Modi: పార్లమెంట్‌ ఎన్నికల్లో గెలుపు కోసం మోదీ వేసిన బిగ్‌ బాంబ్‌ ఇదీ

Modi: గతేడాది డిసెంబర్‌లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ.. ప్రధాని నరేంద్రమోదీ స్వయంగా ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని ప్రకటించారు.

Written By: Raj Shekar, Updated On : January 19, 2024 5:31 pm
Follow us on

Modi: ఎస్సీ వర్గీకరణ విషయంలో కేంద్రం మరో ముందడుగు వేసింది. కేబినెట్‌ కార్యదర్శి రాజీవ్‌ గౌబ నేతృత్వంలో ఐదురుగు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసింది. హోం, న్యాయ, గిరిజన, సామాజిక న్యాయ శాఖల కార్యదర్శులను కమిటీలో సభ్యులుగా నియమించింది.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ…
గతేడాది డిసెంబర్‌లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ.. ప్రధాని నరేంద్రమోదీ స్వయంగా ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని ప్రకటించారు. ఎమ్మార్పీస్‌ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఎల్సీ స్టేడియంలో నిర్వహించిన మాదిగల విశ్వరూ సభకు మోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ విన్నపాన్ని తెలుసుకున్న మోదీ.. తర్వాత తన ప్రసంగంలో ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని, ఎస్సీల్లోని వెనుకబడిన వర్గాల ఆవేదనను అర్థం చేసుకున్నామని ప్రకటించారు. ఈ సమయంలో మంద కృష్ణ మాదిగ కంటతడి పెట్టారు. మోదీని ఆలింగనం చేసుకుని కృతజ్ఞతలు తెలిపారు. ఈ ప్రకటనతో తెలంగాణలో మాదిగల ఓట్లు బీజేపీకి పోలరైజ్‌ అవుతాయని విశ్లేషకులు అంచనా వేశారు. కానీ, ఎన్నికల తర్వాత ఫలితాలు ఇందుకు భిన్నంగా వచ్చాయి. మోదీ ప్రకటనను మాదిగలే విశ్వసించినట్లు కనిపించలేదు. ఈ ఎన్నికల్లో బీజేపీ సింగిల్‌ డిజిట్‌కే పరిమితమైంది.

మాటకు కట్టుబడి..
ఇక తెలంగాణలో ఫలితాలు వ్యతిరేకంగా వచ్చాయని మోదీ ఇచ్చిన మాటను వెనక్కి తీసుకోలేదు. ఎస్సీ వర్గీకరణపై ముందుకే వెళ్లాలని నిర్ణయించారు. దేశ వ్యాప్తంగా ఎస్సీ వర్గీకరణ కోసం కమిటీ వేస్తామని హైదరాబాద్‌లోనే ప్రకటించిన మోదీ.. రెండు నెలల తర్వాత జనవరి 19న కమిటీని ప్రకటించారు. కేబినెట్‌ కార్యదర్శి రాజీవ్‌ గౌబా నేతృత్వంలో ఐదుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేశారు. గతంలో సుప్రీం కోర్టు కూడా ఎస్సీ వర్గీకరణ అంశంపై ఏడుగురు సభ్యులు రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేయాలని సూచించింది.

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలోనే..
ఇదిలా ఉండగా మరో నెల రోజుల్లో లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే మోదీ మళ్లీ ఎస్సీ వర్గీకరణ అంశాన్ని తెరపైకి తెచ్చారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. విశ్లేషకులు కూడా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసి రెండు నెలలవుతోందని, వర్గీకరణ అంశంపై ఇన్నాళ్లూ స్పందించని మోదీ, తాజాగా లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ వచ్చే సమయంలో కమిటీ ఏర్పాటు చేయడం రాజకీయ ఎత్తుగడే అన్న చర్చ జరుగుతోంది.

22న తొలి సమావేశం..
ఇదిలా ఉండగా ఎస్సీ వర్గీకరణ కోసం ఏర్పాటు చేసిన కమిటీ ఈనెల 22న తొలి సమావేశం కానున్నట్లు తెలిసింది. 22న అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం ఉంది. ఆరోజు చాలా మంచి రోజు కావడంతో అదే రోజు కమిటీ తొలి సమావేశం నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం. తొలి భేటీలో సాధారణ అంశాలపై చర్చిస్తారని, వర్గీకరణకు మార్గదర్శకాలు రూపొందించుకుంటారని తెలుస్తోంది.