
మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తన హత్యకు ఓ టీఆర్ఎస్ మంత్రి కుట్ర పన్నారని.. సుపారీ కూడా ఇచ్చారని విమర్శించారు. ‘తనను చంపడానికి కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ మంత్రి హంతక ముఠాలతో సంప్రదింపులు చేస్తున్నారని’ ఈటల రాజేందర్ సంచలన ఆరోపణలు చేశారు.‘అరె కొడుకుల్లారా? ఖబర్ధార్.. నరహంతకుడు నయీం నన్ను చంపుతా అంటేనే నేను భయపడలేదు. మీ చిల్లర ప్రయత్నాలకు అసలు భయపడను. ఉగ్గుపాలతో ఉద్యమాలు చేసినవాడిని.. ఈటల మల్లయ్య కొడుకును.. ఆత్మగౌరవం కోసం కొట్లాడుతా.. దుబ్బాకలో ఏం జరిగిందో అదే ఇక్కడ కూడా జరుగుతుంది’ అని తీవ్రస్థాయిలో ఈటల సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈటల రాజేందర్ చేసిన ఆరోపణలపై మాజీ మంత్రి గంగుల స్పందించారు. ఈటల రాజేందర్ కు ప్రభుత్వం తగిన భద్రత కల్పిస్తోందని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఈటల నిండునూరేళ్లు బతకాలని కోరుకుంటున్నానని చెప్పారు. ఈటలతో రాజకీయ వైరమే తప్ప వ్యక్తిగత కక్ష లేదని మంత్రి గంగుల తెలిపారు.
‘ఈటలకు ఎలాంటి భయాలు అవసరం లేదు. ఆయన ప్రాణానికి నా ప్రాణం అడ్డు పెట్టి బతికించుకుంటా.. నాకు నేరచరిత్ర లేదు. కేసీఆర్ పాలనలో రాజకీయ హత్యలు ఉండవు. రాజకీయ ఆత్మహత్యలే ఉంటాయి.’ అని గంగుల కమలాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
మాజీ మావోయిస్టు ఏ మంత్రి పేరు చెప్పాడో ఈటల బయటపెట్టాలని డిమాండ్ చేశారు. విచారణలో నా పేరు ఉంటే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని తెలిపారు. ఏ దర్యాప్తు సంస్థతోనైనా విచారణకు సిద్ధం అని స్పష్టం చేశారు.ఈటల సానుభూతి కోసం ప్రయత్నిస్తున్నారని గంగుల అన్నారు.