
జూన్ 22 నుంచి దేశంలోని అన్ని ప్రధాన ఓడ రేవుల్లో చైనా నుంచి వచ్చే దిగుమతులను కస్టమ్స్ అధికారులు ఆపేశారు. మన దేశంలో తయారవుతున్న మందులకు చాలా వరకూ ముడి పదార్థాలు చైనా నుంచి వస్తున్నాయి. ఈ సరుకుల్లో ఎన్నో రకాలున్నాయి. వాటిలో… మందుల తయారీకి అవసరమైన ముడి సరుకులు కూడా ఉన్నాయి. అవన్నీ విమానాల్లోను, ఓడ రేవుల్లోను నిలిచిపోయాయి. అధికారులు వాటికి అనుమతి ఇవ్వట్లేదు. ముఖ్యంగా కరోనాను ఎంతో కొంత కంట్రోల్ చేస్తున్న రెమ్ డెసివిర్, ఫావిపిరావిర్ మందుల తయారీకి కావాల్సిన ముడి పదార్థాలు ఇప్పుడు ఆ ఎయిర్ కార్గోలోనే ఉండిపోయాయి. అందువల్ల వాటి ఉత్పత్తి ఆగిపోయే ప్రమాదం కనిపిస్తోంది.
ప్రస్తుతం ఇండియాలో కరోనా కేసులు పెరుగుతున్న సమయంలో… ఈ మందుల తయారీ అత్యవసరంగా మారింది. ముడి పదార్థాలకు వెంటనే అనుమతి ఇవ్వాలని ఫార్మాస్యూటికల్ ఎక్స్ పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్… కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. వెంటనే అనుమతి ఇవ్వకపోతే… మందుల తయారీ ఆలస్యమై… అది కరోనా పేషెంట్లకు సమస్యగా మారుతుందని తెలిపింది.
రెమ్ డెసివిర్, ఫావిరావిర్ మందులు కరోనా నివారణలో బాగా పనిచేస్తున్నాయని అధ్యయనాల్లో తేలింది. ఐదు రోజులుగా ముంబై ఎయిర్ కార్గోలో ఆ రెండు మందుల ముడి పదార్థాలు నిలిచిపోయాయని… ఈ మందులతో తయారుచేస్తున్న రెండు బ్రాండ్లను పేషెంట్లకు ఇచ్చేందుకు అనుమతి లభించింది. జూన్ 22 నుంచి అధికారులు 30 శాతం ఫార్మా దిగుమతులను మాత్రమే పరిశీలించి రిలీజ్ చేశారు. ముంబై, చెన్నై ఓడరేవుల్లో కూడా వంద శాతం చెకింగ్ తర్వాత క్లియరెన్స్ ఇస్తున్నారు.
ఇలా లేట్ అయ్యేకొద్దీ మందుల తయారీ ఆలస్యం కానుంది. దీనికి తోడు… ఆయా ముడి సరుకులకు గ్రౌండ్ రెంట్, డెమ్మురేజ్ కాస్ట్ వంటి అదనపు ఖర్చులు కూడా అవుతున్నాయి. అందువల్ల మందుల రేట్లు కూడా పెరుగుతాయంటున్నారు నిపుణులు. ఆత్మనిర్భర భారత్ కింద కేంద్రం మరిన్ని చర్యలు తీసుకోవాలి గానీ… ఇలా సరుకులు రాకుండా ఆలస్యం చేయడం సరికాదంటున్నారు. కానీ కేంద్రం… చైనా విషయంలో చాలా సీరియస్ గా ఉంది. చైనాకి కలిసొచ్చేలా ఏదీ జరగకుండా జాగ్రత్త పడుతోంది. క్రమంగా పరిస్థితులన్నీ భారత్ కి అనుకూలంగా మారేలా కేంద్ర వర్గాలు ప్రయత్నాలను ముమ్మరం చేశాయి.