Telangana Elections 2023: ఈసారి తెలంగాణ ఎన్నికల్లో సరికొత్త ట్రెండ్ కనిపిస్తోంది. ఎక్కడ చూసినా కొత్త అభ్యర్థులే బరిలో కనిపిస్తున్నారు. ఎన్నారైలు, డాక్టర్లు, ప్రభుత్వ మాజీ ఉద్యోగులు, నాయకుల వారసులు రాజకీయ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అదృష్టం కలిసి వస్తే ఎమ్మెల్యేలుగా అవతరించునున్నారు. గత రెండు ఎన్నికల్లో కనిపించని ఈ నవతరం.. ఈసారి కనిపిస్తుండడం.. అటు ఓటర్లలో సైతం ఒక రకమైన వాతావరణం కనిపిస్తుండడంతో.. అధికార బీఆర్ఎస్ కలవరపాటుకు గురవుతోంది. దాదాపు అన్ని పార్టీల నుంచి 100 మందికి పైగా కొత్తవారి ఎన్నికల బరిలో దిగడం విశేషం.
2014 రాష్ట్ర విభజన తరువాత ఉద్యమ తెలంగాణ నినాదంతో అన్ని పార్టీలు పోటీ చేశాయి. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ కంటే.. తెచ్చిన కెసిఆర్ కే తెలంగాణ ఓటర్ జై కొట్టాడు. అప్పట్లో ఉద్యమంలో పనిచేసిన నాయకులకు, కొత్త తరం నేతలకు కేసీఆర్ అవకాశం ఇచ్చారు. అప్పట్లో అది వర్కౌట్ అయింది. టిఆర్ఎస్ గెలుపునకు కారణమైంది. తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ సీనియర్లతో పోటీ చేయించింది. కానీ ఓటర్లు తిరస్కరించారు. సెటిలర్స్ ఉన్నచోట్ల తెలుగుదేశం పార్టీ ప్రభావం చూపింది. కానీ 2018కి సీన్ మారింది. కొత్త వ్యూహంతో అన్ని పార్టీలు పోటీ చేశాయి. కానీ కెసిఆర్ ఎత్తుగడల ముందు నిలబడలేకపోయాయి.
2019 ఎన్నికల్లో కెసిఆర్ బంగారు తెలంగాణ నినాదాన్ని ఎంచుకున్నారు. ఉద్యమ నాయకులను పక్కన పెట్టారు. అసలు ఉద్యమంతో సంబంధంలేని కాంగ్రెస్, టిడిపి నాయకులను చేరదీశారు. బంగారు తెలంగాణను సాధించుకుందామని.. తెలంగాణను అభివృద్ధి చేసేందుకు కొంతమంది నాయకులు అవసరమని చెప్పి టిక్కెట్లు కట్టబెట్టారు. ప్రజలకు అదే విషయాన్ని చెప్పుకొచ్చారు. ప్రజామోదం పొంది రెండోసారి అధికారంలోకి రాగలిగారు. అయితే గత రెండు ఎన్నికల్లో విజయం సాధించినంత ఈజీ.. ఈసారి కాదని కెసిఆర్ కు తెలుసు.
అదే సమయంలో గత రెండు ఎన్నికల్లో దెబ్బతిన్న కాంగ్రెస్ పార్టీ వ్యూహం మార్చింది. ఎక్కడికక్కడే యువతరాన్ని ఎంపిక చేసింది. సామాజిక, ఆర్థికంగా బలమైన అభ్యర్థులను బరిలోదించింది. ఈ క్రమంలో యువనాయకత్వాన్ని ఎంపిక చేయడం విశేషం. అటు భారతీయ జనతా పార్టీ సైతం వివిధ రంగాల ప్రముఖులను ఆహ్వానించి టికెట్లు కట్టబెట్టింది. బిఆర్ఎస్ మాత్రం సిట్టింగ్లకే నమ్ముకుంది. మెజారిటీ సీనియర్ నేతలకి టిక్కెట్లు ఇచ్చింది. విపక్షాలు మాత్రం నవతరానికి పెద్దపీట వేశాయి. అందుకే గత రెండు ఎన్నికల్లో చూడని చిత్ర విచిత్రాలు ఎన్నికల్లో కనిపిస్తున్నాయి. అసెంబ్లీకి ఎన్నికైన వారిలో యువకులే అధికంగా వస్తారన్న టాక్ వినిపిస్తోంది. మరి తెలంగాణ ఓటర్ నాడీ ఎలా ఉందో చూడాలి.