Jhalmuri Seller: రూ.10 వ్యాపారం చేసుకునే ఓ చిరు వ్యాపారి బెంగాల్ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేశాడు. ఆయన చేసిన చిన్నపని 70 ఏళ్ల బెంగాల్ రాజకీయ చరిత్రను మలుపు తిప్పింది. రూ.10 రూపాయల మరమరాలు అమ్మడంతో అతను హీరో అయ్యాడు. అయితే ఇప్పుడు అదే అతనికి ప్రాణ గండంగా మారింది. నిత్యం బెదిరింపులతో వణికిపోతున్నాడు. ఆ ప్యాపారి పేరు విక్రమ్ కుమార్ సౌ. బెంగాల్ ఎన్నికల సమయంలో ప్రధాని నరేంద్రమోదీకి మరమరాలు(ఝాల్ ముఠి) అమ్మింది ఇతనే.
ఏం జరిగిందంటే..
పశ్చిమ బెంగాల్‌లోని ఝార్గ్రామ్లో ఏప్రిల్ 19, 2026న జరిగిన ఒక చిన్న సంఘటన రాజకీయ, సామాజిక దృక్పథాన్ని మరోసారి బయటపెట్టింది. ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారం మధ్య ఒక చిన్న రోడ్‌సైడ్ స్టాల్ వద్ద ఆగి, స్థానిక ప్రత్యేకతైన ఝాల్‌మురి (మసాలా మరమరాలు) తిన్నాడు. కానీ ఆ సంఘటన ఇప్పుడు ఒక సాధారణ వ్యాపారి జీవితాన్ని భయాందోళనల్లోకి నెట్టేసింది.ఝార్‌గ్రామ్‌లోని కాలేజ్ మోర్ వద్ద 12 ఏళ్లుగా మరమరాలు, ఝాల్‌మురి విక్రయిస్తున్న విక్రమ్ కుమార్ సౌ అనే వ్యాపారి బీహార్‌లోని గయ నుంచి వచ్చి స్థిరపడిన వ్యక్తి. ప్రధాని మోదీ కాన్వాయ్ ఆపి, తన షాపు వద్ద ఆగి రూ.10 ఝాల్‌మురి కోరడం, డబ్బు ఇవ్వడానికి ప్రయత్నించినప్పుడు ‘‘మీరు మా ప్రధాని, డబ్బు వద్దు’’ అని నిరాకరించడం, ‘‘ఉల్లిపాయలు తింటారా?’’ అని అడగ్గా మోదీ ‘‘తింటాను, తలలు తినను’’ అని చమత్కరించడం.. ఈ దృశ్యాలు వైరల్ అయ్యాయి. ఈ చిన్న సంభాషణ బెంగాల్ ఎన్నికలలో బీజేపీకి మంచి ప్రచార సాధనంగా మారిందని కొందరు విశ్లేషిస్తున్నారు. మమతా బెనర్జీ కూడా దీన్ని ‘‘డ్రామా’’ అని విమర్శించారు.
మారిన విక్రమ్ సౌ జీవితం..
ఎన్నికల తర్వాత విక్రమ్ సౌ జీవితం పూర్తిగా మారిపోయింది. మతోన్మాదుల అసహనం ఎన్నికల ఫలితాల తర్వాత విక్రమ్ సాహోకు పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి అనుమానాస్పద ఫోన్ కాల్స్, వాట్సాప్ వీడియో కాల్స్ వస్తున్నాయి. ‘‘బాంబుతో పేల్చేస్తాం’’, ‘‘చంపేస్తాం’’ అని బెదిరింపులు వస్తున్నాయి. కొందరు బెంగాలీ, మరికొందరు ఉర్దూ భాషలో మాట్లాడుతున్నారని ఆయన తెలిపారు. మే 21న ఆయన జార్గ్రామ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి, ఆయనకు భద్రత కల్పించారు. ఒక సాధారణ వ్యాపారి తన వృత్తి నిర్వహిస్తూ ప్రధాన మంత్రిని సాదరంగా స్వీకరించడం ఎందుకు కొందరిని ఇంతగా కలచివేస్తోంది? ఇది కేవలం రాజకీయ వ్యతిరేకత కాదు. ఇది మతోన్మాద అసహనం. భిన్నాభిప్రాయాలను, సాధారణ సంబంధాలను కూడా సహించలేని మనస్తత్వం.
దేశంలో విభజనకు నిదర్శనం..
ఈ సంఘటన భారతదేశంలో ఇప్పటికీ ఉన్న లోతైన విభజనను బయటపెడుతుంది. ఒక వైపు సాధారణ ప్రజలు రాజకీయ నాయకులతో సహజంగా మమేకమవుతున్నారు. మరో వైపు, కొందరు దీన్ని ‘‘దేశద్రోహం’’గా చూసి హింసాత్మక బెదిరింపులకు దిగుతున్నారు. విక్రమ్ సౌ వంటి వ్యక్తులు రాజకీయాల్లోకి రావడం లేదు. వారు తమ రోజువారీ జీవనం సాగిస్తున్నారు. వారి షాపు ముందు ప్రధాని ఆగడం ఒక అవకాశం, ఒక గర్వకారణం. దీన్ని ఎన్నికల ఫలితాలకు ఏకైక కారణం అనడం అతిగా ఉంది. ఎన్నికలు ఎన్నో అంశాలపై ఆధారపడతాయి. అభివృద్ధి, ఉపాధి, స్థానిక సమస్యలు, నాయకత్వం. కానీ ఇలాంటి బెదిరింపులు సమాజంలో భయం సృష్టిస్తాయి. ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడికి తన అభిప్రాయం వ్యక్తం చేసే హక్కు ఉంది. ఒక వ్యాపారి తన ఉత్పత్తి అమ్మడం ద్వారా రాజకీయ నాయకుడిని సత్కరించడం కూడా అందులో భాగమే. దీన్ని లక్ష్యంగా చేసుకోవడం అంటే, సహనం, లౌకికత్వంపై దాడి చేయడమే.
తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం..
పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం (ప్రస్తుతం సువేందు అధికారి నేతృత్వంలో) ఈ కేసును తీవ్రంగా పరిశీలించి, విక్రమ్ సౌ కుటుంబానికి పూర్తి భద్రత కల్పించింది. ఇలాంటి బెదిరింపులు మరలా జరగకుండా చర్యలు చేపట్టింది. ఫోన్ కాల్స్‌పై విచారణ చేపట్టాంది. సిగ్నల్స్ ఆధారంగా నిందితులను గుర్తించే పని చేస్తున్నారు. పోలీసులు.
విక్రమ్ సాహో కథ ఒక చిన్న వ్యాపారి యొక్క అమాయకత్వం, దాన్ని తట్టుకోలేని కొందరి అసహనం మధ్య సంఘర్షణను చూపిస్తుంది. భారతదేశం వైవిధ్యాల దేశం. ఇక్కడ ఝాల్‌మురి తినడం కూడా రాజకీయం అయితే, మన సమాజం ఎంత దూరం వెళ్లిందో అర్థమవుతుంది. సాధారణ ప్రజలు భయపడకుండా తమ వృత్తి చేసుకోగలిగే వాతావరణం సష్టించడమే నిజమైన ప్రజాస్వామ్యం.
