Megastar Chiranjeevi : కోట్లు తీసుకునేది కొందరే.. అందర్నీ ఇబ్బంది పెట్టొద్దు.. మెగాస్టార్ సంచలన వ్యాఖ్య‌లు..!

Megastar Chiranjeevi : కరోనా సెకండ్ వేవ్ తర్వాత అన్ని రంగాలూ ఎప్పుడో గాడిన పడ్డాయి. ముందుకు దూసుకెళ్తున్నాయి. కానీ.. సినీ పరిశ్రమ మాత్రం ఇప్ప‌టికీ కుదుట ప‌డ‌లేద‌నే చెప్పాలి. పూర్తిస్థాయిలో అనువైన ప‌రిస్థితులు లేక‌పోవ‌డ‌మే ఇందుకు కార‌ణం. సినిమాలు పూర్త‌యి నెల‌లు గ‌డుస్తున్నా విడుద‌ల చేయ‌లేక‌పోవ‌డానికి కార‌ణం ఇదే. ఇదే విష‌యాన్ని స్ప‌ష్టంగా చెప్పిన మెగాస్టార్ చిరంజీవి.. ప్ర‌భుత్వాల తీరుపై న‌ర్మ‌గ‌ర్భ వ్యాఖ్య‌లు చేశారు. నాగ‌చైత‌న్య, సాయిప‌ల్ల‌వి జంట‌గా న‌టించిన ‘ల‌వ్ స్టోరీ’ చిత్రం 24 […]

Written By: Bhaskar, Updated On : September 20, 2021 11:14 am
Follow us on

Megastar Chiranjeevi : కరోనా సెకండ్ వేవ్ తర్వాత అన్ని రంగాలూ ఎప్పుడో గాడిన పడ్డాయి. ముందుకు దూసుకెళ్తున్నాయి. కానీ.. సినీ పరిశ్రమ మాత్రం ఇప్ప‌టికీ కుదుట ప‌డ‌లేద‌నే చెప్పాలి. పూర్తిస్థాయిలో అనువైన ప‌రిస్థితులు లేక‌పోవ‌డ‌మే ఇందుకు కార‌ణం. సినిమాలు పూర్త‌యి నెల‌లు గ‌డుస్తున్నా విడుద‌ల చేయ‌లేక‌పోవ‌డానికి కార‌ణం ఇదే. ఇదే విష‌యాన్ని స్ప‌ష్టంగా చెప్పిన మెగాస్టార్ చిరంజీవి.. ప్ర‌భుత్వాల తీరుపై న‌ర్మ‌గ‌ర్భ వ్యాఖ్య‌లు చేశారు.

నాగ‌చైత‌న్య, సాయిప‌ల్ల‌వి జంట‌గా న‌టించిన ‘ల‌వ్ స్టోరీ’ చిత్రం 24 విడుదల కాబోతోంది. ఈ నేప‌థ్యంలో ఆదివారం ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ నిర్వ‌హించారు. ముఖ్య అతిథిగా హాజ‌రైన చిరంజీవి.. చిత్ర విశేషాల‌తోపాటు సినీ ప‌రిశ్ర‌మ ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌నుకూడా ప్ర‌స్తావించారు. ‘‘ఈ వేదిక‌పై నుంచి రెండు రాష్ట్రాల సీఎంల‌కు అప్పీల్ చేస్తున్నాను’’ అంటూ.. మొదలు పెట్టిన మెగాస్టార్.. సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న క‌ష్టాల‌ను వివ‌రించారు. క‌రోనా కార‌ణంగా ఇప్ప‌టికీ ప్రేక్ష‌కులు పూర్తిస్థాయిలో థియేట‌ర్ల‌కు రావ‌డానికి ఆలోచిస్తున్న ప‌రిస్థితి ఉంద‌న్నారు.

ఇక‌, ఇత‌ర స‌మ‌స్య‌ల కార‌ణాల‌నూ ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటే.. సినిమా విడుద‌ల చేయ‌డానికి భ‌య‌ప‌డే ప‌రిస్థితి నెల‌కొంద‌న్నారు. రెవెన్యూ వ‌స్తుందా? రాదా? అనే టెన్ష‌న్ వెంటాడుతోంద‌న్నారు చిరు. త‌న ఆచార్య మూవీ ఎప్పుడో పూర్త‌యింద‌ని, కానీ.. విడుద‌ల చేయ‌లేక‌పోతున్న‌ట్టు చెప్పారు. ఇలాంటి ప‌రిస్థితుల్లో ప్ర‌భుత్వం స్పందించి, ఇండ‌స్ట్రీకి ధైర్యం క‌ల్పించాల‌ని కోరారు. త‌మ స‌మ‌స్య‌లు తెలుపుతూ ప్ర‌భుత్వాల‌కు ఇచ్చిన విన‌తుల‌పై స్పందించి, అందుకు అనుగుణంగా జీవోలు ఇవ్వాల‌ని కోరారు.

సినిమా ఇండ‌స్ట్రీలో న‌లుగైదుగురు హీరోలు, ద‌ర్శ‌కులు మాత్ర‌మే భారీ పారితోషికాలు తీసుకుంటున్నార‌ని, వారిని చూసి ఇండ‌స్ట్రీ మొత్తం ఇలాగే ఉంద‌ని అనుకోవ‌ద్ద‌ని చెప్పారు. ఇండ‌స్ట్రీపై ప్ర‌త్య‌క్షంగా వేలాది మంది, ప‌రోక్షంగా ల‌క్ష‌ల మంది ఆధార‌ప‌డి ఉన్నార‌ని చెప్పిన చిరు.. క‌రోనా కాలంలో క‌నీసం తిన‌డానికి తిండిలేక వారు ప‌డిన అవ‌స్థ‌లు క‌ళ్లారా చూశామ‌న్నారు. వారిని ఆదుకునేందుకు త‌మ‌వంతుగా స‌హ‌క‌రించామ‌ని, ఇప్పుడు సినీ ప‌రిశ్ర‌మ గాడిన ప‌డ‌డానికి ప్ర‌భుత్వాలు స‌హ‌క‌రించాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. న‌లుగైదుగురి కోసం అంద‌రినీ బాధ‌పెట్టొద్ద‌ని వ్యాఖ్యానించారు చిరు.

చిరంజీవి చేసిన ఈ వ్యాఖ్య‌లు చ‌ర్చ‌నీయాంశం అయ్యాయి. నిజానికి సినీ ప‌రిశ్ర‌మ‌కు ఏపీతో పోలిస్తే.. తెలంగాణ ప్ర‌భుత్వం నుంచి మంచి స‌హ‌కార‌మే ఉంది. ఇక్క‌డ ప్ర‌ధాన‌మైన‌ టికెట్ రేట్ల‌పై ఆంక్ష‌లు లేవు. సీటింగ్ కెపాసిటీ కూడా 100 శాతం ఉంది. థియేట‌ర్ల‌కు పార్కింగ్ ఫీజు వ‌సూలు చేసుకోవ‌డానికి కూడా స‌ర్కారు అనుమ‌తించింది. విద్యుత్ బ‌కాయిల‌పైనా సానుకూల హామీ ఇచ్చిన‌ట్టుగా వార్త‌లు వ‌చ్చాయి. కానీ.. అటు ఏపీలో ప్ర‌ధాన‌మైన టికెట్ రేట్ల‌పై కోత పెట్టింది జ‌గ‌న్ స‌ర్కారు. ఈ మేజ‌ర్ కార‌ణంగానే పెద్ద సినిమాలు రిలీజ్ కావ‌ట్లేదు. ఆక్యుపెన్సీ ఇబ్బంది కూడా ఉంది. దీనికితోడు ప్ర‌భుత్వ‌మే ఆన్ లైన్ టికెట్లు అమ్ముతామంటూ జీవో తెచ్చింది. ఇవ‌న్నీ చూసిన‌ప్పుడు.. చిరంజీవి వ్యాఖ్య‌లు జ‌గ‌న్ ప్ర‌భుత్వాన్ని ఉద్దేశించిన‌వేనా? అనే చ‌ర్చ సాగుతోంది.

ఏపీ స‌ర్కారు తెచ్చిన ఆన్ లైన్ టికెట్ల విష‌య‌మై రేపు (సోమ‌వారం) సినీ ప్ర‌ముఖులు స‌మావేశం కానున్నారు. త్వ‌ర‌లో జ‌గ‌న్ తో స‌మావేశం ఉంద‌ని అంటున్నారు. ఈ నేప‌థ్యంలో చిరంజీవి వ్యాఖ్య‌లు ప్రాధాన్యం సంత‌రించుకున్నాయి. మ‌రి, జ‌గ‌న్ స‌ర్కారు తీరుపై ఇండ‌స్ట్రీ ఎలాంటి వైఖ‌రితో ముందుకు సాగ‌నుంది? అనేది పై రెండు స‌మావేశాల‌తో తేలిపోనుంద‌ని అంటున్నారు. ఏం జ‌రుగుతుంద‌న్న‌ది చూడాలి.