Homeజాతీయ వార్తలుSpecial status : ప్రత్యేకహోదా ఏపీకి అందని ద్రాక్షే.. పొత్తులో ఉన్నా ఏపీకి దెబ్బేసిన మోడీ.....

Special status : ప్రత్యేకహోదా ఏపీకి అందని ద్రాక్షే.. పొత్తులో ఉన్నా ఏపీకి దెబ్బేసిన మోడీ.. చంద్రబాబు పరపతి పనిచేయట్లేదా?*

Special status : ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలన్న డిమాండ్ చాలా రోజులుగా వినిపిస్తోంది. రాష్ట్ర విభజనతో ఏపీ అన్ని విధాలుగా నష్టపోయింది. ఆ నష్టాన్ని భర్తీ చేయాలంటే ప్రత్యేక హోదా తప్పనిసరి. 2014లో మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ అధికారంలోకి వచ్చింది.రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది. ఎన్డీఏ లో భాగస్వామిగా ఉంది.కానీ నాడు ప్రత్యేక హోదా సాధించలేకపోయింది తెలుగుదేశం పార్టీ. దీంతో అదే అంశాన్ని తీసుకొని గట్టిగా వాయిస్ వినిపించింది వైసిపి. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీ సైతం ప్రత్యేక హోదా సాధించలేకపోయింది. అయితే ఈసారి అనూహ్యంగా.. కేంద్రంలో బిజెపి సొంతంగా అధికారంలోకి అవసరమైన సీట్లు సాధించలేదు. టిడిపి సాధించిన 16 ఎంపీ స్థానాలు కీలకంగా మారాయి. జెడియు సాధించిన 12 ఎంపీ స్థానాలు సైతం ఎన్డీఏకు అవసరంగా మారాయి. ఈ రెండు పార్టీలు కోరిన కోర్కెలు తీర్చాల్సిన పరిస్థితి కేంద్రంపై ఏర్పడింది. ఏపీ కంటే ముందుగా బీహార్ ప్రత్యేక హోదా అడిగితే.. కేంద్ర ప్రభుత్వం అవకాశం లేదని తేల్చేసింది. ఏపీకి సైతం స్పష్టమైన సంకేతాలు పంపించింది.

* ప్రత్యేక హోదా ఆశించిన జేడీయు

మరి కొద్ది రోజుల్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మొన్నటివరకు ఆర్జెడితో జతకట్టిన నితీష్ కుమార్..బిజెపి వైపు వచ్చారు. ఎన్డీఏతో జత కట్టారు. బిజెపితో కలిసి అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు.అందుకే ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరారు. లేకుంటే ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ప్రకటించాలని సైతం డిమాండ్ చేశారు.ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం స్పందించింది. బీహార్ తో పాటు వెనుకబడిన రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కల్పించే ప్రణాళిక ఏదైనా ఉందా? అని జెడియుఎంపి ఒకరు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిని ప్రశ్నించారు.దీనికి ప్రభుత్వం రాతపూర్వక సమాధానం ఇచ్చింది. బీహార్ కు ప్రత్యేక హోదా ఇచ్చే ప్రతిపాదన ఏదీ లేదని పార్లమెంట్ వేదికగా తేల్చేశారు. దీంతో ఏపీకి సైతం ప్రత్యేక హోదా లేనట్టేనని తేలిపోయింది.

* ఐదు అర్హతలు ఉంటేనే హోదా

తాజాగా పార్లమెంట్లో ప్రకటన చేసిన కేంద్రం ప్రత్యేక హోదా విషయంలో అర్హతలను ప్రకటించింది. 1.పర్వతాలు, కఠినమైన భౌగోళిక స్వరూపం
2. తక్కువ జనసాంద్రత, గిరిజన జనాభా అధికం
3. పక్క దేశాలతో సరిహద్దు కలిగి ఉండడం
4. ఆర్థిక, పారిశ్రామిక వెనుకబాటుతనం
5. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉండటం
..ఈ ఐదు అర్హతలు ఉన్న రాష్ట్రాలకే ప్రత్యేక హోదా ఇస్తామని కేంద్రం స్పష్టం చేసింది. అది కూడా నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ సూచించిన రాష్ట్రాలకే ఇది వర్తిస్తుందని తేల్చి చెప్పింది. తాజాగా బీహార్ కు ఈ అర్హతలు లేవని కేంద్రం స్పష్టం చేసింది. దీని ప్రకారం ఏపీకి కూడా ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశం లేనట్లు తెలుస్తోంది.

* విపక్షాలకు ఆయుధం
ఎన్డీఏ ప్రభుత్వంలో టిడిపి కీలక భాగస్వామి. దేశవ్యాప్తంగా బిజెపి గెలుచుకున్నవి 244 స్థానాలు మాత్రమే. మ్యాజిక్ ఫిగర్ కు దూరంగా ఉండిపోయింది బిజెపి బలం.అందుకే టిడిపి సాధించిన 16 ఎంపీ సీట్లు, జేడీయు 12 స్థానాలు కీలకంగా మారాయి.ఆ రెండు పార్టీల అవసరం మోడీకి ఏర్పడింది. దీంతో ఆ రెండు పార్టీల కోర్కెలు తీర్చాల్సిన అనివార్య పరిస్థితి ఎదురైంది. ఏపీకి సంబంధించి ప్రత్యేక హోదా ఇవ్వాలని ఎప్పటినుంచో డిమాండ్ ఉంది. సరిగ్గా ఇప్పుడు ఎన్డీఏకు టిడిపి అవసరం ఉండడంతో డిమాండ్ చేయాలని ప్రతిపక్షాల నుంచి ఒత్తిడి ఎదురవుతోంది. ఇదే ఖచ్చితమైన సమయమని కాంగ్రెస్ పార్టీ నేత జైరామ్ రమేష్ గుర్తు చేశారు కూడా. అయితే కేంద్రం తీరు చూస్తుంటే ప్రత్యేక హోదాతో ఆర్థిక భారం తప్పదని భావిస్తోంది. అందుకే లేనిపోని షరతులను తెరపైకి తెస్తోంది. ఇప్పుడు బీహార్ విషయంలో పూర్తిగా స్పష్టతనిచ్చింది. తద్వారా చంద్రబాబుకు సైతం సంకేతాలు ఇచ్చింది. అయితే ఇటీవల చంద్రబాబు హోదా కోసం కాకుండా.. అమరావతి రాజధాని, పోలవరం ప్రాజెక్టు పైన ఎక్కువ దృష్టి సారించారు. ఆర్థిక లోటును భర్తీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ విపక్షాల నుంచి మాత్రం ప్రత్యేక హోదా డిమాండ్ వినిపిస్తూనే ఉంది. ఒకవేళ ఏపీకి కూడా ఇవ్వలేమని కేంద్రం తేల్చి చెబితే మాత్రం.. రాజకీయంగా చంద్రబాబు ఇరాకాటంలో పడే అవకాశం ఉంది. ప్రతిపక్షాలకు అదో విమర్శనాస్త్రంగా మారనుంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular