Vizag Janasena Leaders: ఏపీలో వైసీపీ సర్కారు రాజకీయ కక్షలకు దిగుతోంది. టీడీపీ, జనసేనతో పాటు బీజేపీ నేతలపై దాడులకు తెగబడుతోంది. పోలీసులతో బలవంతంగా కేసులు నమోదుచేస్తోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ విషయంలో కాస్తా మెతక వైఖరితో ఉన్నా.. టీడీపీ, జనసేన నేతలపై మాత్రం ఓ రేంజ్ లో విరుచుకుపడుతోంది. ఇటీవల విశాఖ ఎయిర్ పోర్టు ఇష్యూను రేజ్ చేసిన వైసీపీ జనసేనను టార్గెట్ చేసింది. పవన్ తో పాటు కీలక నేతలు నాదేండ్ల మనోహర్, నాగబాబులను విశాఖ నుంచి బలవంతంగా పంపించింది. సుమారు 50 మందికి పైగా జనసేన నాయకులు, కార్యకర్తలపై కేసులు నమోదుచేసింది. అంతటితో ఆగకుండా పవన్ ను పదేపదే వ్యక్తిగతంగా వైసీపీ మంత్రులు కామెంట్స్ చేశారు. దీంతో పవన్ తొలిసారిగా దూకుడుగా మాట్లాడాల్సి వచ్చింది. అదే సమయంలో బీజేపీ కేంద్ర పెద్దల వ్యవహార శైలిని కూడా తప్పుపట్టారు. మిత్రపక్షంగా ఉన్న తమపై కేసులు నమోదవుతున్నా పట్టించుకోవడం లేదని ఆక్షేపించారు. తమను పట్టించుకోకపోవడంతో పాటు వైసీపీని వెనుకేసుకొస్తున్నారన్న రీతిలో పవన్ మాట్లాడారు.

పవన్ ప్రెస్ మీట్ తరువాత చాలా విషయాలు హైకమాండ్ నేతల చెవిలో పడ్డాయి. దీంతో ఏపీలో ఏం జరుగుతుందని ఆరా తీయడం ప్రారంభించారు. ఇప్పటివరకూ ఒకరిపై ఒకరి విమర్శలను రాజకీయ కోణంలోనే చూశామని.. పవన్ స్పందించడంతోనే ఏపీలో తాజా విషయాలు తెలిశాయని అగ్రనేతలు చెబుతున్నారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజును పిలిపించుకొని మాట్లడారు. అటు నిఘా వర్గాల నుంచి కూడా సమాచారం తెప్పించుకున్నారు. అక్టోబరు 15న విశాఖలో ఏం జరిగింది? ఎయిర్ పోర్టులో జరిగిన ఇష్యూ ఏమిటి? దానికి బాధ్యులెవరు? జనసేన నేతలు ఎవరెవర్ని అరెస్ట్ చేశారు? అన్పదానిపై ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాలు తెలుసుకున్నట్టు సమాచారం. అయితే అటు జనసేన, ఇటు ఏపీ బీజేపీలో నెలకొన్న విభేదాలపై మోదీ, షా ద్వయం ఆరాతీసినట్టు సమాచారం.

ఏపీలో బీజేపీ ఓటు, సీట్ల షేరింగ్ పెరగలేదు కానీ.. నాయకుల మధ్య విభేదాలు మాత్రం ఓ రేంజ్ లో ఉన్నాయి. మొన్నటివరకూ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణ తాజాగా హాట్ కామెంట్స్ చేశారు. ఆయన వ్యాఖ్యలు ఏపీ బీజేపీలో విభేదాలను బయటపెట్టాయి. మరీ ముఖ్యంగా ఆయన తాజా అధ్యక్షుడు సోము వీర్రాజును టార్గెట్ చేసుకున్నారు. ఆయన ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని కూడా ఆరోపణలు చేశారు. అటు కొంతమంది బీజేపీ నాయకులు సైతం ఫిర్యాదులతో క్యూకడుతున్నారు. రాష్ట్రంతో సంబంధం లేని పార్టీ ఎంపీ డైరెక్షన్ లో వీర్రాజు పనిచేస్తున్నారని.. దాని పర్యవసానమే పవన్ బీజేపీకి దూరమయ్యారని కంప్లయింట్ చేశారు.. ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు. దీనిపై అగ్రనేతలు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. పార్టీ బలోపేతం చేయకుండా ఈ విబేదాలేమిటి? అని అసహనం వ్యక్తం చేసినట్టు సమాచారం. అయితే తాజా పరిణామాలతో పవన్ అసంతృప్తికి గల కారణాలను కూడా తెలుసుకున్నారు. విశాఖ తరహా ఘటనలు మున్ముందు జరగకుండా వైసీపీ సర్కారును కట్గడి చేయనున్నట్టు బీజేపీ పెద్దలు చెబుతున్నారు.
