Homeజాతీయ వార్తలుMLA Vanama Venkateswara Rao: కారులో మంటలు.. నేడు "సుప్రీం" కు వనమా

MLA Vanama Venkateswara Rao: కారులో మంటలు.. నేడు “సుప్రీం” కు వనమా

MLA Vanama Venkateswara Rao: హైకోర్టు అనర్హత రేటు విధించిన నేపథ్యంలో కొత్తగూడెం కారు పార్టీలో మంటలు చెలరేగాయి. అటు వనమా వెంకటేశ్వరరావు, ఇటు జలగం వెంకట్రావు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గు మనే పరిస్థితులు ఏర్పడ్డాయి. హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు స్పీడ్ పెంచారు. బుధవారం అసెంబ్లీ స్పీకర్, అసెంబ్లీ సెక్రటరీ ని ఉదయం కలవనున్నారు. ఈ మేరకు వారి అపాయింట్మెంట్ కూడా తీసుకున్నారు. వనమా ఎన్నిక చెల్లదని హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ కాపీని స్పీకర్ కు, అసెంబ్లీ కార్యదర్శికి వెంకట్రావు అందజేసే అవకాశం ఉంది.

సుప్రీంకు వనమా

మరో వైపు తనను అనర్హుడిగా ప్రకటించిన హైకోర్టు తీర్పును నిలిపివేయాలని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు బుధవారం సుప్రీంకోర్టుకు వెళ్ళనున్నారు.. ఈమేరకు ఆయన తరపు న్యాయవాది సుప్రీంకోర్టులో బుధవారం ఉదయం పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. హైకోర్టు తీర్పు ఇచ్చిన వనమా వర్గంలో నైరాశ్యం అలముకుంది. ఇప్పటికే ఆయన కొడుకు చేసిన నిర్వాకం వల్ల వనమా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో హైకోర్టు ఆయనను అనర్హుడిగా ప్రకటించడంతో తీవ్ర నైరాశ్యంలో కూరుకు పోయారు. ఆయన అనుచరులు నిన్న ఉదయం నుంచే హడావిడి చేయడం మొదలుపెట్టారు. అయితే కోర్టు అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో జలగం వెంకట్రావు వర్గీయులు నిన్న కొత్తగూడెంలో ప్రదర్శనలు జరిపారు. దీనికి కౌంటర్ గా వనమా వర్గీయులు వాట్సాప్ గ్రూప్ లలో పోస్టులు పెట్టారు. దీంతో రెండు వర్గాల మధ్య కోల్డ్ వార్ జరుగుతున్నది. తప్పుడు వివరాలతో ఎన్నికల అఫిడవిట్ దాఖలు చేసినందుకు వనమా తగిన ఫలితం అనుభవిస్తున్నారని జలగం వెంకట్రావు వర్గీయులు చెబుతున్నారు. ఇన్ని రోజులు వెంకట్రావు కేసు నిమిత్తం ఖర్చు చేసిన డబ్బులు కూడా చెల్లించాలని వారి డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు హైకోర్టులో గెలిచినంత మాత్రాన మిడిసి పడకూడదని వనమా వర్గీయులు కౌంటర్ ఇస్తున్నారు.

ప్రగతి భవన్ సైలెన్స్

ఇక వనమాపై హైకోర్టు అనర్హత విధించిన నేపథ్యంలో ప్రగతి భవన్ సైలెన్సుగా ఉంది. జరుగుతున్న పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నది. ఒకవేళ వనమా వెంకటేశ్వరరావు సుప్రీంకోర్టులో గెలవని పక్షంలో.. జలగం వెంకట్రావు ఎలాగూ తన పార్టీ ఎమ్మెల్యే కాబట్టి గులాబీ పార్టీ ధైర్యంగానే ఉంది. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ నాయకులు విమర్శించిన పక్షంలో.. గతంలో ఆయనకు బీఫామ్ ఇచ్చింది మీరే అని టాకిల్ చేయవచ్చని భారత రాష్ట్ర సమితి నాయకులు భావిస్తున్నారు. అంతేకాకుండా వనమా రాఘవ ఎపిసోడ్ తర్వాత ఒకింత మకిలిగా మారిన వనమా వ్యవహారం హైకోర్టు తీర్పుతో మాసిపోతుందని గులాబీ పార్టీ నాయకులు అంతర్గతంగా చర్చించుకుంటున్నారు. జలగం వెంకట్రావు ఎమ్మెల్యే అయితే.. వచ్చే ఎన్నికల్లో కూడా ఆయనకే టికెట్ ఇస్తే గెలిచే అవకాశం ఉంటుందని గులాబీ పార్టీ నేతలు అనుకుంటున్నారు. ఇక ఇదే విషయాన్ని గులాబీ పార్టీ బాస్ దృష్టికి అటు అసెంబ్లీ స్పీకర్, ఇటు అసెంబ్లీ సెక్రటరీ తీసుకెళ్లారని చర్చ జరుగుతోంది. అయితే నిబంధనల ప్రకారమే తదుపరి అడుగులు వేయాలని వారికి ముఖ్యమంత్రి సూచించినట్టు సమాచారం. అయితే నిన్నంతా నాటకీయ పరిణామాల మధ్య జలగం వెంకట్రావు హైకోర్టులో కేసు గెలిచిన నేపథ్యంలో.. ఇవాళ ఎటువంటి పరిణామాలు జరుగుతాయోనని గులాబీ పార్టీ శ్రేణులు ఆసక్తిగా గమనిస్తున్నాయి.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version