Minister Roja: రాజకీయాల్లో దూకుడు స్వభావం ఒక్కోసారి మంచిచేసినా.. ఎక్కువగా కీడే చేస్తుందని చెప్పాలి. దూకుడు స్వభావం ఉన్న నేతలు రాజకీయాల్లో అంతగా రాణించలేదు. అందునా ఎదుటివారిపై నోరుపారేసుకున్న నేతలు చాలా వేగంగా తెరమరుగైపోతారు. ఇప్పుడు మంత్రి రోజా పరిస్థితి అలాగే ఉంది. కనీసం తనకంటే ముందుగా మంత్రి పదవులు చేపట్టిన వారినైనా చూసి ఆమె వ్యవహరించడం లేదు. అనిల్ కుమార్ యాదవ్, కొడాలి నాని, పేర్ని నాని వంటి వారు మంత్రులుగా ఉన్నప్పుడు ఎగసిపడ్డారు. తీరా అధికారం దూరమయ్యేసరికి వారికి తత్వం బోధపడింది. ఇప్పుడు వారి వంతు రోజాకు వచ్చింది. అసలే సొంత నియోజకవర్గంలో, సొంత పార్టీలో ఆమె ఎదురీదుతున్నారు. ఇటువంటి సమయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. హుందగా నడుచుకోవాలి. కానీ మంత్రి పదవి ఇచ్చి ఏరికోరి కష్టాలు తెచ్చుకున్నామని ఇప్పుడు సీఎం జగన్ బాధపడుతున్నట్టు తెలుస్తోంది.

విశాఖలో జనసేన, వైసీపీ మధ్య రగడకు మంత్రి రోజాయే కారణమన్న కామెంట్స్ అధికార పార్టీలో వినిపిస్తున్నాయి. విశాఖ ఎపిసోడ్ తరువాతే రాష్ట్రంలో పోలిటిక్స్ శరవేగంగా మారిపోయాయి. అప్పటివరకూ కలుస్తారనుకొని ఊహాగానాలు వస్తున్నా.. చంద్రబాబు, పవన్ ను కలిపింది మాత్రం విశాఖ ఎపిసోడ్. అయితే విశాఖ ఎయిర్ పోర్టు ఘటనకు మంత్రి రోజాయే కారణమని అటు నిఘా వర్గాలు, ఇటు సహచర మంత్రులు సీఎం జగన్ కు చెప్పినట్టు సమాచారం. ఎయిర్ పోర్టులో నాడు రోజా జన సైనికులు వేలు పెట్టి చూపించడంతోనే ఘటనకు ఆజ్యం పోసినట్టయ్యిందని వారు సీఎంకు చెప్పారుట. అప్పటి నుంచి సీఎం జగన్ కూడా అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. దీనికి తోడు నగిరిలో కూడా రోజా అందర్నీ కలుపుకొని వెళ్లడం లేదని ఫిర్యాదులు వస్తున్నాయి. ఆ మధ్యన అసమ్మతి నేతలతో తాను పడుతున్న బాధను ఓ నేతతో ఫోన్ లో వ్యక్తం చేయడం.. ఆ ఆడియో రికార్డులను సోషల్ మీడియాలో చక్కెర్లు కొట్టడం వెనుక రోజా ఉన్నారన్న సమాచారం సీఎం జగన్ టేబుల్ పైకి వచ్చినట్టు సమాచారం.

ఇటువంటి పరిస్థితుల్లో నగిరి నియోజకవర్గ రివ్యూను సీఎం జగన్ ఇటీవల నిర్వహించారు. నియోజకవర్గం నుంచి 50 మంది యాక్టివ్ నాయకులు వచ్చారు. ఈ క్రమంలో మంత్రి రోజా అసమ్మతి నేతలపై ఫిర్యాదుచేశారు. దీంతో దీనిపై జగన్ రియాక్ట్ అయినట్టు సమాచారం. నియోజకవర్గంలో పార్టీ పరిస్థితిని పక్కనపెడదాం,. మీ వ్యవహారశైలి వల్ల పార్టీకి డ్యామేజ్ జరుగుతోందని జగన్ క్లాస్ ప్రారంభించారుట. మీ దురుసు ప్రవర్తనతో లేనిపోని ఇబ్బందులు వస్తున్నాయని రోజాతో అనడంతో ఆమె కన్నీటిపర్యంతమయ్యారుట. అసలు సోషల్ మీడియాకు లీకులు ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందని కూడా జగన్ కఠువుగా ప్రశ్నించినట్టు సమాచారం. పేరుకే నియోజకవర్గ రివ్యూ కానీ.. జగన్ విశాఖ ఎపిసోడ్ ను గుర్తుచేస్తూ రోజాకు ప్రశ్నలు సంధించినట్టు తెలుస్తోంది. అసలు మీరెందుకు విశాఖ వెళ్లారు? అది ఉత్తరాంధ్ర నేతలు చేసుకునే గర్జన కదా? కనీసం మీకు ఆ ప్రాంతంతో ఉన్న సంబంధమేమిటని గట్టిగానే ప్రశ్నించినట్టు సమాచారం. అటు తరువాత నగిరిలో కూడా మీ పనితీరు బాగాలేదని.. మెరుగుపరచుకుంటే మంచిది.. లేకుంటే కష్టమని హితబోధన చేసినట్టు తెలుస్తోంది. మొత్తానికైతే విశాఖ ఎయిర్ పోర్టులో జన సైనికులు వేలి చూపించిన రోజా ఏరికోరి కష్టాలు తెచ్చుకున్నారన్న మాట.