India Smart Border Project: భారతదేశం తన సార్వభౌమత్వాన్ని, సామాజిక స్థిరత్వాన్ని కాపాడుకోవాలంటే సరిహద్దు రక్షణలో రాజీ లేని వైఖరి అవసరం. హామీలు, రాజకీయ ప్రకటనలు మాత్రమే సరిపోవు. అక్రమ చొరబాట్లు దేశ భద్రతకు, ఆర్థిక వనరులకు, స్థానిక డెమోగ్రాఫిక్ సమతుల్యానికి తీవ్ర ముప్పుగా మారాయి. ఈ నేపథ్యంలో హోం మంత్రి అమిత్ షా ప్రకటించిన ‘స్మార్ట్ బార్డర్’ ప్రాజెక్ట్ సమయోచితమైన, అవసరమైన చర్యగా కనిపిస్తోంది.
ప్రపంచ సరిహద్దు సవాళ్లు..
ప్రపంచంలో అత్యధిక సరిహద్దు దేశాలు ఉన్న దేశాల్లో చైనా, రష్యా మొదటి స్థానంలో ఉన్నాయి. రెండు దేశాలు 14 దేశాలతో సరిహద్దులు పంచుకుంటాయి. తర్వాత బ్రెజిల్ (10 దేశాలు) వస్తుంది. భారత్ ఆరు నుంచి ఏడు దేశాలతో (పాకిస్తాన్, చైనా, నేపాల్, భూటాన్, మయన్మార్, బంగ్లాదేశ్, అఫ్ఘానిస్తాన్‌లో కొంత భాగం) సరిహద్దులు కలిగి ఉంది. ఇందులో బంగ్లాదేశ్‌తో మాత్రమే సుమారు 4,096 కి.మీ. పొడవైన సరిహద్దు ఉంది. ఈ సరిహద్దు అడవులు, నదులు, గ్రామాల మధ్య ఉండటం వల్ల నియంత్రణ కష్టం. నేపాల్ సరిహద్దు కూడా తెరచి ఉంచబడింది. ఇలాంటి పరిస్థితుల్లో అక్రమంగా వచ్చే వలసదారుల సంఖ్య భారీగా ఉంది.
దేశంలోకి అక్రమ వలసలు..
బంగ్లాదేశ్ నుంచి, నేపాల్ నుంచి వచ్చే అక్రమ చొరబాటుదారులు ఉత్తర–తూర్పు రాష్ట్రాలు, పశ్చిమ బెంగాల్, బీహార్, ఢిల్లీ, ముంబై వంటి ప్రాంతాల్లో స్థిరపడుతున్నారు. రోహింగ్యా ముస్లిం శరణార్థుల సమస్య మరింత సంక్లిష్టం చేసింది. లీగల్‌గా వచ్చి చట్టబద్ధంగా జీవించేవారికి సమస్య లేదు. కానీ ఇల్లీగల్ ఎంట్రీలు ఉపాధి అవకాశాలు, భూమి, సబ్సిడీలు, రేషన్ కార్డులపై ఒత్తిడి తెస్తాయి. స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు తగ్గడం, సామాజిక ఉద్రిక్తతలు పెరగడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి.
స్మార్ట్ బార్డర్‌తో పరిష్కారం..
అమిత్ షా ప్రకటన ప్రకారం, సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్) కోసం స్మార్ట్ బార్డర్ వ్యవస్థ ఏర్పాటు చేయనున్నారు. ఇందులో ప్రధాన అంశాలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత సర్వైలెన్స్, హై–రిజల్యూషన్ కెమెరాలు, థర్మల్ ఇమేజింగ్, రాడార్లు, డ్రోన్లు, ఆటోమేటిక్ గ్రౌండ్ సెన్సార్లు, రియల్ టైమ్ మానిటరింగ్ సెంటర్లు, చీకటి, జలాశయాలు, అడవుల గుండా చొరబడే వారిని గుర్తించడం ఈ వ్యవస్థ ద్వారా సాధ్యమవుతుంది. ఇజ్రాయెల్ తన గాజా, లెబనాన్ సరిహద్దుల్లో ఇలాంటి అత్యాధునిక వ్యవస్థలను వాడి సొరంగాలు, టన్నెల్స్ కూడా గుర్తించి అడ్డుకుంటోంది. చైనా తన పశ్చిమ సరిహద్దుల్లో ఇప్పటికే ఇలాంటి టెక్నాలజీని అమలు చేస్తోంది. అమెరికా మెక్సికో సరిహద్దులో గోడలు, ఎలక్ట్రానిక్ సర్వైలెన్స్ పెంచి అక్రమ వలసలను నియంత్రించడానికి ప్రయత్నాలు చేస్తోంది.
భారత్‌కు తప్పనిసరి..
ప్రస్తుత పరిస్థితుల్లో భారత్‌కు కూడా ఇలాంటిస్మార్ట్ టెక్నాలజీ అవసరం. ఇందుకు భారీ ఆర్థిక వ్యయం అవసరం అయినా, దీర్ఘకాలిక దృక్పథంతో ఖర్చు చేయాలి. విదేశాల్లో భారతీయులపై పెరుగుతున్న వ్యతిరేకతఈ సమయంలో విదేశాల్లో భారతీయులపై నెరేటివ్ కూడా మారుతోంది. తైవాన్‌లో ఒక నాయకుడు తాను అధ్యక్షుడు అయితే ‘‘భారతీయులను అనుమతించను’’ అని వ్యాఖ్యానించడం, చర్మం రంగు, సంస్కృతి తేడాలను సూచించడం గమనార్హం (తర్వాత క్షమాపణ చెప్పారు). వియత్నాం, జపాన్ వంటి దేశాల్లో కూడా భారతీయ కార్మికులు, విద్యార్థులపై సందేహాలు, వ్యతిరేక ఉద్యమాలు వస్తున్నాయి. ఇలాంటి సంఘటనలు మనకు ఒక పాఠం.
అక్రమ చొరబాట్లను అడ్డుకోవాలంటే కేవలం బీఎస్‌ఎఫ్ సైనికుల సంఖ్య పెంచడం సరిపోదు. టెక్నాలజీ, చట్టపరమైన కఠినత్వం, రాజకీయ సంకల్పం కలిసి ఉండాలి. స్మార్ట్ బార్డర్ ప్రాజెక్ట్ విజయవంతం కావాలంటే కేంద్రం–రాష్ట్రాల మధ్య సమన్వయం, తగిన బడ్జెట్ కేటాయింపు అత్యంత ముఖ్యం.భారత్ ఒక సార్వభౌమ దేశం. తన జనాభా, వనరులు, సంస్కృతిని కాపాడుకునే హక్కు దానికి ఉంది. ఇది మతం లేదా ప్రాంతీయతతో సంబంధం లేని జాతీయ భద్రతా సమస్య. సహనం మంచిదే కానీ, ఆ సహనం దేశ భవిష్యత్తును రాజీ పడేస్తే అది బలహీనతగా మారుతుంది. అక్రమ చొరబాట్లను అడ్డుకోవడం ద్వారా మాత్రమే మనం నిజమైన లౌకికత్వం, సామాజిక సామరస్యాన్ని కాపాడగలం. స్మార్ట్ బార్డర్‌లు ఈ దిశలో ముఖ్యమైన అడుగు. ఈ ప్రాజెక్ట్‌ను వేగంగా, పారదర్శకంగా అమలు చేసి, భారత్ తన సరిహద్దులను 21వ శతాబ్దానికి తగ్గట్టుగా బలోపేతం చేయాలి.
