PM Modi Operation Sindoor: పహాల్గామ్ దాడి తర్వాత ఉగ్రవాద పాకిస్తాన్ దేశానికి భారత్ సరైన బుద్ధి చెప్పింది. ఆపరేషన్ సిందూర్ పాకిస్తాన్ కు, ఆ దేశంలో ఉన్న ఉగ్రవాద మూకలకు తిరుగులేని స్థాయిలో సమాధానం చెప్పింది. వాస్తవానికి ఆపరేషన్ సిందూర్ ద్వారా భారత్ పాకిస్తాన్ ను తీవ్రంగా దెబ్బ కొడుతుందని అందరు అనుకున్నారు. కానీ ఎవరూ ఊహించని విధంగా భారత్ ఒక్కసారిగా దాడులను నిలిపివేసింది. దీని వెనక అమెరికా ఉందని.. అమెరికా ఒత్తిళ్లకు భారత్ తలవంచిందని ప్రతిపక్షాలు ఆరోపించాయి. ఈ నేపథ్యంలో త్రివిధ దళాధిపతులు రంగంలోకి వచ్చారు. తమదైన శైలిలో సమాధానం చెప్పినప్పటికీ ప్రతిపక్షాలు ఊరుకోలేదు. పార్లమెంటు సమావేశాలలో కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసే ప్రయత్నాన్ని చేశాయి. కొందరు ఎంపీలయితే ఆపరేషన్ సిందూర్ అనేది ఒక డ్రామా అని కొట్టి పారేశారు. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పార్లమెంట్ లో మాట్లాడారు.
Also Read: ఫామ్ హౌస్ లో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు మంత్రాంగం.. ఏంటి కథ?
ఉగ్రవాద దేశంపై మన త్రివిధ దళాలు చేపట్టిన దాడుల్లో పాకిస్తాన్ తీవ్రంగా నష్టపోయిందని ప్రధాన నరేంద్ర మోడీ పేర్కొన్నారు. దాడులు మరింత తీవ్రతరమైతే మరింత నష్టపోయే ప్రమాదం ఉందని భావించిన పాకిస్తాన్..కాళ్ళ బేరానికి వచ్చిందని ప్రధాని పేర్కొన్నారు..” మాపై దాడులు చేయకండి. అత్యంత తీవ్రంగా నష్టపోయాం. మాకు కోలుకునే శక్తి లేదు. తట్టుకునే సామర్థ్యం లేదు. దాడులు ఆపండి. మమ్మల్ని ఇంకా ఇంకా చంపకండని పాక్ డిజిఎంఓ కు కాల్ చేసింది. బ్బాబ్బాబూ మమ్మల్ని వదిలేయండి అంటూ పాకిస్తాన్ అడుక్కుందని” ప్రధాని వెల్లడించారు.
దాయాది దేశంపై చేపట్టిన దాడుల పై ప్రతిపక్షాలు రకరకాల విమర్శలు చేస్తున్న నేపథ్యంలో పార్లమెంట్ సాక్షిగా ప్రధాని ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చారు. అనేక విషయాలను.. వెల్లడించారు. ఆపరేషన్ సిందూర్ లో భారత్ వెనకడుగు వేయలేదని.. అన్ని విధాలుగా ఆలోచించి రంగంలోకి దిగామని ప్రధాని స్పష్టం చేశారు. ప్రతిపక్షాల అనవసరంగా ఆరోపణలు చేస్తున్నాయని.. దేశ అంతర్గత భద్రత వ్యవహారాన్ని రాజకీయం చేస్తున్నాయని ప్రధాని మండిపడ్డారు.. మిగతా సమయంలో రాజకీయాలు చేసుకోవచ్చని.. ఇలాంటి సమయంలో అడ్డగోలుగా వ్యాఖ్యలు చేయడం సరికాదని ప్రధాని పేర్కొన్నారు.