MLA Kotamreddy Sridhar Reddy: నన్ను ఏ నిమిషమైనా అరెస్టు చేసుకోండి. శాశ్వతంగా జైల్లో పెట్టండి. కేసులు పెట్టి మీరు అలసిపోవాలే తప్ప.. నా గొంతు ఆగే ప్రశ్నలేదు. నా గొంతు ఆగాలంటే ఒక్కటే పరిష్కారం. ఎన్ కౌంటర్ చేయించండి“ ఇవి ప్రతిపక్షా ఎమ్మెల్యే మాటలు అనుకునేరు. సాక్షాత్తు అధికార పార్టీ వైసీపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలు. ఆ ఎమ్మెల్యే వ్యాఖ్యలతో ఏపీ రాజకీయం ఒక్కసారిగా హీటెక్కింది. ఇంతకీ ఆ వైసీపీ ఎమ్మెల్యే ఆవేదన ఏంటో స్టోరీలో చదివేయండి.

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పై నెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆరోపణలు తెలిసిన విషయమే. దీనిపై వైసీపీ వివరణ ఇచ్చింది. ఫోన్ ట్యాపింగ్ జరగలేదని, కేవలం రికార్డింగ్ జరిగిందని చెప్పింది. ఇదంతా కోటంరెడ్డి ఆడుతున్న డ్రామా అంటూ ఆరోపించింది. చంద్రబాబు డైరెక్షన్లో కోటంరెడ్డి యాక్టింగ్ చేస్తున్నారని వైసీపీ నేతలు విమర్శించారు. కోటంరెడ్డి పార్టీ విడిచి వెళ్లాలని అనుకుంటే వెళ్లొచ్చని, వైసీపీ పై అబాంఢాలు మోపొద్దుని సూచించారు. ఇప్పటికే నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డిని నెల్లూరు రూరల్ ఇంచార్జీగా నియమించారు.
వైసీపీ నేతల వ్యాఖ్యల పై కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్పందించారు. తాను చేసిన ఆరోపణలు అబద్ధమైతే.. కేంద్ర హోంశాఖకు ఏపీ ప్రభుత్వం నుంచి లేఖ రాయాలని, తన ఆరోపణల పై విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. అధికారంలో ఉన్న వైసీపీ నేతలు ఫోన్ ట్యాపింగ్ జరగలేదని చెబితే ఎలా నమ్ముతామని ప్రశ్నించారు. తప్పు చేయకుంటే ఏపీ ప్రభుత్వం తన పై తానే విచారణ చేయించుకోవాలని సవాల్ విసిరారు. తనను అనుమానించిన నేపథ్యంలోనే బయటికి వచ్చి ఆధారాలతో సహా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పై మాట్లాడుతున్నానని తెలిపారు. మిగిలిన నేతల్లాగా చివరి నిమిషంలో పార్టీ మారి, మోసం చేయలేదని చెప్పారు.
తనను అరెస్టు చేస్తున్నారంటూ మీడియాకు లీకులు ఇస్తున్నారని, తాను అరెస్టుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. తనను అరెస్టు చేసినా తన గొంతు ఆగదని, ప్రశ్నిస్తూనే ఉంటుందని అన్నారు. తనను ఎన్ కౌంటర్ చేస్తే తప్ప తన గొంతు ఆగదని చెప్పారు. సజ్జల రామకృష్ణారెడ్డే మీడియాకు లీకులు ఇస్తున్నారంటూ మండిపడ్డారు. లక్షలాది మంది వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు ఉండగా.. సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు సజ్జల భార్గవరెడ్డిని ఎందుకు సోషల్ మీడియా ఇంచార్జీగా నియమించారని ప్రశ్నించారు. తాను బెదిరిస్తే బెదిరిపోయే రకం కాదని కోటంరెడ్డి స్పష్టం చేశారు.

కోట్టంరెడ్డి ఆరోపణల పై కేంద్రహోంశాఖతో విచారణ చేయించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. సొంతపార్టీ ఎమ్మెల్యే పదేపదే ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో .. వాటి పై విచారణకు ఆదేశించకుండా ఎదురుదాడి చేయడం అధికార వైసీపీకి మంచిది కాదు. ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పై ఇద్దరు ఎమ్మెల్యేలు ఆరోపణలు చేశారు. ఇప్పుడైనా ఏపీ ప్రభుత్వం ఆరోపణల పై కేంద్రంతో విచారణ చేయిస్తుందా ? ఎమ్మెల్యేల పై చర్యలు తీసుకుని విషయాన్ని పక్కదారి పట్టిస్తుందా ? అన్న ఆసక్తి ప్రజల్లో నెలకొంది.