MLC Kavitha: హకింపేట స్పోర్ట్స్ స్కూల్లో యువతులపై అసభ్యంగా ప్రవర్తిస్తున్న ఓ ఎస్ డి హరికృష్ణ మీద వేటు పడింది. హకీంపేట స్పోర్ట్స్ స్కూల్లో గత కొంతకాలంగా విద్యార్థినులను వేధిస్తున్న ఓ ఎస్ డి హరికృష్ణ దారుణాలు వెలుగులోకి రావడంతో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీంతో ఎమ్మెల్సీ కవిత స్పందించారు. “హకీంపేట స్పోర్ట్స్ స్కూల్లో జరుగుతున్న దారుణాలు కలచివేశాయి. ఇలాంటి సంఘటనలు జరగకుండా అతనిపై చర్యలు తీసుకోవాలని” ఎమ్మెల్సీ కవిత ట్వీట్ చేయడంతో దుమారం చెలరేగింది. దీంతో మంత్రి శ్రీనివాస్ గౌడ్ వేగంగా స్పందించారు. వెంటనే అధికారులతో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ రెండు మూడు రోజుల్లో విచారణ చేసి తుది నివేదిక ఇస్తుందని ప్రకటించారు.. విచారణలో ఆరోపణలు వాస్తవమని తీరితే కఠిన చర్యలు ఉంటాయని మంత్రి అన్నారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు భరోసా ఇచ్చేందుకే ముందు జాగ్రత్తగా అతన్ని సస్పెండ్ చేశామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రకటించారు. కాగా హకీంపేట స్పోర్ట్స్ స్కూల్ ఓ ఎస్ డి హరికృష్ణ స్థానంలో ఇన్చార్జి ఓఎస్డీ గా హైదరాబాద్ జిల్లా క్రీడా అధికారిగా పనిచేస్తున్న సుధాకర్ ను ప్రభుత్వం నియమించింది.
హరికృష్ణ చేష్టల నేపథ్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన విచారణ కమిటీ పలు విషయాలను రాబట్టింది. జిల్లా చైల్డ్ వెల్ఫేర్ శాఖ, షీ టీమ్, ఆర్డీవో, సీడీపీవో, సఖి, బాల రక్షక్ అధికారులతో పాటు రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ సభ్యురాలు రాగజ్యోతి విచారణ నిర్వహించారు. దాదాపు 7 గంటలపాటు విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా హరికృష్ణ, స్పోర్ట్స్ స్కూల్లో పనిచేస్తున్న వారి స్టేట్మెంట్లు రికార్డు చేశారు. విద్యార్థులకు తెల్ల కాగితాలు ఇచ్చి వారి అభిప్రాయాలు రాయమని చెప్పారు. కాగా, తనపై వచ్చిన వేధింపులను హరికృష్ణ కొట్టి పారేశారు. విచారణలో అన్ని విషయాలు తేలుతాయని ప్రకటించారు. తెలంగాణ కాంట్రాక్టు కోచ్ ల సంఘానికి అధ్యక్షుడిగా ఉన్న హరికృష్ణ డిప్యూటేషన్ పై స్పోర్ట్స్ స్కూల్ ఓఎస్డిగా రావడం విచారణ అధికారులను సైతం నివ్వెరపరిచింది. అర్హత కలిగిన రెగ్యులర్ కోచ్ లు ఎంతోమంది ఉన్నప్పటికీ హరికృష్ణ నియమించడం పట్ల ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి.
ఓఎస్డి హరికృష్ణపై వచ్చిన లైంగిక ఆరోపణలపై ఏర్పాటైన కమిటీ విచారణ సవ్యంగా సాగుతుందా? లేదా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నాలుగు గోడల మధ్య చేపట్టాల్సిన విచారణను.. ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారి, అతడి అనుచరుల సమక్షంలో జరపడమే ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. హరి కృష్ణ అక్కడే ఉండగా, అతడి ముందే విద్యార్థులను పిలిచి అధికారులు విచారణ నిర్వహించడం విశేషం. విచారణ మరో రెండు రోజులు ఉన్న నేపథ్యంలో అందరినీ విడివిడిగా పిలిచి వారి అభిప్రాయాలు తీసుకోవాలనే డిమాండ్లు వ్యక్తం అవుతున్నాయి. కాగా గతంలో ఇక్కడ పనిచేసిన కొంతమంది ఉద్యోగులు బయటి ప్రాంతాలకు బదిలీ అయిన తర్వాత .. ఇక్కడ జరుగుతున్న దారుణాలను ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారని సమాచారం. అయితే వారిని కూడా విచారిస్తారా? గతంలో స్పోర్ట్స్ అథారిటీకి అందిన ఫిర్యాదులను కూడా పరిగణనలోకి తీసుకుంటారా? అనేది తేలాల్సి ఉంది.
ఒక దినపత్రిక లో వచ్చిన కథనం నన్ను ఎంతో కలిచివేసింది. సీఎం కేసీఆర్ గారి నాయకత్వంలో పని చేస్తున్న తెలంగాణ ప్రభుత్వంలో ఇలాంటి వాటికి తావు ఉండకూడదు.
బాలిక పై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారిపై తక్షణం చర్యలు చేపట్టాలని, పూర్తి స్థాయి విచారణ జరిపించి, బాధితురాళ్లకు న్యాయం…
— Kavitha Kalvakuntla (@RaoKavitha) August 13, 2023