
MLC Kavitha : ఢిల్లీ మద్యం కుంభకోణం తెలంగాణ ముఖ్యమంత్రి తనయ, కల్వకుంట్ల వారసురాలు, బతుకమ్మ బ్రాండ్ అంబాసిడర్‌గా చెప్పుకునే కల్వకుంట్ల కవితను చుట్టు ముడుతోంది. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ, ఈడీ ఇప్పటికే చాలా వరకు ఆధారాలు సేకరించాయి. మరోవైపు ఈ కేసుతో సంబంధం ఉన్న 12 మంది ఇప్పటికే అరెస్ట్ అయ్యారు. ఇక మిగిలింది కవితే అన్న ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో తాను దప్పు చేయలేదు.. దర్యాప్తును ధైర్యంగా ఎదుర్కొంటా.. తెలంగాణ ఆడబిడ్డ కళ్లలో నీళ్లు రావు.. నిప్పులు వస్తాయి అంటూ పెద్దపెద్ద డైలాగ్స్ కొట్టిన కవితకు ఇప్పుడు ఎక్కడో తేడా కొడుతున్నట్లు అర్థమైంది. మొదటి విచారణలోనే ఆమెకు ఈడీ చుక్కలు చూపింది. దీంతో ధైర్యంగా ఎదుర్కొంటాం.. కోర్టుకు వెళ్లి స్టేలు తెచ్చుకోం అన్న కవితక్కకు దారులన్నీ మూసుకుపోవడంతో సుప్రీం కోర్టు తలుపు తట్టారు.
తొలి విచారణలోనే అర్థమైందా..
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఈనెల 11న కవితను సుమారు 9 గంటలపాటు విచారణ చేసింది. ఈ సందర్భంగా ఆమెకు మద్యం కుంభకోణంతో సంబంధంపై ఆరా తీసింది. పలు ప్రశ్నలు వేసింది. కానీ అన్నింటికీ కవిత, తెలయదు.. గుర్తులేదు అని దాటవేసిందని సమాచారం. ఈ క్రమంలో ఈడీ కొన్ని ఆధారాలను కూడా బయటపెట్టిందని సమాచారం. దీంతో కంగుతినడం కవిత వంతైంది. దీంతో ఈడీ కార్యాలయంలోకి వెళ్తున్పు ్పడు వీరనారిలాగా పిడికిలి బిగించి చూపిన కవితక్క.. దర్యాప్తు పూర్తయి మూడు రోజులైనా.. ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు. పుట్టిన రోజు వేడుకలను కూడా నాలుగు గోడల మధ్యనే జరుపుకుంది.
ఎక్కడో తేడా కొట్టినట్లుంది..
విచారణలో ఈడీ అధికారులు వేసిన ప్రశ్నలు, చూసిన కొన్ని ఆధారాలతో ఇన్నాళ్తూ తనకు సంబంధం లేదని బుకాయించిన కవితకు శ్రీకృష్ణజన్మస్థానం కనిపించినట్లుంది. 16న జరిపే విచారణలో ఈ కేసులో ఏ1 నిందితుడు, ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్‌సిసోడియా, మద్యం వ్యాపారి అరుణ్ రామచంద్రపిళ్లై, కవిత మాజీ ఆడిటర్ బుచ్చిబాబుతో కలిపి విచారణ చేసే అవకాశం ఉంది. ఈ విచారణలో కవిత బండారం మొత్తం బట్టబయలు కానున్నాయి. తత్వం బోధపడిన కవిత, చేసేది లేక, చివరి అవకాశాన్ని వినియోగించుకోవాలనుకుంది.
స్టేకు నిరాకరించిన సీజేఐ..
ఢిల్లీ మద్యం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) విచారణ తప్పించుకునేందుకు కవిత తన ఆఖరు అస్త్రాన్ని కూడా ప్రయోగించింది. ఈడీ నోటీసులపై సుప్రీంకోర్టును ఆశ్రయించింది. తాను ఒక మహిళనని, తనను విచారించేందుకు ఈడీ కార్యాలయానికి పిలవడం సరికాదని ఆమె పిటిషన్ దాఖలు చేశారు. తమకు ఇచ్చిన నోటీసుల్లో ఇతరులతో కలిపి విచారిస్తామని చెప్పారని.. కానీ అలా చేయలేదని కవిత పేర్కొన్నారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండానే మొబైల్ ఫోన్లు సీజ్‌చేశారని కోర్టు దృష్టికి కవిత తీసుకెళ్లారు. సీఆర్పీసీ సెక్షన్ 160 ప్రకారం ఓ మహిళను ఆమె ఇంటికి వెళ్లి మాత్రమే విచారించాల్సి ఉన్నా.. ఈడీ కార్యాలయానికి పిలవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ పిటిషన్‌ను విచారణకు తీసుకుంటున్నట్లు సీజేఐ ధర్మాసనం తెలిపింది. అయితే ఈడీ విచారణపై స్టే ఇవ్వడానికి మాత్రం నిరాకరిచింది. ఈనెల 24న వాదనలు వింటామని స్పష్టం చేసింది. దీంతో చివరి చాన్స్ కూడా మిస్ అయింది. దీంతో ఈనెల 16న ఈడీ విచారణను తప్పించుకోవాలని చూసిన కవితకు నిరాశే మిగిలింది.
ఢిల్లీ లిక్కర్ స్కాం నుంచి తప్పించుకునేందుకు కవిత తన చేస్టలతో తనకు తానే దారులు మూసివేసుకుంటున్నట్లు అనిపిస్తోంది. ఈనెల 11న విచారణకు ముందు రోజు రామచంద్ర పిళ్లైతో తాను ఇచ్చిన స్టేట్‌మెంట్ ఉపసంహరించుకుంటున్నట్లు పిటిషన్ వేయించింది. తాజాగా ఈడీ నోటీసులపై స్టే ఇవ్వాలని సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఈనెల 16న విచారణ అనంతరం కవితను ఈడీ అరెస్ట్ చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయన్న ప్రచారం జరుగుతోంది.