Mohan Babu: తెలుగు చిత్ర పరిశ్రమలో కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబుది విలక్షణ శైలి. ఉన్నది ఉన్నట్లు ఆయన మాట్లాడుతారు. కొన్ని విషయాల్లో ఎంతో ఆవేశంగా ఉంటారు. కొన్నిసార్లు లోతుగా మాట్లాడుతారు. ఇలా మాట్లాడే క్రమంలో ఎన్నో రకాల విమర్శలను మూటగట్టుకుంటారు. ప్రస్తుతం సినిమాలను విడిచిపెట్టి.. తిరుపతిలో తన యూనివర్సిటీ బాధ్యతలను చూసుకుంటున్నారు. ఎంత ఎత్తుకు ఎదిగినా.. ఒదిగి ఉండే తత్వం మోహన్ బాబుది. అయితే ఆయన తాజాగా చేసిన కుల వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో ఆయన పెద్ద కుమారుడు మంచు విష్ణు పాల్గొన్నారు. మోహన్ బాబు సొంతూరు మోదుగులపాలెం గ్రామస్తుల సమక్షంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం విశ్వవిద్యాలయం ప్రాంగణంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా తన చిన్ననాటి విషయాన్ని ఒకటి గుర్తు చేసుకున్నారు. నాడు కుల వివక్ష ఏ స్థాయిలో ఉందో కళ్ళకు కట్టినట్లు చూపించారు. ఆ వ్యాఖ్యలు ఎంతో ఆలోచింపజేశాయి.
ప్రాథమిక స్థాయి నుంచి నాకు కులం అంటే అసహ్యం అని మోహన్ బాబు చెప్పుకొచ్చారు. కులాలను ఎవడు కనిపెట్టాడో కానీ.. అవి కర్మ,గ్రహచారంగా అభివర్ణించారు.’ నేను అప్పుడు తొమ్మిదో తరగతి చదువుతుండేవాడిని. ఊరికి వచ్చినప్పుడు ఏ చెంగయ్య రారా టీ తాగుతామని తీసుకెళ్లాను. ఇద్దరం టీ తాగిన తర్వాత చెంగయ్యను ఏయ్ పోయి గ్లాస్ కడుక్కోరా అని టీ కొట్టు నిర్వాహకుడు చెప్పాడు. అప్పుడు నేను ఆగమని చెప్పాను. నీకేం తెలుసు నయ్యా. ఎక్కడో చదువుకుంటున్నావ్. ఇప్పుడు వచ్చావు ఊరికి. వాళ్లు అంటరాని వారు. వాళ్లను దగ్గరికి చేర్చకూడదు. వాళ్ల గ్లాసు మనం తాకకూడదు’ అని నాటి సంగతులను మోహన్ బాబు గుర్తు చేసుకున్నారు. ఆ మాటలు విని తాను చలించిపోయానని చెప్పారు. చెప్పు తీసి కొడతానని టీ కొట్టు నిర్వాహకుడికి హెచ్చరించా. చెంగయ్యను తీసుకుని అక్కడి నుంచి పారిపోయా. ఆరోజు సాయంత్రానికి పంచాయతీ పెట్టారు. మా నాన్నగారు మాకు మందలించారంటూ నాటి సంగతులను గుర్తు చేసుకున్నారు మోహన్ బాబు.