 శాతం మంది ఉద్యోగులకు అసలు జీతాలు రాలేదంటే అది ప్రమాద ఘంటిక కాదన్నట్టు వ్యవహరిస్తున్నారు. సంక్రాంతి వరకూ చూద్దాంలే.. అక్కడకు మారకుంటే పోరాడుదామంటూ ప్రభుత్వానికి ఆప్షన్ ఇస్తున్నారు. గతంలో ఇటువంటి ముహూర్తాలు పెట్టి చేసిన ఉద్యమాలు ఏ మూలకు వెళ్లాయో అందరికీ తెలిసిన విషయమే. సమ్మె వరకూ వెళ్లిన ఉద్యమం.. ప్రభుత్వం గుమ్మం నుంచి తిరుగుముఖం పట్టిన విషయం ఏపీ సమాజానికి తెలిసిన విషయమే. ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రయోజనాలు పొందకుండానే ఉద్యమాన్ని కాడికి దించేసిన పరిస్థితులు ఇప్పటికీ ఉద్యోగులు, ఉపాధ్యాయుల కళ్లల్లో మెసిలాడుతున్నాయి.
అయితే వేతన జీవికి ఇంతలా కష్టం ఎదురైనా ఏపీ సమాజం పట్టించుకోలేదంటే గత పర్యవసానాలే కారణం. ప్రభుత్వ ఉద్యోగికి జీతం సమస్య వస్తుందని ఎవరూ అనుకోరు. ఎందుకంటే వారు ప్రభుత్వంలో ఒక భాగం. పాలనను నడిపించే వ్యవస్థలో వారిది కీలక భాగస్వామ్యం.ప్రజల నుంచి పన్నులు వసూలు చేసి ప్రజా సంక్షేమం కోసం ఆ డబ్బును ఖర్చేచేసే ఒక వ్యవస్థే ప్రభుత్వం. పాలనలో ఉద్యోగులూ ఒక భాగం. వారికి జీతాలు చెల్లించడం ప్రభుత్వ ప్రధాన విధి. దానికి ఎవరి దయాదాక్షిణ్యాలు అక్కర్లేదు. ప్రభుత్వం ఇవ్వకుంటే డిమాండ్ చేసే అధికారం ఉద్యోగులకు ఉంటుంది.

దానిని ఎవరూ కాదనలేని పరిస్థితి. కానీ అక్కడున్నది జగన్ సర్కారు. ఆ సర్కారు తేవడంలో కీలక భూమిక ఉద్యోగ, ఉపాధ్యాయులది. తమకు ఏ కష్టం రానివ్వనని.. తమ ముఖంలో చిరునవ్వు నింపుతానని.. వారికి ఇవ్వాల్సింది ఇస్తే పేద ప్రజల బాగోగులు చూస్తారని… ఎన్నికల ముందు ఉద్యోగ, ఉపాధ్యాయుల గురించి జగన్ గొప్పగా మాట్లాడేసరికి అంతులేని విజయం కట్టబెట్టారు. తాము ఓటు వేయడమే కాకుండా పది మందిపై ప్రభావం చూపారు. జగన్ అంతులేని విజయానికి కారణమయ్యారు. దానికి ఇప్పడు మూల్యం చెల్లించుకుంటున్నారు. ఫస్ట్ తారీఖున రావాల్సిన జీతాలు .. పక్షం రోజులు దాటినా ఇవ్వలేదంటే.. మున్ముందు ఇలాంటి చిత్రాలు ఎన్నోచూడాలి. అందున ఎన్నికల సంవత్సరం. ప్రజలకు పంచుడే ప్రభుత్వం ముందున్న ధ్యేయం. ఇటు డబ్బులు అటు వెళితే.. ఉద్యోగులకునెలల తరబడి జీతాలు నిలిపివేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు.