మూడు రోజుల‌ కేబినెట్ భేటీ.. అస‌లు ఎజెండా ఇదే?

2014 ఎన్నిక‌ల ముందు మోడీ వేవ్ ఎలా ఉంద‌న్న‌ది ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఒక ప్ర‌భంజ‌నంలా సాగింది. మ‌రి, ఇప్పుడు ఎలా ఉంది అని అడిగితే.. రివ‌ర్స్ లో వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతుంద‌ని చెప్పే ప‌రిస్థితి. ఏ ప్ర‌భుత్వానికైనా స‌హ‌జ వ్య‌తిరేక‌త ఉంటుంది. మోడీ స‌ర్కారు కూడా అందుకు మిన‌హాయింపు కాదు. పైగా.. ప‌దేళ్లు అధికారంలో ఉన్నారు కాబ‌ట్టి.. దాని తీవ్ర‌త కూడా కాస్త ఎక్కువ‌గానే ఉంటుంది. దీనికి క‌రోనా, వ్య‌వ‌సాయ చ‌ట్టాలు తోడ‌య్యాయి. సెకండ్ వేవ్ నియంత్ర‌ణ‌లో […]

Written By: Bhaskar, Updated On : August 7, 2021 4:30 pm
Follow us on

2014 ఎన్నిక‌ల ముందు మోడీ వేవ్ ఎలా ఉంద‌న్న‌ది ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఒక ప్ర‌భంజ‌నంలా సాగింది. మ‌రి, ఇప్పుడు ఎలా ఉంది అని అడిగితే.. రివ‌ర్స్ లో వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతుంద‌ని చెప్పే ప‌రిస్థితి. ఏ ప్ర‌భుత్వానికైనా స‌హ‌జ వ్య‌తిరేక‌త ఉంటుంది. మోడీ స‌ర్కారు కూడా అందుకు మిన‌హాయింపు కాదు. పైగా.. ప‌దేళ్లు అధికారంలో ఉన్నారు కాబ‌ట్టి.. దాని తీవ్ర‌త కూడా కాస్త ఎక్కువ‌గానే ఉంటుంది. దీనికి క‌రోనా, వ్య‌వ‌సాయ చ‌ట్టాలు తోడ‌య్యాయి. సెకండ్ వేవ్ నియంత్ర‌ణ‌లో కేంద్రం విఫ‌ల‌మైందంటూ ఏ స్థాయిలో విమ‌ర్శ‌లు వ‌చ్చాయో తెలిసిందే. అటు వ్యవ‌సాయ చ‌ట్టాల అంశం కూడా స‌ర్కారును కుదిపేసింది. దీంతో.. స‌ర్కారు బ‌ల‌మైన వ్య‌తిరేక‌త‌నే ఎదుర్కొంటోందనే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. ఇలాంటి ప‌రిస్థితులను అధిగ‌మించి వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించ‌డం అనేది సాధార‌ణ విష‌యం కాదు. అందుకే.. ప‌క్కా వ్యూహం ర‌చించేందుకు మోడీ టీమ్ సిద్ధ‌మ‌వుతోంది.

ఇందులో భాగంగా.. వ‌చ్చే వారం కేంద్ర కేబినెట్ ను మూడు రోజుల‌పాటు స‌మావేశ ప‌రుస్తున్నారు మోడీ. స‌హ‌జంగా కేబినెట్ భేటీ అన్న‌ది ఒక రోజులో కొన్ని గంట‌లు సాగుతుంది. కానీ.. మూడు రోజుల‌పాటు కేంద్ర మంత్రి మండ‌లి స‌మావేశం జ‌ర‌గ‌బోతుండ‌డమే దాని ప్రాధాన్య‌త‌ను తెలియ‌జేస్తోంది. ఈ మ‌ధ్య‌నే మోడీ త‌న కేబినెట్ ను ప్ర‌క్షాళ‌న చేసిన సంగ‌తి తెలిసిందే. ఇందులో ప‌లువురు దిగ్గ‌జాల‌ను సైతం ప‌క్క‌న‌పెట్టి ఆశ్చ‌ర్య‌ప‌రిచారు. ప్ర‌భుత్వంపై ఏయే విష‌యాల్లో విమ‌ర్శ‌లు వ‌చ్చాయో.. ఆయా శాఖ‌ల మంత్రుల‌న ప‌క్క‌న‌పెట్టడం ద్వారా.. వారినే బాధ్యుల‌ను చేసే ప్ర‌య‌త్నం చేశారు. వారి స్థానంలో కొత్త‌వారికి అవ‌కాశం ఇచ్చారు. అదే స‌మ‌యంలో వ‌చ్చే ఏడాది జ‌ర‌గ‌నున్న 5 రాష్ట్రాల ఎన్నిక‌ల‌ను దృష్టిలో పెట్టుకొని.. ఆయా రాష్ట్రాల‌కు మంత్రి వ‌ర్గంలో ప్రాతినిథ్యం కూడా పెంచారు. ఈ కొత్త కేబినెట్ తో మూడు రోజుల‌పాటు మేథోమ‌థ‌నం జ‌ర‌పున్నారు ప్ర‌ధాని.

ఈ ప‌దేళ్ల‌లో కేంద్ర ప్ర‌భుత్వం చెప్పిన ప‌నులు స‌రిగా చేయ‌లేద‌నే విమ‌ర్శ‌లు ఉన్నాయి. ఈ అసంతృప్తిని క‌రోనా, వ్య‌వ‌సాయ చ‌ట్టాలు తార‌స్థాయికి తీసుకెళ్లాయి. ఈ నేప‌థ్యంలో వ‌చ్చే మంగ‌ళ‌వారం నుంచి మూడు రోజుల‌పాటు నిర్వ‌హించే మంత్రివ‌ర్గ‌ స‌మావేశంలో కీల‌క సూచ‌న‌లు, ఆదేశాలు జారీచేయ‌నున్న‌ట్టు స‌మాచారం. ప్ర‌ధానంగా వ‌చ్చే ఏడాది జ‌ర‌గ‌బోయే ఐదు రాష్ట్రాల ఎన్నిక‌లు, ఆ త‌ర్వా 2024లో వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌లే ల‌క్ష్యంగా.. కొత్త మంత్రుల‌కు దిశానిర్దేశం చేయ‌నున్న‌ట్టు తెలుస్తోంది. అదే స‌మ‌యంలో.. మీడియాతో ఎలా మాట్లాడాలి? ప్రభుత్వ పాలసీని ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలి? అనే విష‌యాన్ని కూడా మంత్రుల‌కు వివ‌రించ‌నున్న‌ట్టు తెలుస్తోంది.

అదేవిధంగా.. విప‌క్షాల‌ను ఎదుర్కొనే విష‌యాన్ని కూడా కీల‌కంగా చ‌ర్చించ‌నున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎలాగైనా బీజేపీని ఓడించాల‌ని విప‌క్షాలు క‌స‌ర‌త్తు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో భాగంగా థ‌ర్డ్ ఫ్రంట్ ప్ర‌య‌త్నాలు కూడా ముమ్మ‌రంగా సాగుతున్నాయి. ఈ నేప‌థ్యంలో.. విప‌క్షాల‌ను ఎలా ఎదుర్కోవాలి అనే అంశంపైనా ఈ స‌మావేశంలో చ‌ర్చించ‌నున్నారు. మొత్తంగా.. ప్ర‌భుత్వంపై ప‌డ్డ మ‌చ్చ‌లు తొల‌గించ‌డం, ప్ర‌తిప‌క్షాన్ని ఎదుర్కోవ‌డం అనే ల‌క్ష్యాల‌తో మూడు రోజుల‌ కేబినెట్‌ స‌మావేశం జ‌ర‌గ‌నుందని తెలుస్తోంది. మ‌రి, ఎలాంటి నిర్ణ‌యాలు తీసుకుంటార‌న్న‌ది చూడాలి.