Modi Government: పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు గంట గంటకూ పెరుగుతున్నాయి. ఉగ్రవాదుల వెనక ఉన్న పాకిస్థాన్‌తో దౌత్య సంబంధాలు తెంచుకోవాలని భారత్ నిర్వహించింది. ఈ క్రమంలో సింధు నది నీటి విషయంల 1960 నాటి ఒప్పందం రద్దు చేసింది. భారత్‌లోని పాకిస్థానీల వీసాలు రద్దు చేసింది. కొత్తగా వీసాలు ఇవ్వొద్దని ఆదేశించింది. మరోవైపు ఉగ్రవాదుల ఏరివేతకు చర్యలు చేపట్టింది. ఈ తరుణంలో ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న టెన్షన్ పాకిస్థాన్‌లో నెలకొంది. మరోవైపు భారత్ తీసుకుంటున్న చర్యలు ఎప్పటికప్పుడు మీడియాలో ప్రసారం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది.
Also Read: దేనికైనా సిద్ధం.. భారత సైన్యం ధీరోదాత్త సందేశం!
జాతీయ భద్రత పరిరక్షణ కోసం మీడియా సంస్థలు, డిజిటల్ వేదికలు, సామాజిక మాధ్యమ వినియోగదారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, చట్టాలను ఖచ్చితంగా పాటించాలని ప్రభుత్వం సూచించింది. రక్షణ, భద్రతా కార్యకలాపాలకు సంబంధించిన విషయాలను వార్తలుగా ప్రసారం చేసేటప్పుడు సంయమనం పాటించాలని కోరింది.
ప్రత్యక్ష ప్రసారంపై నిషేధం
రక్షణ కార్యకలాపాలు, భద్రతా బలగాల సంచారం గురించి ప్రత్యక్ష ప్రసారం, దృశ్యాల పంపిణీ, ఊహాగానాల ఆధారంగా వార్తలు ప్రచురించడం నిషేధం. అకాల సమాచార బహిర్గతం శత్రు శక్తులకు సహాయపడి, కార్యకలాపాల సామర్థ్యాన్ని, సిబ్బంది భద్రతను ప్రమాదంలోకి నెట్టవచ్చు.
గత సంఘటనల నుంచి పాఠాలు
కార్గిల్ యుద్ధం, ముంబై ఉగ్రదాడులు (26/11), కాందహార్ విమాన హైజాక్ వంటి సంఘటనల్లో నియంత్రణ లేని మీడియా ప్రసారాలు జాతీయ ప్రయోజనాలకు హాని కలిగించాయి. ఈ నేపథ్యంలో, సమాచార ప్రసారంలో జాగ్రత్త అవసరమని ప్రభుత్వం గుర్తు చేసింది.
మీడియా బాధ్యత, చట్టపరమైన నిబంధనలు
మీడియా, డిజిటల్ వేదికలు జాతీయ భద్రతలో కీలక పాత్ర పోషిస్తాయి. కేబుల్ టెలివిజన్ నెట్‌వర్క్స్ (సవరణ) నియమాలు, 2021లోని రూల్ 6(1)(పి) ప్రకారం, భద్రతా బలగాల ఉగ్రవాద నిరోధక కార్యకలాపాల ప్రత్యక్ష ప్రసారం నిషేధించబడింది. ఇటువంటి ప్రసారాలు చట్ట విరుద్ధం కాగా, అధికార యంత్రాంగం నియమించిన అధికారి ఇచ్చే ఆవర్తన సమాచారం మాత్రమే ప్రసారం చేయాలని ఆదేశించింది.
సంయమనంతో జాతి సేవ
అన్ని మీడియా సంస్థలు, వ్యక్తులు జాతీయ భద్రతకు ప్రాధాన్యమిచ్చి, సున్నితమైన సమాచారాన్ని బహిర్గతం చేయకుండా ఉన్నత ప్రమాణాలతో కార్యకలాపాలను నిర్వహించాలని కోరారు. ఈ సూచనలు సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఆమోదంతో ఉత్తర్వులు జారీ అయ్యాయి.
Also Read: కాశ్మీర్ అంటే అసలు అర్థం తెలుసా? ఆ పేరు రావడానికి ఎన్ని కథలు ఉన్నాయంటే?