MLC Kavitha: సొంత ఇలాకాలో తన పట్టు నిలుపుకోవడంపై ఎమ్మెల్సీ కవిత మళ్లీ ఫోకస్ పెట్టారు. రెండోసారి ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత నిజామాబాద్ జిల్లాతో గ్యాప్ పెరిగింది. ఎన్నికలు సమీపిస్తుండడంతో ఆ గ్యాప్ తగ్గించుకునే పనిలో నిమగ్నమయ్యారు. ప్రజలతో మమేకమయ్యేలా ప్రోగ్రామ్స్‌తో ముందుకెళ్తున్నారు. 2014లో ఎంపీగా గెలిచి ఉమ్మడి జిల్లాను, నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్‌ను కవిత శాసించారు. ఆమె చెప్పిందే ఫైనల్. పేరుకు మంత్రి, కార్పొరేషన్ల చైర్మన్లు ఉన్నా కవిత ఓకే అంటేనే పని అయ్యేది. 2019లో పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి ఆమెను తలకిందులు చేసింది. దీంతో తన ఓటమికి ఎమ్మెల్యేలను బాధ్యులను చేస్తూ జిల్లా వైపే కన్నెత్తి చూడలేదనే వాదనలు ఉన్నాయి. ఒక దశలో తన ఓటు హక్కును కూడా హైదరాబాద్‌కు మార్చుకుని జిల్లాకు దూరమయ్యారనే ప్రచారం పార్టీలో జోరుగా సాగింది. కానీ కవితకు ఎమ్మెల్సీ బైపోల్ అందివచ్చిన అవకాశంగా మారింది. వరుసగా రెండుసార్లు ఎమ్మెల్సీగా గెలుపొందారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత పేరు ప్రధానంగా తెరమీదకు రావడంతో జిల్లాకు రాకపోకలు తగ్గించారు. గతేడాది జూన్‌లో నందిపేట్‌లో నిర్మించిన ఆలయం ఒక్కటే పెద్ద ప్రోగ్రాం. ఆ తర్వాత అప్పుడప్పుడు వచ్చి వెళ్లేవారు.
నిజామాబాద్‌పై దృష్టి..
తాజాగా కవిత నిజామాబాద్ జిల్లాపై దృష్టి పెట్టారు. 2019 నాటికి తనతో ఉన్న క్యాడర్‌ను, లోకల్ ఎమ్మెల్యేలను కొన్ని రోజులుగా కవిత కలుస్తున్నారు. పార్లమెంట్ పరిధిలోని ఐదు సెగ్మెంట్ల పరిధిలో నిత్య కార్యక్రమాలను చేపట్టారు. ఆత్మీయ సమ్మేళనాలతో బిజీగా ఉంటున్నారు. సర్వేల ఆధారంగానే సిట్టింగ్‌లకు టికెట్లు కేటాయిస్తామని సీఎం కేసీఆర్ చెప్పినది తెలిసిందే. అయితే.. కవిత అవేమీ పట్టించుకోకుండానే సిట్టింగ్‌లనే గెలిపించాలనే ప్రచారం ఎత్తుకున్నారు. జిల్లాలో మండలాల వారీగా జరుగుతున్న సమావేశాల్లో క్యాడర్‌కు ఉపదేశం చేస్తున్నారు.
సిట్టింగులకే మద్దతు..
కేసీఆర్ టికెట్లు కేటాయించకపోయినా కవిత మాత్రం సిట్టింగులో బరిలో ఉంటారు అన్నట్లు ప్రచారం చేస్తున్నారు. గెలిపించాలని కోరుతున్నారు. మొన్న మాక్లూర్‌లో జరిగిన మీటింగ్‌లో ఎమ్మెల్యే జీవన్‌రెడ్డిని, తర్వాత నిజామాబాద్ అర్బన్‌లో జరిగిన సభలో గణేష్ గుప్లాను గెలిపించాలని పిలుపునిచ్చారు. బోధన్‌లోని ఎడపల్లి మండల కేంద్రంలో బీఆర్‌ఎస్ మీటింగ్‌లో మళ్లీ షకీల్‌ని గెలిపించాలని సూచించారు. నిజామాబాద్ రూరల్, బాల్కొండ సెగ్మెంట్లలోనూ ఆత్మీయ సమ్మేళనాలపై దృష్టి పెట్టారు.
అర్వింద్‌ను వెంటపడి ఓడిస్తాని..
నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఉన్న కవిత రాజకీయ భవిష్యత్తుపై కొంతకాలంగా ఊహగానాలు వచ్చాయి. కొన్నాళ్ల కిందట ఎంపీ అర్వింద్ చేసిన కామెంట్లకు ఆమె స్పందించి కౌంటర్ ఇచ్చారు. వచ్చేసారి వెంటబడి ఓడిస్తానని ఆమె చాలెంజ్ చేశారు. దాన్ని స్వీకరించిన కవిత మళ్లీ ఎంపీగానే పోటీ చేసేందుకు రెడీ అయితున్నట్టుగానే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఎమ్మెల్సీగా మరో నాలుగేళ్ల కాలం ఉండగా నిజామాబాద్ అర్బన్ లేదా బోధన్ నుంచి కవిత అసెంబ్లీ బరిలో ఉంటారని మొన్నటిదాకా ప్రచారం జరిగింది. కొన్ని రోజులుగా జిల్లాలో నిర్వహించే ఆత్మీయ సభల్లో నేతలు చేస్తున్న వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. వచ్చేసారి కవితను ఎంపీగా గెలిపించాలని మాక్లూర్‌లో మంత్రి మల్లారెడ్డి ఇచ్చిన పిలుపును ఎమ్మెల్యేలు కూడా అందిపుచ్చుకున్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కవితనే ఎంపీగా బరిలో ఉంటారని, ఆమెను గెలిపించాలని ఇప్పటి నుంచే ప్రచారం అందుకున్నారు.