BJP Mission 90: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమరానికి సిద్ధం కాబోతుంది. చిన్న పార్టీ, పెద్ద పార్టీ అనే తేడా ఉండదు. ప్రతి పార్టీ పక్కాగానే ముందుకెళ్తుంది..! ఒకరు విజయంపై కన్నేస్తే… మరోపార్టీ ఉనికి కోసం ప్రయత్నించవచ్చు. మొత్తంగా మొన్నటి వరకు ఓ లెక్క.. ఇక నుంచి మరోలెక్క అన్నట్లు తెలంగాణ పాలిటిక్స్ నడవటం ఖాయమే..! 2022 బీజేపీ బాగా కలిసి వచ్చింది. మునుగోడు పరాభవం నిరాశపర్చినా.. ఏడాదంతా ఎక్కడా దూకుడు తగ్గించలేదు. ఎన్నికల ఏడాదిలో ఇక ఎక్కడా తగ్గేదేలే అన్నట్లు కమలనాథులు ‘పవర్’ఫుల్ వ్యూహాలు రచిస్తున్నారు. ఎన్నికల ఏడాది కావడం.. తెలంగాణలో అధికార బీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీనే అన్న అభిప్రాయం ఇప్పటికే ప్రజల్లో నెలకొంది. ఈ తరుణంలో ప్రతీ అడుగూ ఆచితూచి వేయాలని బీజేపీ భావిస్తోంది. మరోవైపు జాతీయ నేతలంతా దక్షిణాదిపెనే దృష్టిపెట్టారు. ఈ ఏడాది తెలంగాణలో పాగావేసి పట్టు బిగించాలని చూస్తున్నారు. ఈ క్రమంలో కమల వికాసం ఖాయమే అన్న ధీమా స్థానిక నేతల్లో వ్యక్తమవవుతోంది.

మిషన్ 90 లక్ష్యంతో..
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పటికే ప్రత్యేక ఆపరేషన్ తో ముందుకెళ్తోంది బీజేపీ. అయితే తాజాగా ‘మిషన్ 90’ని తెరపైకి తీసుకువచ్చింది. ఈ టార్గెట్ తోనే వచ్చే ఎన్నికలను ఎదుర్కొనేందుకు సిద్ధమైంది. ఇప్పటికే బీఆర్‌ఎస్, బీజేపీ నువ్వా –నేనా అన్నట్లు ముందుకెళ్తున్నాయి. అధికార బీఆర్‌ఎస్ మరోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తుంటే… ఇప్పటికే రెండుసార్లు అధికారానికి దూరమైన తెలంగాణ కాంగ్రెస్.. ఈసారి ఎలాగైనా గెలిచాలని చూస్తోంది. ఇదిలా ఉంటే బీజేపీ మాత్రం… తెలంగాణపై సీరియస్‌గా ఫోకస్ పెట్టేసింది. గత కొంతకాలంగా ఆ పార్టీ బలపడుతూ వస్తోంది. కీలమైన ఉపఎన్నికలతో జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో సత్తా చాటిన కమలనాథులు… వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాషాయ జెండాను ఎగరవేయాలని చూస్తున్నారు. ఇందుకోసం పక్కాగా ముందుకెళ్లే సరికొత్త ప్లాన్‌ను తెరపైకి తీసుకువచ్చారు.
కర్ణాటక తర్వాత తెలంగాణే..
నిజానికి బీజేపీకి దక్షిణాదిలో కర్ణాటక తర్వాత అత్యంత స్కోప్ కనిపిస్తున్న రాష్ట్రం తెలంగాణ..! గతంలో ఎన్నడూ లేని విధంగా 2019 పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో నాలుగు పార్లమెంట్ స్థానాలు గెలిచి సంచలనం సృష్టించింది. అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఒక స్థానానికే పరిమితమైన ఆ పార్టీ… పార్లమెంట్ ఎన్నికలు వచ్చే నాటికి గణనీయంగా పుంజుకుంది. ఈ పరిణామాన్ని లోతుగా పరిశీలించిన కమలదళం.. వెంటనే ప్రత్యేక ఆపరేషన్ షురూ చేసింది. వెంటనే నాయకత్వ పగ్గాలను బండి సంజయ్‌కు అప్పగించింది. ఆయన బాధ్యతలు తీసుకున్న తర్వాత పార్టీ చాలా బలపడిందనే చెప్పొచ్చు. కీలకమైన దుబ్బాక, హుజురాబాద్ గెలిచి అధికార బీఆర్‌ఎస్‌కు షాక్ ఇచ్చింది. ఇక మునుగోడులోనూ గెలిచేంత పని చేసింది. కీలమైన జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఫలితంగా తెలంగాణ తామే ప్రత్యామ్నాయం అని చెప్పే ప్రయత్నం గట్టిగా చేసింది. ఈ విషయంలో ఆ పార్టీ నాయకత్వం సక్సెస్ అయిందనే చెప్పొచ్చు. టీ కాంగ్రెస్‌లోని అంతర్గత విభేదాలను పక్కగా క్యాష్ చేసుకునే పనిలో పడ్డా బీజేపీ… మరోవైపు అధికార బీఆర్‌ఎస్‌ను ప్రతి విషయంలో టార్గెట్ చేస్తూ వెళ్తోంది. ఈ నేపథ్యంలో ఎన్నికలు రానుండటంతో… ప్రత్యేక మిషన్ పేరుతో ముందుకెళ్లాలని నిర్ణయించింది బీజేపీ. ఇందుకు మిషన్ 90 తెలంగాణ 2023 అని పేరు కూడా పెట్టింది. ఈ టార్గెట్ తోనే ఎన్నికలను ఎదుర్కొవాలని చూస్తోంది.
సింగిల్‌గానే ఎన్నికలకు..
బీజేపీ రాబోయే అసెంబ్లీ ఎన్నికలపై భారీ ఆశలే పెట్టుకుంది. అయితే తాజాగా చంద్రబాబు కూడా సీన్‌లోకి వచ్చారు. ఫలితంగా బీజేపీ, టీడీపీ మధ్య మళ్లీ పొత్తు చిగురిస్తుందా..? అన్న చర్చ జోరుగా జరుగుతోంది. అయితే ఈ విషయాన్ని కమలనాథులు కొట్టిపారేస్తున్నప్పటికీ… బీజేపీ తెలంగాణలో గడిచిన రెండు ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేసింది. వచ్చే ఎన్నికల్లోనూ సింగిల్‌గానే ఫైట్ చేయాలని చూస్తోంది. అయితే చివరి వరకు ఏం జరుగుతుందనేది చూడాలి.

త్వరలో కీలయ నిర్ణయాలు..
బీజేపీ జాతీయ నాయకత్వం తెలంగాణలో కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తోంది. త్వరలో జరిగే కేంద్ర కేబినెట్ విస్తరణలో తెలంగాణకు మరో మంత్రి పదవి దక్కనుంది. బీసీ వర్గానికి అవకాశం ఇవ్వాలని భావిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. అదే సమయంలో వచ్చే ఎన్నికలకు టీంను సమాయుత్తం చేసేందుకు కసరత్తు ప్రారంభించిఇది. తాజగా హైదరాబాద్ లో జరిగిన పార్టీ ముఖ్య నేతల సమావేశంలో బీజేపీ జాతీయ నేతలు ఇచ్చిన సంకేతాలతో త్వరలో ముఖ్య నిర్ణయాలు ఉండబోతున్నాయి. అందులో భాగంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి మార్పు ఉంటుందనే చర్చ మొదలైంది.
‘బండి’ని మార్చే చాన్స్..
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్ పదవీ కాలం ఫిబ్రవరి 10న ముగియనుంది. దీంతో, ఆయన కొనసాగుతారా లేదా అనే అంశంపైన చర్చ జరుగుతోంది. బండి సంజయ్ పార్టీ బాధ్యతలు చేపట్టిన తరువాత రాష్ట్రంలో బీజేపీలో కొత్త జోష్ వచ్చిందనే అభిప్రాయం ఉంది. బండి సంజయ్ టీఆర్‌ఎస్ ప్రభుత్వం.. ముఖ్యమంత్రి కేసీఆర్‌పైన పోరాడుతున్న తీరును పార్టీ అధినాయకత్వం ప్రశంసించింది. బండి సంజయ్ నిర్వహించిన ప్రజాసంగ్రామ యాత్రపైన ప్రత్యేకంగా ప్రధాని ఆరా తీసారు. హైదరాబాద్ లో జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు.. ఆ సమయంలో నిర్వహించిన పార్టీ బహిరంగ ఏర్పాట్ల పైన ప్రధాని ప్రత్యేకంగా బండి సంజయ్‌ను వేదికపైనే అభినందించారు. పార్టీ అధినాయకత్వం దాదాపుగా బండి సంజయ్‌కు మద్దతుగా నిలుస్తోంది. ఈ సమయంలో బండి స్థానంలో మరొకరికి అవకాశం ఇస్తారా అనే సందేహం వ్యక్తం అవుతోంది.
కేంద్ర కేబినెట్‌లోకి సంజయ్..!?
తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌పైన విజయం సాధించాలనే లక్ష్యంగా బీజేపీ అడుగులు వేస్తోంది. పార్టీ ముఖ్యనేత బీఎల్ సంతోష్ పార్టీ నేతలకు తెలంగాణలో ఏ విధంగా ముందుకెళ్లాలో దిశా నిర్దేశం చేశారు. అయితే, బీఆర్‌ఎస్‌పై దూకుడుగా ఉన్న బండి సంజయ్‌ను కేంద్ర కేబినెట్‌లోకి తీసుకుంటారనే చర్చ బీజేపీ శ్రేణుల్లో వినిపిస్తోంది. ప్రస్తుతం కిషన్‌రెడ్డి కేంద్ర మంత్రిగా ఉన్నారు. తెలంగాణలో మరో మంత్రి పదవి బీసీలకు ఇవ్వాలని అధిష్టానం భావిస్తోందని తెలుస్తోంది. అది బండి అయితేనే బాగుంటుందని అధిష్టానం భావిస్తుందని సమాచారం. అయితే, పార్టీ కేడర్‌లో జోష్ నింపుతూ దూకుడు మీద ఉన్న బండి సంజయ్‌కు కేంద్ర మంత్రి పదవి ఇవ్వటం జరిగితే ఆ దూకుడుకు బ్రేకులు వేయటమేననే అభిప్రాయం కూడా పార్టీ శ్రేణుల్లో వినిపిస్తోంది.
తురుపు ముక్క ఈటల…
హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ను బీజేపీ తురుపు ముక్కగా భావిస్తోంది. బండి సంజయ్ ను కేంద్ర కేబినెట్‌లోకి తీసుకుంటే.. రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు ఈటలకు అప్పగిస్తారని టాక్. అదే జరిగితే వచ్చే అసెబ్లీ ఎన్నికలు ఆయన సారథ్యంలోనే జరిగే అవకాశం ఉంది. మొత్తంగా తెలంగాణ బీఆర్‌ఎస్‌ను ఎలాగైనా గద్దె దించాలన్న వ్యూహంతో ముందుకు వెళ్తున్న కమలనాథులు.. 2023లో మరింత దూకుడు పెంచడం ఖాయంగా కనిపిస్తోంది.