కేంద్రంలోని మోడీ సర్కార్ పని మొదలుపెట్టింది. నిన్న ప్రధాని దేశ ప్రజలందరికీ టీకాలు ఉచితం అని ప్రకటన చేసిన మరునాడే.. వ్యాక్సిన్ కంపెనీలకు కేంద్రం భారీ ఆర్డర్లు ఇచ్చింది. భారీగా దేశంలో సార్వత్రిక వ్యాక్సినేషన్ వేసేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది.
ఏకంగా దేశంలోని వ్యాక్సిన్ కంపెనీలకు 44 కోట్ల డోసులకు పైగా ఆర్డర్ ను ఇచ్చినట్టు కేంద్రం ప్రకటించింది. కోవీషీల్డ్, కోవాగ్జిన్ టీకాల కోసం మంగళవారం ఈ భారీ ఆర్డర్లు ఇచ్చినట్టు తెలిపింది.
దేశంలో ప్రస్తతుం కోవీషీల్డ్, కోవాగ్జిన్ రెండు టీకాలు ఉత్పత్తి చేస్తున్నాయి. కోవీషీల్డ్ పంపిణీ చేస్తున్న పుణేకు చెందిన సీరం ఇన్ స్టిట్యూట్ కు కొత్తగా మరో 25 కోట్ల డోసులకు ఆర్డర్ ఇచ్చింది. ఇక భారత్ బయోటెక్ కోవాగ్జిన్ టీకా కంపెనీకి 19 కోట్ల డోసులకు ఆర్డర్ ఇచ్చింది. మొత్తంగా ఈ 44 కోట్ల టీకా డోసులు డిసెంబర్ కల్లా అందుబాటులోకి రానున్నాయని కేంద్రం తెలిపింది. టీకాల సేకరణ కోసం ఈ రెండు సంస్థలకు అదనంగా 30శాతం అడ్వాన్స్ విడుదల చేసినట్లు తెలిపింది.
ఇక హైదరాబాద్ కు చెందిన బయోలాజికల్-ఇ సంస్థ రూపొందించిన కార్బివాక్స్ టీకా 30 కోట్ల డోసుల కోసం కేంద్రం ఆర్డర్ ఇచ్చింది. ఇది సెప్టెంబర్ కల్లా అందుబాటులోకి వస్తుందని నీతి అయోగ్ సభ్యుడు వీకేపాల్ తెలిపారు.
ప్రస్తుతం రాష్ట్రాల వద్ద 1.19 కోట్ల టీకా డోసులు పంపిణీకి సిద్ధంగా ఉన్నట్టు కేంద్రం ప్రకటించింది. ఇప్పటివరకు 24కోట్లకు పైగా వ్యాక్సిన్ డోసులను రాష్ట్రాలకు పంపిణీ చేయగా..వీటిలో 23.47 కోట్ల డోసులు వేశారు. రాష్ట్రాల వద్ద ప్రస్తుతం 1.19 కోట్ల డోసులు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి.
మోడీ సర్కార్ ప్రస్తుతం పక్కా ప్రణాళికతో వ్యాక్సినేషన్ కు సిద్ధమైంది. మొత్తం 80 కోట్ల మందికి టీకాలు వేసేందుకు భారీగా ఆర్డర్లు ఇవ్వడం విశేషం.