MLA MS Babu: రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున వైసీపీ అభ్యర్థులను మార్చుతున్నారు. అంతా సాఫీగా జరిగిపోతుందని జగన్ ఆశించారు. కానీ ఒకవైపు షర్మిల కాంగ్రెస్ లోకి ఎంట్రీ.. మరోవైపు ధిక్కార స్వరాలు వెలుగు చూస్తుండడం విశేషం. తాజాగా చిత్తూరు జిల్లా అభ్యర్థుల ఎంపిక పై జగన్ కసరత్తు చేస్తున్నారు. ఈ తరుణంలో పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు జగన్ పై ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు. ఫస్ట్ టైం మార్పు బాధితుడు బాహటంగా విమర్శలు చేయడం గమనార్హం. ఏకంగా మీడియా ముందుకు వచ్చిన ఎంఎస్ బాబు జగన్ ను కడిగిపారేశారు.
ఐప్యాక్ సర్వే నివేదికల్లో తనకు బాగాలేదని.. ఈసారి టిక్కెట్ ఆశించొద్దని జగన్ చెప్పిన విషయాన్ని ఎంఎస్ బాబు గుర్తు చేశారు. అలా అయితే ఓసి అభ్యర్థులపై వ్యతిరేకత ఉన్నా.. వారిని మార్చలేదు ఎందుకని ప్రశ్నించారు. ఎస్సీ ఎమ్మెల్యేలను మాత్రమే ఎందుకు మారుస్తున్నారని ఆయన నిలదీసినంత పని చేశారు. దళితులకు జగన్ తీవ్ర అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. తాము ఏ తప్పు చేయలేదని.. ఐదేళ్లుగా వైసిపి పెద్దలు, మంత్రులు, సీఎం జగన్ చెప్పిందే చేశామని చెప్పుకొచ్చారు. ఇప్పుడు తనదే తప్పంటే ఎలా అని ఆయన నిలదీశారు. తనపై వ్యతిరేకత ఎవరి బాధ్యత అని ప్రశ్నించారు.
ఐపాక్ టీం పై కూడా ఎంఎస్ బాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎవరు డబ్బిస్తే వాళ్ళకి అనుకూలంగా నివేదికలు ఇస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. ఐదేళ్లలో కనీసం ఏడాదికి ఒక్కసారైనా సీఎం తమను పిలిచి తప్పు చేసి ఉంటే ఎందుకు మందలించలేదని ప్రశ్నించారు. అసలు సీఎం తమతో మాట్లాడిన సందర్భాలే లేవని ఆవేదన వ్యక్తం చేశారు. తాను చేసిన తప్పేంటో తనకు ఇప్పటికీ అర్థం కాలేదని వాపోయారు. తనకు సీఎం జగన్ న్యాయం చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటికీ పార్టీ పై తనకు అంచలంచలమైన నమ్మకం ఉందన్నారు. ఎట్టి పరిస్థితుల్లో పార్టీని వీడనని చెప్పుకొచ్చారు. మొత్తానికైతే రాష్ట్రవ్యాప్తంగా 11 మంది అభ్యర్థులను మార్చినా పెద్దగా ఎవరూ రియాక్ట్ కాలేదు. ఆళ్ల రామకృష్ణారెడ్డి మాత్రం గౌరవంగా రాజీనామా చేశారు. ఇప్పుడు షర్మిల వెంట నడుస్తానని ప్రకటించారు. కానీ ఓ ఎస్సీ ఎమ్మెల్యే మాత్రం వ్యతిరేకత తనపై కాదని.. మీపైనేనని చెప్పకుండానే సీఎం జగన్ కు గట్టి కౌంటర్ ఇచ్చారు. మున్ముందు ఎంఎస్ బాబును ఆదర్శంగా తీసుకుని మరికొందరు రియాక్ట్ అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.