హుజురాబాద్ ఉప ఎన్నిక వ్యవహారంలో విమర్శలు వస్తూనే ఉన్నాయి. కేసీఆర్ తీరుపై సామాజిక మాధ్యమాల్లో ఇబ్బడిముబ్బడిగా అవాకులు చెవాకులు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఒక్క నియోజకవర్గానికి అంత భారీ బడ్జెట్ ఎందుకో తెలియడం లేదని చెబుతున్నారు. హుజురాబాద్ వేదికగా దళితబంధుకు శ్రీకారం చుడుతున్నసీఎం కేసీఆర్ పై ఇప్పటికే పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓటర్లను ప్రభావితం చేసే క్రమంలోనే ఒక్క నియోజకవర్గంపై ఫోకస్ పెట్టడం సర్వత్రా ఆందోళనలు కలుగుతున్నాయి.
ఈ నేపథ్యంలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఓ విచిత్రమైన షరతు పెట్టారు. మునుగోడుకు రూ.2 వేల కోట్లు కేటాయిస్తే ఎమ్మెల్యే పదవి ఒదిలేస్తానని సవాల్ విసిరారు. ఇన్నాళ్లు నిధుల్లేక పనులు ఆగిపోయాయని చెప్పారు. ఈ నిధులతోనైనా తన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే అవకాశం దొరుకుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తాను ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి ఇప్పటివరకు ఏ చిన్న పని కూడా చేయలేకపోయానని వాపోయారు.
హుజురాబాద్ ఉప ఎన్నిక కారణంగానే అక్కడ నిధులు వరదలా పారుతున్నాయి. దీంతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వ తీరును ఎండగట్టడానికి ఇదే సరైన సమయంగా భావించారు. కేసీఆర్ వల్లే రాష్ర్టంలో పనులు జరగడం లేదని చెప్పారు. అందుకే తన ప్రాంతం బాగు పడాలంటే ఎంతో కొంత త్యాగం చేయక తప్పదని పేర్కొన్నారు. దాని కోసమే తన నియోజకవర్గానికి రెండు వేల కోట్లు కేటాయిస్తే తన పదవి త్యాగంచేసి ప్రజల రుణం తీర్చుకుంటానని భరోసా ఇచ్చారు.
ఇప్పటికే సీఎం కేసీఆర్ ప్రకటనల వల్ల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఒక్క నియోజకవర్గంలో విజయం కోసం ఇంతలా దిగజారిపోవాలా అని ప్రశ్నిస్తున్నారు. గెలుపు అనే భ్రమలో పడి విచక్షణ లేకుండా హామీలు ఇస్తూ ప్రజలను తప్పుదారి పట్టించేందుకు కుయుక్తులు పన్నుతోందని విమర్శిస్తున్నారు. ఇంత పెద్ద భారీ బడ్జెట్ ఎక్కడి నుంచి తెస్తారని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా ఎన్నిక స్టంటుగా భావిస్తున్నారు. ప్రజలు గుర్తించి ఉప ఎన్నికల కీలెరిగి వాత పెట్టాలని చూస్తున్నారు.