Janasena: జనసేనాని పవన్ కళ్యాణ్ దూకుడు పెంచారు. అధికార పక్షంపై పదునైన మాటలు, వాగ్భానాలు సంధిస్తున్నారు. ప్రజా సమస్యలపై పోరాడుతూనే వైసీపీ ప్రభుత్వ తప్పిదాలను ఎండగడుతున్నారు. పవన్ ను ఎలా అడ్డుకట్ట వేయాలో తెలియక అధికార పక్షం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. కాపు మంత్రులను రంగంలోకి దించుతోంది. వారితో పవన్ వ్యక్తిగత జీవితంపై విమర్శలు చేయిస్తోంది. పవన్ అత్మస్థైర్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తోంది. ఇటీవల జనసేన గ్రాఫ్ పెరుగుతోంది. అందుకు తగ్గట్టుగానే పవన్ రూటు మార్చారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు భరోసానిచ్చేందుకు యాత్రలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే అనంతపురంలో యాత్ర పూర్తిచేసుకున్న పవన్ పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. ఆత్మహత్య చేసుకున్న కుటుంబానికి ఒక్కొక్కరికీ రూ.లక్ష చొప్పున సాయమందిస్తున్నారు. ఇందుకుగాను రూ.5 కోట్లతో ప్రత్యేక నిధిని సైతం ఏర్పాటుచేశారు. అయితే పవన్ యాత్రకు రాజకీయాలకతీతంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటివరకూ రాష్ట్రంలో జరిగిన యాత్రలన్నీ రాజకీయ కోణంలో జరిగినవే. తండ్రి అకాల మరణంతో జగన్ అప్పట్లో ఓదార్పు యాత్ర చేపట్టారు. అది ఆయన రాజకీయ మైలేజ్ కు పనికొచ్చింది. ఎంపిక చేసిన వైసీపీ సానుభూతిపరుల కుటుంబాలను కలిసిన జగన్ అప్పట్లో రాజకీయ ప్రకటనలు చేసి బాగానే లబ్ధి పొందారు. కానీ ఇప్పుడు పవన్ చేస్తున్న రైతుభరోసా యాత్ర మాత్రం అందుకు విరుద్ధం. రైతు ఆత్మహత్యల్లో దేశంలోనే మన రాష్ట్రం మూడో స్థానంలో ఉంది. అదే కౌలురైతుల ఆత్మహత్యల విషయంలో మాత్రం ఒకటో స్థానంలో ఉంది. దీనిని గుర్తుచేసుకునే తాను రోడ్డు మీదకు రావాల్సి వచ్చిందని పవన్ చెబుతున్నారు. పవన్ మాటలు, వ్యవహార శైలి రైతుల్లో కొత్త ఆలోచనలను రేకెత్తిస్తున్నాయి. పవన్ ప్రభుత్వ బాధ్యతలను గుర్తుచేస్తునే..తాను చేపట్టిన భరోసా యాత్ర పరమార్ధాన్ని అన్నదాతలు సైతం గుర్తిస్తున్నారు. పవన్ అనంతపురం పర్యటన ముగించేలోగా.. ఇతర ప్రాంతాల్లో ఆత్మహత్యకు పాల్పడిన రైతు కుటుంబాలకు ప్రభుత్వం సాయం చేయడం ప్రారంభించింది. ఎప్పుడైతే పవన్ కౌలు రైతుల కోసం ఆలోచన చేసి కార్యాచరణ ప్రారంభించిన తరువాత ప్రభుత్వం ఉలికిపాటుకు గురైంది. రైతుల నుంచి వ్యతిరేక భావన ప్రారంభమైందని గ్రహించి ఆదరాబాదరాగా బాధిత కుటుంబసభ్యులకు పరిహారం అందించడం ప్రారంభించింది.
గతానికి భిన్నంగా..
గతానికి భిన్నంగా పవన్ కూడా తన ప్రసంగాలను పదునెక్కించారు. కౌలు రైతుల సమస్యలు వైసీపీ సృష్టించినవి కావని చెబుతునే.. వైసీపీ అధికారంలో ఉండి పట్టించుకోకపోవడం వల్ల వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆరోపించారు. దీనికి బాద్యత సీఎం జగన్ దేనని జనసేన అధినేత పవన్ స్పష్టం చేశారు.ప్రజల కన్నీళ్లు తుడవకపోతే జగన్‌ను గట్టిగా అడుగుతామని తేల్చిచెప్పారు. ప్రభుత్వం కౌలు రైతులకు సాయం చేసి ఉంటే తాను రోడ్డు మీదకు రావలసిన అవసరం వచ్చేది కాదన్నారు. తిరుగులేని మెజారిటీ ఇచ్చిన ప్రజల కన్నీళ్లు తుడవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందిని గుర్తు చేశారు. అటువంటప్పుడు ఎంతో ఆర్భాటంగా ఏర్పాటుచేసిన గ్రామ సచివాలయాలు ఎందుకని ప్రశ్నించారు. జనసేన ఎత్తుకుంటే తప్ప మీకు సమస్య గుర్తుకురాలేదా అని గట్టిగానే పవన్ ప్రశ్నించారు. ఒకసారి వచ్చి ఆత్మహత్యలు చేసుకున్న వారి కుటుంబసభ్యులతో మాట్లాడితే వారి కుటుంబాల బాధలు అర్థమయ్యేవన్నారు. పనిలో పనిగా యువత బాధ్యతను కూడా గుర్తుచేశారు. గత ఎన్నకల్లో యువత చేసిన తప్పిదాన్ని కూడా ఎలుగెత్తి చూపారు. తన సభలకు అత్యధికంగా యువత వస్తున్నారని.. కానీ ఓటు రూపంలో అభిమానం చూపలేకపోతున్నారని లోపాన్ని బయటపెట్టారు. నాపై వ్యక్తిగత ఇష్టం ఉన్నప్పటికీ 2019 ఎన్నికల్లో జగన్‌కు ఓటేశారని.. అలా చేసినందుకు తనకు బాధలేదని.. తాను స్వాగతిస్తానన్నారు. తాను ఒక్కొక్క మెట్టు ఎక్కాలనుకునేవాడినని. రాత్రికి రాత్రి రాజ్యాధికారం కావాలనుకునే వ్యక్తిని కాదన్నారు. మూడేళ్ల వైసీపీ పాలన చూసైనా యువతలో మార్పురావాలన్నారు. 2024 ఎన్నికల్లో అయినా బాధ్యత గుర్తెరగాలని హితవుపలికారు.
జగన్ కు కౌంటర్
జగన్ తన పేరు ఎత్తకుండా తన పేరును దత్తపుత్రుడుగా సంభోదించిన అంశంపై కూడా పవన్ స్పందించారు. తాను ఎవరికీ దత్తపుత్రుడ్ని కాదని.. సీబీఐకి మీరే దత్తపుత్రుడంటూ సీఎం మాటలను తిప్పికొడుతున్న తీరు రాజకీయ విశ్లేషకులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
. చంచల్‌గూడలో షటిల్ ఆడుతూ మీరు నాకు చెబుతున్నారా? అని ప్రశ్నించారు. ఇంకోసారి దత్తపుత్రుడు అంటే.. సీఎం అనే గౌరవం కూడా ఇవ్వబోనని తేల్చిచెప్పారు. సీఎం జగన్ కు గంటి కౌంటరే ఇచ్చారు. అసలు తనను దత్తత తీసుకుంటే భరించేవారున్నారా? అని ప్రశ్నించారు. మొత్తానికి జనసేనాని ఓ మంచి ప్రయత్నానికి దిగగా.. అధికార పక్షం సహకరించాల్సింది పోయి లేని పోని సమస్యలను తెచ్చి పెడుతోంది. సరిగ్గా పవన్ పర్యటన రూట్లలో రోడ్డు మరమ్మతుల పేరిట కొత్త నాటకానికి తెరలేపింది. కానీ వాటన్నింటిని అధిగమిస్తూ జనసేనాని తాను అనుకున్నది చేసుకుపోతున్నారు. ప్రజల్లో తన గ్రాఫ్ ను పెంచుకుపోతున్నారు. ఇదే రాజకీయ పరిణితితో పవన్ ముందుకు సాగితే అధికార పక్షానికి చుక్కలు కనిపించక తప్పదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.