నాయకుడు బలం నుంచి కాదు జనం నుంచి వస్తాడు. ప్రజాభీష్టంమేరకు ప్రవర్తించేవాడే నిజమైన నేత. ప్రత్యర్థిపై కత్తులు దూయకుండా ప్రేమ చూపేవాడే సిసలైన నాయకుడు. తమిళనాడులో స్టాలిన్ చూపిన తెగువ మరువలేనిది. మాజీ ముఖ్యమంత్రి జయలలిత చిత్రపటం, ఆమె నెలకొల్పిన అమ్మ క్యాంటిన్లపై విధ్వంసానికి పాల్పడిన సొంత పార్టీ కార్యకర్తలపై కేసులు నమోదు చేయించారు. దీంతో స్టాలిన్ ప్రజల హృదయాల్లో జననేతగా ఎదిగారు. రాజకీయాలంటే కేవలం కక్ష్యలు, కార్పణ్యాలే కాదు ప్రేమాభిమానాలు సైతం ఉంటాయని గుర్తించి సొంత పార్టీ వారైనా చట్టపరంగా శిక్షించేందుకు పూనుకోవడం ముదావహం.
కొత్త చరిత్రకు..
తమిళనాడు రాజకీయాల్లో జయలలిత, కరుణానిధి రెండు వర్గాలుగా చేసి పాలించారు. కార్యకర్తలు సైతం ఒకరిపై మరొకరు దాడులు చేసుకునే స్థాయికి చేరుకున్నారు. దీంతో ఈ సంప్రదాయానికి చెక్ పెట్టాలని స్టాలిన్ భావించారు. కార్యకర్తల మధ్య విద్వేషాలను రూపుమాపాలనే నిర్ణయానికి వచ్చారు. అనుకున్నది సాధించే క్రమంలో ముందుకు కదిలారు. 2016లో జయలలిత ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరై కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టారు. ప్రత్యర్థి పార్టీ అయినా ప్రజలు అధికారం కట్టబెట్టినప్పుడు గౌరవించాల్సిందేనని తేల్చి చెప్పారు. అప్పట్లో ఈ నిర్ణయం సంచలనం సృష్టించినా స్టాలిన్ లోని గొప్ప గుణాన్ని బయటపెట్టింది.
నాయకత్వంపై నమ్మకం
స్టాలిన్ నాయకత్వంపై ప్రజలకు విశ్వాసం పెరిగింది. ప్రత్యర్థి పార్టీ అయిన ఏఐడీఎంకేపై వ్యతిరేకత లేకపోయినా స్పష్టమైన మెజార్టీ డీఎంకే కు కట్టబెట్టారు. పదవికి పరిణయానికి తొందరపడకూడదనే విషయం గ్రహించి ఎన్నికల వరకు వేచి చూడడం స్టాలిన్ కే చెల్లింది. విలువలే ప్రధానంగా తమ పార్టీ నిర్ణయాలు ఉండాలని భావించారు. అందరినీ ఏకం చేశారు. ఏఐడీఎంకే నేతలపై సైతం ప్రత్యక్షంగా ఎలాంటి ఆరోపణలు చేయకుండా నైతికతకు పెద్దపీట వేశారు. ఫలితంగా ఎన్నికల్లో విజయం సాధించినా పార్టీ కార్యకర్తలు మితిమీరిన ఉత్సాహాన్ని ప్రదర్శించకూడదని ఆదేశాలు జారీ చేసి ధిక్కరించిన వారిపై వేటు వేసేందుకు సైతం వెనుకాడడం లేదు.
ఏపీ, బెంగాల్ లో..
ఓ పక్క స్టాలిన్ లాంటి నేతలు పరస్పర సహకారం కోసం తమ ప్రయత్నాలు చేస్తుంటే ఏపీ, పశ్చిమబెంగాల్ మాత్రం గొడవలే ప్రధానంగా చేసుకుంటున్నాయి. ఇటీవల ఎన్నికలు జరిగిన బెంగాల్ తృణమూల్ కాంగ్రెస్ విజయం సాధించడంతో ప్రత్యర్థులు దాడులకు తెగబడుతున్నారు. ఏపీలో కూడా సీఎం జగన్, ప్తతిపక్ష నేత చంద్రబాబు నాయుడు రాజకీయాల కోసం రగడ సృష్టిస్తున్నారు. ప్రజా సమస్యలను గాలికొదిలేసి అధికారమే పరమావధిగా భావించి పావులు కదుపుతూ నైతికతకు తిలోదకాలు ఇస్తున్నారు. ప్రజాజీవనానికి భంగం కలిగిస్తున్నారు. రాజకీయాలంటే కక్షలే కాదు ప్రజా సమస్యల పరిష్కారమే ముఖ్యమని భావించి వారి ఎదుగుదలకు చర్యలు చేపట్టాల్సిన బాధ్యతలు గుర్తెరిగితే బాగుంటుందని పలువురు భావిస్తున్నారు.