YS Sharmila : తెలంగాణలో షర్మిళ వెనక్కి తగ్గడానికి కారణాలేంటి? కాంగ్రెస్ పార్టీకి ఏకపక్షంగా మద్దతు తెలపడం వెనుక ఏం జరిగింది? తనకు తాను వెనక్కి తగ్గరా? తాను అనుకున్న అంచనాలను అందుకోలేకపోయారా? అసలేం జరిగింది? కాంగ్రెస్ పార్టీ ఏ ఆఫర్ ఇచ్చింది? ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఇదే చర్చనీయాంశంగా మారింది. జగనన్న వదిలిన బాణం ఏపీని విడిచి తెలంగాణను ఎంచుకోవడమే అతి పెద్ద తప్పిదంగా విశ్లేషకులు భావిస్తున్నారు. అన్నను ఎదిరించలేక.. అన్న ప్రేమను దక్కించుకోలేక.. తెలంగాణ రాజకీయాల్లో ప్రభావితం చూపాలనుకున్న షర్మిళ ఆశలు తొలి ఎన్నికల్లోనే నీరుగారిపోయాయి.
తెలంగాణ అంటేనే సెంటిమెంట్. ఆంధ్రమూలాలు ఉన్న ఏ పార్టీ అక్కడ నిలువలేదు. అంతెందుకు జగన్ వైసీపీకే అక్కడ స్థానం లేకుండా పోయింది. అసలు తెలంగాణలో నాయకులను తయారుచేసిన తెలుగుదేశం పార్టీయే సెంటిమెంట్ ముందు కుదేలైంది. ఇటువంటి తరుణంలో ఆంధ్రమూలాలు ఉన్న షర్మిల తెలంగాణ రాజకీయాలను ఎంచుకోవడమే ఒక సాహసం. అక్కడ అన్న మాదిరిగా ఏకపక్ష రాజకీయ ప్రభావం చూపెడతానని అనుకోవడమే పెద్ద టాస్క్. రాజకీయ క్షేత్రంగా తెలంగాణను ఎంచుకోవడమే ఆమె వేసిన మొదటి తప్పటడుగు. ఆమె పొలిటికల్ ఎంట్రీపైనే రకరకాల అనుమానాలు ప్రారంభమయ్యాయి. కెసిఆర్ కోసమే ఆమెను రంగంలోకి దించారని ఒక అనుమానం ఉండేది. బిజెపి కోసమేనని మరో ప్రచారం ఉంది. ఇన్ని ప్రచారాలు, అనుమానాల మధ్య తెలంగాణ ప్రజలు ఆమెను విశ్వసించలేదు. పైగా పక్క సమైక్యవాది అయిన రాజశేఖర్ రెడ్డి బిడ్డగా ఆమెకు తెలంగాణ ప్రజలు మార్కు వేయలేదు.
అప్పటికే ఆమె ఏపీ రాజకీయాల్లో ఉండడం కూడా.. తెలంగాణలో రాణించకపోవడానికి ప్రధాన కారణం. జగన్ అరెస్ట్ అయి జైల్లో ఉన్నప్పుడు.. అన్న వదిలిన బాణం అంటూ షర్మిల ప్రజాక్షేత్రంలోకి వెళ్లారు. ఏపీ రాజకీయాల్లో గట్టిగానే పోరాటం చేశారు. గత ఎన్నికల్లో అన్నకు మద్దతుగా ఏపీ వ్యాప్తంగా ప్రచారం కూడా చేశారు. అటువంటిది ఎన్నికల అనంతరం కుటుంబంలో తగాదా వచ్చిందని తెలంగాణ బాట పట్టడాన్ని అక్కడి ప్రజలు స్పష్టంగా గుర్తించారు. 2014లో రాష్ట్ర విభజన జరిగితే.. 2019 ఏపీలో ఎన్నికల తర్వాత తెలంగాణ రాజకీయాల్లో అడుగుపెట్టడం ఏమిటన్న ప్రశ్న ఉత్పన్నమైంది. ఏపీలో సోదరుడు, తెలంగాణలో సోదరి రాజ్యాన్ని ఏలుతారా? అని ప్రత్యర్థులు ప్రశ్నించారు.విశ్లేషకులు తప్పు పట్టారు. అయితే ఏపీలో అన్నను ఎదిరించలేక.. ఎదురు తిరగలేక తెలంగాణ వచ్చిన ఆమెకు ప్రజలు దూరం పెట్టారు. చివరకు ఆమెకు తత్వం బోధపడడంతో తనకు తానే ఎన్నికల నుంచి తప్పుకున్నట్లు చెప్పి..
కాంగ్రెస్కు మద్దతు తెలపాల్సిన అనివార్య పరిస్థితి ఎదురయ్యింది.
అయితే అనూహ్యంగా ఆమె కాంగ్రెస్కు ఏకపక్షంగా మద్దతు తెలపడం.. ఏపీ రాజకీయాలపై పెను ప్రభావం చూపుతోంది. అయితే ఎన్నికల బరి నుంచి తప్పుకునే క్రమంలో పాలేరు నియోజకవర్గం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించడం గుర్తించాల్సిన అంశం. అక్కడ పొంగులేటి శీనన్నను ఎలా ఓడిస్తానని ఆమె చేసిన నిట్టూర్పు వ్యాఖ్యలు వెనుక చాలా రకాల విశ్లేషణలు వెలువడుతున్నాయి. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఏపీ సీఎం జగన్కు అత్యంత సన్నిహితుడు. తాను కాంగ్రెస్ పార్టీలో చేరే ముందు చాలాసార్లు జగన్ ను కలిసి చర్చించారు. ఇప్పుడు అదే పొంగులేటి మాట షర్మిల నోట రావడంతో తెర వెనుక చాలా కథలు నడిచాయన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. తెలంగాణ ఎన్నికల ఫలితాలు అనంతరం రాజకీయ సమీకరణలు శరవేగంగా మారే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. అవి తరువాత ఏపీలో జరిగే ఎన్నికలపై ప్రభావం చూపే పరిస్థితి కనిపిస్తోంది.