Homeజాతీయ వార్తలుPM Modi- E.D: మోడీ ఆదేశిస్తున్నాడు: ఈడి పాటిస్తోంది.. ఈ ఎనిమిదేళ్లలో లక్ష కోట్లు సీజ్...

PM Modi- E.D: మోడీ ఆదేశిస్తున్నాడు: ఈడి పాటిస్తోంది.. ఈ ఎనిమిదేళ్లలో లక్ష కోట్లు సీజ్ చేసింది

PM Modi- E.D: ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దూకుడు మామూలుగా లేదు. మరి ముఖ్యంగా బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత, మోదీ ప్రధాని అయ్యాక చెలరేగిపోతోంది. కేవలం ఎనిమిదేళ్లలో లక్ష కోట్లు సీజ్ చేసింది. మనీ లాండరింగ్ కి సంబంధించి రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, బ్యూరోక్రాట్లపై వరుస దాడులు చేస్తోంది. రాజకీయ నాయకుల విమర్శలు, ప్రతి విమర్శలు ఎలా ఉన్నా… గడిచిన 8 ఏళ్లల్లో ఈడి అధికారులు 3,010 చోట్ల దాడులు చేసి, లక్ష కోట్ల విలువైన సొత్తును సీజ్ చేశారు. 2004 నుంచి 2014 వరకు పోలిస్తే ఇది 27 రెట్లు ఎక్కువ. యూపీఏ హయాంలో 112 చోట్ల ఈడి దాడులు జరగా.. అప్పటి నుంచి ఇప్పటిదాకా మొత్తం 5,422 కేసులు నమోదు చేసింది. అయితే ఈ కేసుల్లో నిందితులకు శిక్షలు విధించే విషయంలో మాత్రం ఈడి చాలా వెనుకబడి ఉంది. ఈ 18 ఏళ్లల్లో 25 మందికి మాత్రమే ఆయా కేసుల్లో శిక్షలు ఖరారయ్యాయి.

PM Modi- E.D
PM Modi

ఇంతకీ ఆ డబ్బు ఎక్కడ ఉంది

గడచిన మూడు నెలల్లో 100 కోట్లకు పైగా నగదును ఈడీ అధికారులు సీజ్ చేశారు. అయితే ఈడి సీజ్ చేసిన సొమ్మును ఎక్కడ భద్రపరుస్తారు? దీనిని ప్రభుత్వం వాడుకోవచ్చా? అనే సందేహాలు ప్రతి ఒక్కరిలో వ్యక్తమౌతూ ఉంటాయి. మనీలాండరింగ్ నిరోధక చట్టం సెక్షన్ 9 ప్రకారం ఈ డి దాడులు జరగగానే పెద్ద మొత్తంలో నగదు పట్టుబడితే భారతీయ స్టేట్ బ్యాంక్ అధికారుల సమక్షంలో లెక్కింపు చేపడతారు. లభ్యమైన నగదుకు సంబంధించి నిందితులను వివరణ అడుగుతారు. సరైన వివరణ లేకున్నా, ఒకవేళ నిందితులు వివరణ ఇవ్వలేకపోయినా, నిందితులు ఇచ్చిన వివరణతో అధికారులు సంతృప్తి చెందకపోయినా ఆ డబ్బును అధికారులు సీజ్ చేస్తారు. నిందితులు ఇచ్చే వివరణ సంతృప్తికరంగా ఉంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు. ప్రధానంగా అధికారులు దాడి చేసినప్పుడు సరైన వివరణ నిందితులు ఇవ్వనప్పుడు ఈడీ ఆ నగదును లెక్కల్లోకి రాని డబ్బు కింద జమ కట్టి సీజ్ చేస్తుంది. ఈ మేరకు అధికారుల సమక్షంలో పంచనామ నిర్వహించి నిందితులకు సవివర సి జ్యూర్ మోమో జారీ చేస్తుంది.

ఆస్తుల స్వాధీనంలోనూ అంతే

మనీ లాండరింగ్ కు పాల్పడిన కేసుల్లో ఈడి ఆస్తులను అటాచ్ చేస్తుంది. ఈ ప్రక్రియ జరిగిన 180 రోజుల్లో గా నిందితుల నేరాన్ని కోర్టుల్లో ఈడి అధికారులు రుజువు చేయాల్సి ఉంటుంది. లేనిపక్షంలో నిందితులు తమ ఆస్తులను అటాచ్మెంట్ నుంచి విడిపించుకునేందుకు అప్పిలేట్ అథారిటీ, తర్వాత కోర్టులను ఆశ్రయించే వెసల్బాటు ఉంటుంది. ఒకవేళ ఈ డి నేరాన్ని రుజువు చేసిన పక్షంలో సీజ్ చేసిన ఆస్తులు కేంద్ర ప్రభుత్వ ఖజానాకు వెళ్లిపోతాయి. కొన్ని కేసుల విషయాల్లో సంవత్సరాల తరబడి విచారణ జరుగుతుంది కాబట్టి.. ఆ కేసు తేలే వరకు స్వాధీనం చేసుకున్న డబ్బును సంబంధిత రాష్ట్రాల్లోని ఈడి వ్యక్తిగత పద్దుల ఖాతా ఉన్న ఎస్బిఐ బ్రాంచ్ లో అధికారులు డిపాజిట్ చేస్తారు. ఆ డబ్బును బ్యాంకులు గానీ, ఈడి గానీ, కేంద్ర ప్రభుత్వం గానీ వాడుకునేందుకు వీలు ఉండదు. ఒకవేళ బ్యాంకు మోసాలకు సంబంధించిన కేసుల్లో అయితే ఆ నగదును బాధిత బ్యాంకు అధికారులకు బదిలీ చేస్తారు. ఇలా ఈ 18 ఏళ్లలో బ్యాంకర్లకు 8,441 కోట్లను ఈడి అధికారులు బదిలీ చేశారు. దేశంలో సంచలనం సృష్టించిన విజయ్ మాల్యా, నీరవ్ మోడీ, మోహుల్ చోక్సీ కి సంబంధించిన 23 వేల కోట్ల విలువైన ఆస్తులను ఈడి అధికారులు అటాచ్ చేశారు. వాటిని ఆయా బ్యాంకులకు అప్పగించారు.

PM Modi- E.D
PM Modi

ట్రావెల్ ఏజెంట్ పై నమోదు చేసిన కేసులో ఈడీకి చుక్కెదురు

ముందే చెప్పుకున్నట్టుగా ఈడి అధికారులు లెక్కలోకి రాని డబ్బును సీజ్ చేసినప్పుడు.. ఆ నేరాన్ని 180 రోజుల్లోగా నిరూపించాలి. లేనిపక్షంలో నిందితుడు అప్పిలేట్ అథారిటీ, కోర్టుకు వెళ్లే హక్కు ఉంది. 1995లో మానాక్ కాలా అనే ట్రావెల్ ఏజెన్సీ యజమాని ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు జరిపారు. 7.95 లక్షలు సీజ్ చేశారు. ఈ నగదును లెక్కల్లోకి రాని డబ్బు కింద జమ కట్టారు. అతడికి 75 లక్షల జరిమానా విధించారు. అయితే కేసు ఎటూ తేలక పోవడంతో మానాక్ 2014లో అప్పీలేట్ అథారిటీని ఆశ్రయించారు. అక్కడ జరిమానా తగ్గిందే గానీ.. డబ్బు మాత్రం వెనక్కి రాలేదు. దీంతో అతడు ట్రెబ్యునల్ కు వెళ్లాడు. అక్కడ అతని అప్పీల్ ను కొట్టి వేయగా, హై కోర్టును ఆశ్రయించాడు. 2020లో తీర్పు వచ్చింది. మానాక్ వద్ద 7.95 లక్షల ను సీజ్ చేయడం సరికాదని అభిప్రాయ పడ్డ కోర్టు.. ఆ మొత్తాన్ని అతడికి తిరిగి ఇచ్చేయాలని, ఏడాదికి ఆరు శాతం చొప్పున వడ్డీ చెల్లించాలని తీర్పు చెప్పింది. దీంతో ఈడి అధికారులు నాలుక కరుచుకుని సీజ్ చేసిన నగదును, వడ్డీతో సహా చెల్లించారు. కాగా ప్రస్తుతం దేశంలో ఈడి విస్తృతంగా దాడులు చేస్తున్న నేపథ్యంలో ప్రతిపక్షాలు తీవ్రంగా ఆరోపణలు చేస్తున్నాయి. ఆయనప్పటికీ ఈడి అధికారులు వెరవడం లేదు.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version