YS Sharmila: తెలంగాణ రాష్ర్ట వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తరుచూ వార్తల్లో నిలుస్తుంటారు. ఈ మేరకు ఆయన మంగళవారం మరదలమ్మా అంటూ సంబోధించిన వ్యాఖ్యలపై పెద్ద దుమారమే రేగుతోంది. ఒక మహిళా నాయకురాలుపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటే పెద్ద గందరగోళం చెలరేగింది. వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రాష్ర్టంలో పాదయాత్ర చేస్తున్న సందర్భంలో మంత్రి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మహిళా నేతపై ఇలాంటి తీరు మాట్లాడటం సబబు కాదని పలువురు పేర్కొంటున్నారు.

తెలంగాణలో ఉద్యోగాల భర్తీ కోసం ప్రతి మంగళవారం నిరుద్యోగ నిరాహార దీక్ష చేస్తున్న షర్మిలను ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేశారని వైఎస్సార్ టీపీ నేతలు మండిపడుతుండగా నిరంజన్ రెడ్డి తన వ్యాఖ్యలపై స్పందించారు. తాను ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేయలేదని చెప్పారు. తెలంగాణలో ఉద్యోగాలు పొందేందుకు ఆంధ్రోళ్ల కుట్రగా అభివర్ణించారు.
మంగళవారం మరదలమ్మా అని చేసిన వ్యాఖ్యల్లో ఎక్కడ కూడా అసభ్యత లేదని పేర్కొన్నారు. ఏకవచనం కాకుండా చివరకు అమ్మా అంటూ గౌరవసూచకంగానే మాట్లాడానని చెప్పారు. కొందరు సంస్కారహీనంగా చూస్తే వారికి అదే విధంగా అర్థమవుతుంది కానీ సంస్కారంతో చూస్తే తన మాటలు అలాగే ఉంటాయని చెబుతున్నారు.
వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తన కుమార్తె కంటే పెద్దదన్నారు. తన సోదరి కంటే చిన్నదన్నారు. తాను ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేయలేదని చెప్పుకొచ్చారు. దీనిపై రాజకీయ అనిశ్చితి నెలకొనే సూచనలు కనిపిస్తున్నాయి.