Union Budget 2024: దేశంలో దశాబ్దం తర్వాత సంకీర్ణ ప్రభుత్వం కొలువుదీరింది. అంతకుముందు 2005 నంచి 2014 వరకు కేంద్రంలో కాంగ్రెస్ నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వమే కొలువుదీరింది. యూపీఏ పేరుతో మన్‌మోహన్‌సింగ్ పాలన సాగించారు. ఇందులో బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ భాగస్వాములయ్యాయి. అయితే 2014లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో దేశ ఓటర్లు సంపూర్ణ మెజారిటీతో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం బీజేపీకి ఇచ్చారు. దీంతో నరేంద్రమోదీ నేతృత్వంలో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కొలువుదీరింది. బీజేపీకి సంపూర్ణ మెజారిటీ ఉన్నప్పటికీ పొత్తు ధర్మంలో భాగంగా ఎన్డీఏ ప్రభుత్వమే ఏర్పాటు చేసింది. ఇక 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ 2014కన్నా ఎక్కువ సీట్లు గెలుచుకుని మరోమారు అధికారంలోకి వచ్చింది. బలమైన ప్రభుత్వం ఏర్పడడంతో మోదీ అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. జమ్మూ కశ్మీర్ స్వయం ప్రతిపిత్తిని రద్దు చేశారు. ఆర్టికల్ 370ని ఉప సంహరించుకున్నారు. జమ్మూ, కశ్మీర్‌ను కేంద్ర పాలిత ప్రాంతాలుగా చేశారు. అనేక బిల్లులు పార్లమెంటులో ప్రవేశపెట్టారు. నూతన చట్టాలు, మహిళా రిజర్వేషన బిల్లు ఇలా చాలా వాటిని తీసుకొచ్చారు. అయోధ్యలో రామమందిరం నిర్మించారు.
దశాబ్దం తర్వాత మళ్లీ సంకీర్ణ సర్కార్..
ఇక కేంద్రంలో దాదాపు దశాబ్దం తర్వాత మళ్లీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ మ్యాజిక్ ఫిగర్‌కు 40 సీట్ల దూరంలోనే ఆగిపోయింది. అయితే అతిపెద్ద పార్టీగా బీజేపీనే అవతరించింది. దీంతో మోదీ ఎన్డీఏ కూటమిలోని పార్టీల మద్దతులో ప్రభుత్వం ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ సంకీర్ణ సర్కార్‌తో తెలుగుదేశం(టీడీపీ), బిహార్‌కు చెందిన జేడీఎస్ కీలకపాత్ర పోషిస్తున్నాయి. టీడీపీకి 16 మంది ఎంపీలు, జేడీఎస్‌కు 12 మంది ఎంపీలు ఉన్నారు. ఎన్నికలకు ముందే ఈ పార్టీలు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమిలో చేరాయి. పొత్తు ధర్మం మేరకు బీజేపీ నేతృత్వంలో ఏర్పడిన సర్కార్‌కు మద్దతు ఇస్తున్నారు.
స్వామికార్యం.. స్వకార్యం..
ఇదిలా ఉంటే.. సంకీర్ణ ప్రభుత్వాలతో ప్రాంతీయ, చిన్న చితక పార్టీలకు ఎంతో మేలు జరుగుతుంది. గతంలో డీఎంకే, టీడీపీ, ఏఐఏడీఎంకే, జేడీఎస్, ఆర్‌ఎల్‌డీ వంటి పార్టీలు కాంగ్రెస్, బీజేపీ నేతృత్వంలో ఏర్పాటు చేసిన ప్రభుత్వాల్లో భాగస్వాములయ్యాయి. తాజాగా బీజేపీ నేతృత్వంలో ఏర్పడిన ప్రభుత్వంలో టీడీపీ, జేడీఎస్ కీలక భాగస్వాములుగా ఉన్నాయి. ఈ రెండు పార్టీలో ఎవరు కేంద్రానికి మద్దతు ఉపసంహరించుకున్నా.. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం కూలిపోతుంది. ఈ నేపథ్యంలో టీడీపీ, జేడీఎస్ అధినేతలు చంద్రబాబు నాయుడు, నితీశ్‌కుమార్, కేంద్రంలో బీజేపీకి మద్దతు ఇస్తూ స్వామికార్యం చేస్తున్నారు.. ఇక రాష్ట్రంలో తమ పట్టు నిలపుకునేందుకు స్వకార్యం కోసం కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నారు.
బడ్డెట్‌లో కీలక భాగస్వాములకు పెద్దపీట..
కేంద్రంలో మూడోసారి ఏర్పడిన ఎన్డీయే 3.0 కూటమి ప్రభుత్వంలో టీడీపీ, జేడీఎస్ కీలక భాగస్వామిగా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే మోదీ 3.0 తొలి బడ్జెట్‌లోనే ఈ రెండు ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భారీగా నిధులు కేటాయించారు. ఏపీలో రాజధాని అమరావతి నిర్మాణానికి రూ.11 వేల కోట్లు కేటాయించింది. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి నిధులు ఇస్తామని ప్రకటించింది. పలు రైతు, రోడ్డు ప్రాజెక్టులకు నిధులు ఇస్తామని తెలిపింది. పోలవరం ప్రాజెక్టును త్వరలో పూర్తి చేస్తామని తెలిపింది. ఇక బీహార్‌కు అయితే రూ.26 వేల కోట్లు కేటాయించింది. వివిధ ప్రాజెక్టుల కోసం మరో రూ.11 వేలు ఇస్తామని తెలిపింది. రోడ్లు, విమానాశ్రయాల అభివృద్ధికి నిధులు ఇస్తామని తెలిపింది.
అంటే సంకీర్ణంలో కింగ్ మేకర్‌గా ఉన్న టీడీపీ, జేడీఎస్ తమ రాష్ట్ర అవసరాలు తీర్చుకోవడంలో సక్సెస్ అయ్యాయి. బిహార్‌లో ఈ ఏడాది ఎన్నికలు జరుగనున్నాయి. అందుకే కేంద్రం బిహార్‌కు ఎక్కువ నిధులు కేటాయించింది. ఇక ఏపీ అప్పుల్లో కూరుకుపోయి ఉంది. రాజధాని లేదు. దీంతో రూ.11 వేల కోట్లు ఇస్తున్నట్లు తెలిపింది. మొత్తంగా సంకీర్ణంలో కింగ్ మేకర్ పాత్ర పోషిస్తూ ఇద్దరు నేతలు తమ రాష్ట్రాల్లో కింగ్‌గా నిలిచారు.
Raj Sekhar is a senior content writer with good knoledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read More