న్యాయమూర్తులపై ఆరోపణలు చేస్తూ రాసిన లేఖ పెద్ద దుమారమే రేపుతోంది. దేశవ్యాప్తంగా బార్ అసోసియేషన్ల నుంచి విమర్శలు వస్తూనే ఉన్నాయి. అయితే.. ఇప్పుడు ఈ లేఖ అటు పీఎం మోడీ, ఇటు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు తలనొప్పులు తెచ్చిందట.
Also Read: రూట్ మార్చిన చంద్రబాబు: టార్గెట్ 2024.. ఏంటా కథ?
న్యాయమూర్తులపై ఫిర్యాదు చేస్తూ సీఎం జగన్ సీజేఐకి లేఖ రాయడమే కాకుండా ఆ లెటర్‌ను మీడియాకు విడదల చేశారు. అది కోర్టు ధిక్కరణ అవుతుందని పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. అయితే.. జగన్‌మోహన్‌రెడ్డి మాత్రం ఈ లేఖ విడుదలకు ముందు అటు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు.. ప్రధానమంత్రి నరేంద్రమోడీని కలిశారు. మరోవైపు పీఎం మోడీని కలిసిన రోజే సీజేఐకి ఫిర్యాదు లేఖ పంపినట్లుగా దానిపై తేదీ ఉంది. తాము కేంద్ర హోంమంత్రి, ప్రధానికి చెప్పిన తర్వాతనే ఈ ఫిర్యాదు చేశామని.. మీడియాకు విడుదల చేశామని ఇప్పుడు వైసీపీ నేతలు చెబుతున్నారు.
ఇది కాస్త ఇప్పుడు అంతర్గతపోరుకు దారితీసింది. ఏపీలో తాము ఏం చేసినా కేంద్రంలోని ప్రభుత్వ పెద్దలకు చెప్పే చేస్తున్నామని ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి పదే పదే చెబుతున్నారు. అధికారంలోకి వచ్చిన కొత్తలో తీసుకున్న వివాదాస్పద నిర్ణయాలు.. మూడు రాజధానుల వంటి వాటిని ముందుగానే బీజేపీ పెద్దలకు చెప్పారని వైసీపీ వర్గాలు చెప్పాయి. దానికి తగ్గట్లుగానే బీజేపీ రియాక్షన్ ఉంది. వైసీపీ నిర్ణయాలపై అటు బీజేపీ పెద్ద ల నుంచి కూడా పెద్దగా వ్యతిరేకత రావడం లేదు.ఇప్పుడు న్యాయవ్యవస్థ విషయంలోనూ.. తాము కేంద్ర పెద్దలకు చెప్పే దాడి చేస్తున్నామన్న అభిప్రాయాన్ని వైసీపీ నేతలు కల్పిస్తున్నారు.
అయితే.. న్యాయవ్యవస్థపై ఇలా దాడి చేయమని కేంద్రంలోని ఏ ప్రధాని కానీ, ఏ హోంశాఖ మంత్రి కానీ ప్రత్యక్షంగా చెప్పరు. అయినప్పటికీ.. వైసీపీ నేతలు మాత్రం తాము పెద్దల అనుమతితోనే లేఖ రాశామని చెప్పుకొస్తున్నారు. లేఖ విడుదల చేసే ముందు జగన్ ప్రధాని, హోంమంత్రిని కలవడమే దీనికి సాక్ష్యమంటున్నారు. దీంతో ఇప్పుడు అందరి చూపు కేంద్రంలోని పెద్దలపై పడింది. వారు ఈ అంశంపై స్పందించాలని కోరుతున్నారు.
Also Read: ఫైర్‌బ్రాండ్లను పక్కనపెట్టినట్లేనా..?
మరోవైపు న్యాయవర్గాలు కూడా ఆయన సీఎం పదవికి అర్హుడు కాదంటున్నాయి. న్యాయవ్యవస్థపై దాడి చేయడం అంటే ప్రజాస్వామ్యాన్ని ధిక్కరించడమేనని ఫైర్ అవుతున్నారు. దీంతో ఇప్పుడు బీజేపీ పెద్దలు కూడా ఏమీ మాట్లాడలేకపోతున్నారు. అటు వైసీపీ మద్దతుగా కానీ.. వ్యతిరేకంగా కానీ ఎలాంటి స్టేట్‌మెంట్లు ఇవ్వడం లేదు. అటు రాష్ట్ర బీజేపీ కూడా ఈ విషయాన్ని పక్కన పెట్టినట్లే తెలుస్తోంది. మరి చివరికి ఈ విషయం ఎటు దారితీస్తుందో తెలియకుండా ఉంది.