Haryana Election 2024: దేశంలో హర్యానా, జమ్మూ కశ్మీర్ అసెంబ్లీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. కశ్మీర్‌లో ఇప్పటికే రెండు విడతల పోలింగ్ పూర్తయింది. మూడో విడత పోలింగ్ మంగళవారం(అక్టోబర్ 1న) జరుగనుంది. ఇక హర్యానా ఎన్నికలకు మరో ఐదు రోజుల గడువు ఉంది. ప్రచారం మూడు రోజుల్లో ముగియనుంది. దీంతో అన్ని పార్టీలు ఓటర్లును ఆకట్టుకునేందుకు తుది విడత ప్రచారంతో హోరెత్తిస్తున్నాయి. హామీలు, వరాలు కురిపిస్తున్నాయి. మరోమారు అధికారమే లక్ష్యంగా బీజేపీ, ఈసారి ఎలాగైనా బీజేపీని గద్దె దించాలని కాంగ్రెస్, ఆప్‌తోపాటు ప్రాంతీయ పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. ఇక ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు గెలుపు కోసం భారీగా డుబ్బలు ఖర్చు చేస్తున్నారు. ప్రస్తుతం ఎన్నికల బరిలో 1031 మందికిపైగా ఉన్నారు. ఇందులో సగానికిపైగా కోటీశ్వరులే అని అభ్యర్థుల వారి అఫిడవిట్లే చెబుతున్నాయి.
52 శాతం కోటీశ్వరులే..
హర్యానా అసెంబ్లీ ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరింది. ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు ఓటర్ల ప్రసన్నం కోసం పడరానిపాట్లు పడుతున్నారు. తీరిక లేకుండా ప్రచారం చేస్తున్నారు. మొత్తం 90 సీట్లు ఉన్న హర్యానా అసెంబ్లీ ఎన్నికల బరిలో 1031 మంది పోటీ చేస్తున్నారు. వీరిలో 52 శాతం మంది కోటీశ్వరులే. ఎన్నికల సమయంలో దాఖలుచేసిన నామినేషన్‌తోపాటు సమర్పించిన అఫిడివిట్ ప్రకారం 1028 మంది అభ్యర్థుల వివరాలను అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ ఫోరమ్ విశ్లేషించింది. బరిలో ఉన్న అభ్యర్థుల్లో 538 మంది కోటీశ్వరులే అని వెల్లడించింది.
పార్టీల వారీగా కోటీశ్వరులు..
కోటీశ్వరులైన అభ్యర్థుల జాబితాలో 184 మంది స్వతంత్రులు ఉన్నారు. బీజేపీకి చెందిన 85 మంది, కాంగ్రెస్ నుంచి 84 మంది, జేజేపీ నుంచి 46 మంది, ఐఎన్‌ఎల్డీ నుంచి 34 మంది, ఆప్ నుంచి 52 మంది బీఎస్పీ నుంచి 18 మంది కోటీశ్వరులు పోటీ చేస్తున్నారని నివేదిక తెలిపింది.
అత్యంత సంపన్నులు వీరే..
హర్యానాలోని హిసార్లోని నార్‌నౌండ్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉన్న కెప్టెన్ అభిమన్యు ఈ ఎన్నికల్లో పోటీచేస్తున్న అత్యంత సంపన్న అభ్యర్థి. ఈయన ఆస్తుల విలువ రూ.491 కోట్లుగా నామినేషన్ పత్రాల్లో పేర్కొన్నారు. సోహ్నా నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి రోహస్ సింగ్ సంపన్నుల జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు. ఇతని ఆస్తుల విలువ రూ.484 కోట్లుగా అఫిడవిట్‌లో పేర్కొన్నారు. హిసార్ నుంచి పోటీ చేస్తున్న సావిత్రి జిందాల్ ఆస్తుల విలువ రూ.270 కోట్లు ఉన్నట్లు పేర్కొన్నారు.
రూ.5 కోట్లకుపైగా ఆస్తి ఉన్నవారు..
– ఇక ఎన్నికల బరిలో ఉన్నవారిలో 27 శాతం అంటే 277 మంది రూ.5 కోట్లకుపైగా ఆస్తులు ఉన్నవారే. 13 శాతం మంది అంటే 136 మంది రూ.2 కోట్లకుపైగా ఆస్తి కలిగి ఉన్నారు. రూ.50 లక్షల నుంచి రూ.2 కోట్ల వరకు ఆస్తి ఉన్నవారు 22 శాతం మంది ఉండగా, రూ.10 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు ఆస్తి ఉన్నవారు 19 శాతం మంది ఉన్నారు. రూ.10 లక్షల కన్నా ఆస్తి తక్కువగా ఉన్నవారు 19 శాతం మంది ఉన్నారు.
– ఈసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్న 1031 మంది అభ్యర్థుల్లో 13 శాతం అంటే.. 133 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. మరో 95 ందిపై సీరియస్ క్రిమినల్ కేసులు ఉన్నాయి.
– ఇక విద్యార్హత విషయానికి వస్తే ఈసారి పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో 209 మంది గ్రాడ్యుయేట్లు ఉన్నారు. 152 మంది పోస్టు గ్రాడ్యుయేట్లు ఉండగా, 15 మంది డాక్టరేట్‌లు ఉన్నారు. 201 మంది పదో తరగతి పాస్ అయ్యారు. చదువు రానివారు 15 మంది ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.
– ఎన్నికల్లో పోటీ చేస్తున్న 1,031 మందిలో కేవలం 100 మంది మాత్రమే మహిళలు ఉన్నారు. మిగతా 928 మంది పురుషులే.
2019 అసెంబ్లీ ఎన్నికల్లో 1,138 మంది పోటీ చేయగా వారిలో 42 శాతం అంటే 481 మంది కోటీశ్వరులు పోటీ చేశారు. ఈసారి వారి సంఖ్య 52 శాతానికి పెరిగింది.
Raj Sekhar is a senior content writer with good knoledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read More