Dharmana Prasada Rao: వైసీపీ నేతలకు అసలు సీన్ అర్థమవుతోంది. ప్రజలు తమపై ఒక కచ్చితమైన అభిప్రాయానికి వచ్చినట్లు తెలుసుకుంటున్నారు. కొందరు ఎమోషనల్ బ్లాక్ మెయిల్ కు దిగుతున్నారు. మరొకరు వైరాగ్యపు మాటలు చెబుతున్నారు. కొంతమంది సీనియర్లు అయితే ఇక లాభం లేదని.. మీ ఇష్టమని.. మీరు ఓట్లు వేస్తే ఎమ్మెల్యే అవుతాను. లేకుంటే మాత్రం నీకు ఇప్పుడు అందుతున్న సేవలు అన్ని నిలిచిపోతాయని, సంక్షేమం అందని ద్రాక్షగా మిగులుతుందని తేల్చి చెబుతున్నారు. ఇటువంటి వ్యాఖ్యలు చేయడంలో సీనియర్ మంత్రి ధర్మాన ప్రసాదరావు ముందంజలో ఉండడం విశేషం.
శ్రీకాకుళం నియోజకవర్గానికి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గత ఎన్నికల్లో జిల్లాలో తక్కువ మెజారిటీతో గెలిచిన వ్యక్తి ఆయనే. అందుకే ఈసారి విజయం కోసం గట్టిగా కష్టపడాల్సిన అనివార్య పరిస్థితి ఎదురైంది. జిల్లా కేంద్రం కావడంతో ఉద్యోగ, ఉపాధ్యాయులు అధికంగా ఉంటారు. ఎగువ మధ్య తరగతి కుటుంబాలు నివాసం ఉంటాయి. ప్రస్తుతం ఆ వర్గాలన్నీ వైసీపీ ప్రభుత్వ తీరుపై ఆగ్రహంగా ఉన్నాయి. ఆ ఓట్లు పడవని ధర్మాన ప్రసాదరావు ఒక డిసైడ్ కు వచ్చారు. అందుకే గ్రామీణ ప్రాంతాలకు వెళ్లి అక్కడ ప్రజల మైండ్ లో మార్పు తేవాలని భావిస్తున్నారు. ఒక రకంగా ప్రజలకు ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తున్నట్లు కామెంట్స్ వినిపిస్తున్నాయి.
తన నియోజకవర్గ పరిధిలోని ఓ గ్రామానికి ఇటీవల వెళ్లారు. మీకు ఓట్లు అడగను.. నా పని తీరు నచ్చితేనే ఓట్లు వేయండి అంటూ వ్యాఖ్యానించారు. మీ వరకు మీకు మంత్రిగా ఉంటాను. ఏ పనైనా చేయిస్తాను. నేను మళ్ళీ కావాలన్నా.. మంత్రిగా రావాలన్నా ఓటు వేయండి. అలాకాకుండా టిడిపికే ఓటు వేస్తే మాత్రం వచ్చే జూన్ నుంచి మీ ఇంటి వద్దకు వలంటీర్ రాడు. పింఛన్ అందదు.. అంటూ ఒక రకమైన హెచ్చరికలతో కూడిన వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ కృష్ణుడు వ్యాసం వేశారని.. ఆయన పార్టీకి ఓట్లు వేస్తే నష్టపోతారనిప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు మాట్లాడారు.
గత కొంతకాలంగా శ్రీకాకుళం నియోజకవర్గ ప్రజలు అధికార పార్టీ తీరుపై అసంతృప్తితో ఉన్నారు. ముఖ్యంగా అర్బన్ ఓటర్లు అభివృద్ధి కనిపించకపోవడంతో వ్యతిరేకంగా మారారు. అటు అన్ని సర్వేల్లో సైతం వైసీపీకి ప్రతికూల ఫలితాలు కనిపిస్తున్నాయి ఇక్కడ. దీంతో ధర్మాన వైఖరి మార్చుకున్నారు. ప్రజలను బుజ్జగిస్తూనే హెచ్చరికలతో కూడిన వ్యాఖ్యానాలు చేస్తున్నారు. ఒక్కో సందర్భంలో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా మాట్లాడుతున్నారు. అయితే సుదీర్ఘకాలం ధర్మాన ప్రసంగాలు, చతురత కలిగిన మాటలు చూసిన శ్రీకాకుళం నియోజకవర్గ ప్రజలు.. ఇప్పుడు ముఖం చాటేస్తున్నారు. దీంతో ధర్మాన పునరాలోచనలో పడిపోయారు. అందుకే వైరాగ్యపు మాటలు, బ్లాక్ మెయిల్ తరహా వ్యాఖ్యలతో సొంత పార్టీ శ్రేణులకు విస్మయ పరుస్తున్నారు.