Mohan Babu : మోహన్ బాబు కి కోపం వచ్చింది. ఆయన పేరును రాజకీయంగా ఎవరో వాడుకుంటున్నారట. ఆయనకు తెలిసి బాధపడ్డారట. అందుకే ఇప్పుడు ఆయన స్ట్రైట్ వార్నింగ్ ఇస్తున్నారు. తన పేరును ఎక్కడైనా వాడితే చర్యలు తీసుకుంటానని హెచ్చరిస్తున్నారు. అయితే సరిగ్గా ఎన్నికల ముంగిటే మోహన్ బాబు ఈ తరహా ప్రకటన చేయడం ఏమిటని అందరూ ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఏ పార్టీలో ఉన్నారో తెలియడం లేదు. గత ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. వైసిపి కోసం ప్రచారం చేశారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన గురించి పట్టించుకునే వారు లేకపోయారు. ఆయనతో పాటు వైసీపీకి పని చేసిన 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి కి, పోసాని కృష్ణ మురళికి, చివరకు అలీకి సైతం పదవులు వచ్చాయి. కానీ సీఎం జగన్ కు బంధువైన మోహన్ బాబుకు మాత్రం ఏ పదవి రాలేదు.
అయితే మోహన్ బాబు ఇప్పటివరకు వైసీపీకి రాజీనామా చేయలేదు. అలాగని ఆ పార్టీతో సన్నిహిత సంబంధాలు కూడా తగ్గించేశారు. మొన్న ఆ మధ్యన చంద్రబాబును కలిశారు. ఎన్నికల ముంగిట సైలెంట్ గా ఉన్నారు. బిజెపిలో అధికారికంగా చేరతారని ప్రచారం జరుగుతోంది. సరిగ్గా ఇటువంటి సమయంలోనే రాజకీయాల కోసం తన పేరును వాడుకోవద్దని ప్రత్యేక ప్రకటన జారీ చేయడం విశేషం. అయితే ఎక్కడ తన పేరు వాడుకున్నారో మాత్రం చెప్పలేదు. అయితే ఎన్నికల ముంగిట మోహన్ బాబు ప్రకటన హాట్ టాపిక్ గా మారింది.
ప్రస్తుతం మోహన్ బాబు నటనకు దూరంగా ఉన్నారు. కుమారుడు విష్ణు హీరోగా రూపొందుతున్న భక్తకన్నప్ప చిత్రానికి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. రాజకీయాల్లో సైతం యాక్టివ్ గా లేరు. మోహన్ బాబు పెద్ద కుమారుడు విష్ణు భార్య సీఎం జగన్ కు సోదరి అవుతుంది. ఇక చిన్న కుమారుడు మనోజ్ భార్య భూమా మౌనిక తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. కుమార్తె లక్ష్మీ ప్రసన్న బిజెపికి వీరాభిమాని. మోడీకి నిత్యం పొగడ్తలతో ముంచెత్తుతారు. అయితే ఈ ఎన్నికల్లో మోహన్ బాబు కుటుంబం ఏ పార్టీ వైపు వెళ్తుందో చూడాలి. అయితే మోహన్ బాబు ప్రకటన మాత్రం చర్చనీయాంశంగా మారింది.