Minister Roja Driving Share Auto : రాజకీయ పార్టీల నేతలు ప్రజల అభిమానం కోసం ఏమైనా చేస్తారు. వారి సంక్షేమం కోసం ఎంతకైనా దిగజారుతారు. ముఖ్యంగా ఎన్నికల వేళ నేతలంతా వివిధ వ్యాపారాలు చేసే, కులసంఘాల వృత్తులు సైతం చేస్తుంటారు. దోశలు వేస్తూ.. బట్టలు ఉతుకుతూ.. వడ్రంగి పనిచేస్తూ.. కంసాలి పనిచేస్తూ.. బట్టలు ఇస్త్రీలు చేస్తూ వివిధ వేషాలు వేస్తుంటారు. గత ఎన్నికల సమయంలో ఒక నేత అయితే చంటి పిల్లాడి ముడ్డి కూడా కడిగి ఓట్లు అడిగాడు.

అయితే ఎన్నికల వేళ మాత్రమే కాదు.. సంక్షేమ పథకాలు పంచే వేళలో కూడా నేతలు ప్రజల పాత్రల్లోకి ఒదిగిపోతున్నారు. తాజాగా మంత్రి రోజా కూడా అదే పనిచేసింది. ఈమెనే కాదు సీఎం జగన్ సైతం ఈరోజు ఆటో డ్రైవర్ గా మారిపోయారు.
ఏపీ మంత్రి ఆర్కే రోజా తిరుపతి కలెక్టరేట్ లో ఆటో నడిపి సందడి చేశారు. వాహనమిత్ర పథకం లబ్ధిదారులకు డబ్బులు జమ చేసిన తర్వాత సరదాగా ఇలా డ్రైవర్ గా మారి ఆటో హ్యాండిల్ పట్టారు. ఇక ఎన్నడూ లేనిది ఆటో డ్రైవర్ డ్రెస్ వేసుకొని రోజా చేసిన హంగామా అంతా ఇంతాకాదు.. అచ్చం ఆటో డ్రైవర్ లా షేర్ ఆటోను నడిపి హల్ చల్ చేసింది.
ఇక తమను విమర్శిస్తున్న పవన్ కళ్యాణ్ ను.. జనసేన పార్టీ చేపట్టిన డిజిటల్ క్యాంపెయిన్ పై రోజా సెటైర్లు వేశారు. డిజిటల్ ప్రచారం హాస్యాస్పదం ఉందని.. ప్రజల హృదయాల్లో పవన్ కళ్యాణ్ ఎప్పటికీ స్థానం సంపాదించలేరని.. పవన్ కల్యాణ్ టీడీపీ, బీజేపీని ఎందుకు ప్రశ్నించరో చెప్పాలని రోజా డిమాండ్ చేశారు.
ఇక జగన్ సైతం ఆటోడ్రైవర్ ఖాకీ చొక్కా వేసుకొని ప్రసంగించారు. వాహనాల్లో కలియ తిరిగారు. ఇలా ఈరోజు వాహనమిత్ర కార్యక్రమం సందర్భంగా వైసీపీ నేతలు చేసిన హంగామా అంతా ఇంతాకాదు.