Homeజాతీయ వార్తలుKTR on Huzurabad : ఆప‌రేష‌న్‌ హుజూరాబాద్.. కేటీఆర్ చెప్పింది నిజంగా నిజ‌మా?

KTR on Huzurabad : ఆప‌రేష‌న్‌ హుజూరాబాద్.. కేటీఆర్ చెప్పింది నిజంగా నిజ‌మా?

KTR on Huzurabad :హుజూరాబాద్ ఉప ఎన్నిక బ‌రువెంత‌? రాజకీయాలపై కనీస అవగాహన ఉన్న ఎవ‌రిని అడిగినా ఈ ప్ర‌శ్న‌కు స‌మాధానం చెప్పేస్తారు. ఆ ఎన్నిక‌కు రాష్ట్ర రాజ‌కీయాల‌ను ప్ర‌భావితం చేసేంత బ‌ల‌ముంద‌ని! భ‌విష్య‌త్ ను నిర్దేశించ‌గ‌లిగే కెపాసిటీ ఉంద‌ని! మ‌రి, ఇలాంటి ఎన్నిక‌కు.. పెద్ద ప్రాధాన్య‌త లేద‌న్న‌ట్టుగా మాట్లాడితే? అది కూడా టీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ నోటి నుంచి వ‌స్తే? ఏదో జ‌రుగుతోంద‌ని అర్థం చేసుకోవ‌చ్చు అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి, ఇంత‌కీ ఏం జ‌రుగుతోంది? కేటీఆర్ ఇలా మాట్లాడడానికి కారణాలేంటీ??

హుజూరాబాద్ ఉప ఎన్నిక రాష్ట్ర రాజ‌కీయాల్లో ఎలాంటి మార్పులు తెచ్చిందో అంద‌రికీ తెలిసిందే. ఏకంగా.. ‘ద‌ళిత బంధు’ వంటి సంచలన పథకానికి కారణం హుజూరాబాదే అన్న సంగతి బహిరంగ రహస్యం. కేవలం ఈ ఉప ఎన్నిక కోస‌మే తెచ్చార‌ని విప‌క్షాలు తీవ్ర‌స్థాయిలో ఆరోపిస్తున్నాయి. ముఖ్య‌మంత్రి కూడా ప‌రోక్షంగా ఇదే విష‌యాన్ని ఒప్పుకున్నారు కూడా. ఇక‌, హుజూరాబాద్ లో జ‌నం అడ‌గ‌డ‌మే ఆల‌స్యం అన్న‌ట్టుగా.. రేష‌న్ కార్డులు, పింఛ‌న్లు ఇత‌ర‌త్రా ప‌థ‌కాలు కూడా అందిస్తున్నార‌నే ప్ర‌చారం సాగింది.

అటు కేసీఆర్ తిరిగి జ‌నాల్లోకి వ‌చ్చేశారు. హుజూరాబాద్ వెళ్లి స్వ‌యంగా ద‌ళిత బంధును ప్రారంభించారు. వాసాల మ‌ర్రిలోనూ ల‌బ్ధి క‌లిగించారు. రాష్ట్రంలోని మ‌రో నాలుగు మండ‌లాల‌ను కూడా ద‌ళిత బంధు ప‌రిధిలోకి తెచ్చారు. ఈ విధంగా.. కేసీఆర్ యాక్టివేట్ అయ్యారు. ఇదంతా హుజూరాబాద్ ఉప ఎన్నిక కార‌ణంగానే అంటున్నారు విశ్లేష‌కులు.

ఇక‌, ఉప ఎన్నిక బాధ్య‌త తీసుకున్న హ‌రీశ్‌రావు.. గులాబీ పార్టీని గెలిపించేందుకు స‌ర్వ‌శ‌క్తులూ ఒడ్డుతున్నారు. ఈట‌ల‌తో సై అంటే సై అంటున్నారు. అయితే.. నిజానికి ఉమ్మ‌డి క‌రీంన‌గ‌ర్ జిల్లా మంత్రిగా కేటీఆర్ ఉన్నారు. ఆయ‌న టీఆర్ ఎస్ పార్టీకి వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కూడా. కాబ‌ట్టి.. ఏ విధంగా చూసినా.. ఈ ఉప ఎన్నిక బాధ్య‌త ఆయ‌నే తీసుకుంటార‌ని చాలా మంది అనుకున్నారు. కానీ.. హ‌రీష్ ను రంగంలోకి దించారు. ఈ స‌మ‌యంలో విమ‌ర్శ‌లు కూడా వ‌చ్చాయి. గులాబీ పార్టీ ఓడిపోయే చోట హ‌రీష్ కు బాధ్య‌త‌లు అప్ప‌గిస్తున్నార‌నే చ‌ర్చ జ‌రిగింది. దీనికి ఉదాహ‌ర‌ణ‌గా దుబ్బాక‌ను చూపిస్తున్నారు. ఇప్పుడు హుజూరాబాద్ లో త్రాసు ఈట‌ల వైపే మొగ్గు చూపుతోంద‌నే విశ్లేష‌ణ‌లు వ‌స్తున్న నేప‌థ్యంలో.. ఇక్క‌డ కూడా బ‌రువు హ‌రీష్ రావు నెత్తినే పెట్టేశారు. అయిన‌ప్ప‌టికీ.. ఆయ‌న ప్ర‌య‌త్నం గ‌ట్టిగానే చేస్తున్నారు.

ఇలాంటి సంద‌ర్భంలో విజ‌యం త‌మ‌దేన‌ని చెప్పాల్సిన కేటీఆర్‌.. కారుకు ఎదురు లేద‌ని చెప్పాల్సిన వ‌ర్కింగ్ ప్రెసిడెంట్.. అదో చిన్న ఎన్నిక అని చెప్ప‌డంలో ఆంత‌ర్య‌మేంటి? అనే చ‌ర్చ సాగుతోంది. ఆ మ‌ధ్య రాష్ట్ర క‌మిటీ స‌మావేశంలో ఇదే మాట అన్న కేటీఆర్‌.. ఇప్పుడు ఇత‌ర స‌మావేశాల్లోనూ అదే మాట్లాడుతున్నారు. త‌ద్వారా.. ఆ ఎన్నిక‌కు ప్రాధాన్యం లేదు అని చెప్పేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. నిజంగా.. హుజూరాబాద్‌ ఎన్నిక‌కు ప్రాధాన్యం లేదా? కేటీఆర్ మాటలు.. నిజంగా నిజమేనా??

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version