YCP Botsa Roja: ఏపీ మంత్రి వర్గ విస్తరణ చిచ్చుపెట్టింది. సీనియర్ మంత్రులను అందరినీ పక్కకు తప్పించి కొత్త వారిని తీసుకుంటారని అనుకున్నా.. తీవ్ర వ్యతిరేకత రావడంతో సీఎం జగన్ మనసు మార్చుకొని కొందరు సీనియర్లు బొత్స, పెద్దిరెడ్డి సహా పలువురిని మళ్లీ తీసుకున్నారు. అయితే తీసుకోవడం తీసుకున్నారు కానీ సీనియర్లకు ప్రాధాన్యత లేని శాఖలు ఇచ్చి జూనియర్లు.. టీడీపీ నుంచి వచ్చి తొలి సారి ఎమ్మెల్యేలైన విడుదల రజినీ లాంటి వారికి కీలకమైన వైద్య ఆరోగ్యశాఖలు ఇవ్వడం సీనియర్ల పుండు మీద కారం చల్లినట్టైంది. ఇక నిధులు, విధులు పెద్దగా ఉండని విద్యాశాఖను మంత్రి బొత్సకు ఇవ్వడంపై ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం.
మంత్రులుగా పదవులు కోల్పోయిన ఫైర్ బ్రాండ్స్ కొడాలి నాని, పేర్ని నానిలు ఒక్కసారి అసంతృప్తి వ్యక్తం చేసి సైలెంట్ అయ్యారు. వాళ్లు బయటకు రావడం లేదు. తిరిగి మంత్రి పదవి దక్కించుకున్న నేతల పరిస్థితి మాత్రం కుడిదిలో పడ్డ ఎలుకలా మారింది. వీరిలో అసంతృప్తి తీవ్రంగా ఉంది. ముఖ్యంగా సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ కక్కలేక మింగలేక సతమతమవుతున్నారు.
గతంలో సీఎం జగన్ తన తొలి కేబినెట్ లో బొత్సకు కీలకమైన ‘మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ’ను కట్టబెట్టారు. మున్సిపల్ ఎన్నికలతోపాటు మూడు రాజధానులు, పట్టణాల్లో సౌకర్యాల వంటి కీలక అంశాల్లో బొత్స తన మార్క్ చూపించారు.
Also Read: Rahul Gandhi Visit To Telangana: రాహుల్ గాంధీ టూర్.. కేసీఆర్ ఈసారి ఎలా ట్రీట్ చేస్తాడో?
అయితే తాజాగా కేబినెట్ మార్పులు.. చేర్పుల్లో బొత్సను పదవి నుంచి తప్పించాలని జగన్ నిర్ణయం తీసుకున్నా.. ఆ తర్వాత పలు కారణాల వల్ల కొనసాగించారు. కానీ బొత్సకు మంత్రి పదవి ఇచ్చి అసలు ప్రాధాన్యత లేని విద్యాశాఖ ఇచ్చేశారు. గతంలో కీలకమైన మున్సిపల్ శాఖ ఇచ్చినప్పటికీ రెండో విడతలో విద్యాశాఖ ఇవ్వడంపై ఆయన అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం.
అందుకే శాఖను కేటాయించి ఇన్ని రోజులు అయినా ఆయన ఇప్పటిదాకా విద్యాశాఖ మంత్రిగా బొత్స అసలు బాధ్యతలు చేపట్టలేదు. శాఖపరమైన సమీక్ష ఇప్పటివరకూ నిర్వహించలేదు. విద్యాశాఖ అంశాలను ప్రస్తావించినా.. ‘చూద్దాంలే’ అంటూ అయిష్టంగానే వెళ్లిపోతున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.
బొత్స విద్యాశాఖ మంత్రిగా ప్రకటించినప్పటి నుంచి ఇప్పటివరకూ దాదాపు 4 సార్లు శాఖ పరమైన సమీక్షలు జరిగాయి. అందులో ఒక్క దాంట్లో కూడా బొత్స పాల్గొనకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఇక తనకు విద్యాశాఖ కేటాయిస్తున్నట్టు సమాచారం వచ్చిన తర్వాత సీఎం జగన్ ను కలవాలని బొత్స ప్రయత్నించినా కుదరలేదు. ఇక మంత్రిగా తొలిసారి జిల్లాకు వచ్చిన సందర్భంగా అభిమానులు ర్యాలీకి ప్రయత్నించినా బొత్స వారించారట..
ఇక రోజా కూడా తీవ్ర అసంతృప్తితోనే ఉన్నారని టాక్ నడుస్తోంది. టీడీపీ నుంచి వైసీపీలో చేరి తొలిసారి ఎమ్మెల్యే అయిన విడుదల రజినీకి వైద్యశాఖ ఇచ్చి.. సీనియర్.. పార్టీ కోసం కష్టపడిన తనకు ‘టూరిజం’ ఇచ్చిన జగన్ పై రోజా అసంతృప్తిగా ఉన్నట్టు సమాచారం. రోజాకు హోంశాఖ ఇస్తారని అనుకున్నా అది సామాజిక కుల సమీరణాల్లో సాధ్యం కాలేదు. కనీసం కీలక శాఖ ఇచ్చినా బాగుండేది. రోజా సమర్థురాలు.. ఫైర్ బ్రాండ్. కానీ ప్రాధాన్యత లేని శాఖ ఇవ్వడంపై ఆమె కూడా లోలోపల కుమిలిపోతున్నారని టాక్ నడుస్తోంది.
మొత్తానికి ఏపీలో మంత్రి పదవులు ఇచ్చినా కొందరు సీనియర్లకు ప్రాధాన్యత లేని శాఖలు ఇవ్వడం ఇప్పుడు చిచ్చుపెట్టినట్టైంది. వారి అసంతృప్తి ఎప్పుడు చల్లారుతుందో వేచిచూడాలి.
Also Read: PM Modi- Russia-Ukraine War: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో విజేతలుండరని మోడీ సంచలన వ్యాఖ్యలు
Recommended Videos: