Janasena- Mega Family: వచ్చే ఎన్నికల్లో జనసేనకు సపోర్టుగా మెగా ఫ్యామిలీ ఎంటర్ కానుందా? ముఖ్యంగా చిరంజీవి బాహటంగా మద్దతు తెలపనున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా ఈ అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. జనసేన ఆవిర్భావం నుంచి పవన్ ఒంటరిగానే పోరాడుతున్నారు. సరైన విజయం దక్కకున్నా.. పార్టీని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లగలిగారు. జనసేన గ్రాఫ్ పెరుగుతుండడంతో కుటుంబ సపోర్ట్ తోడైతే సునాయాస విజయం దక్కుతుందని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
2014లో పవన్ జనసేన పార్టీని స్థాపించారు. అప్పటినుంచి ఒంటరిగానే పోరాడుతున్నారు. 2019 నాటికి మెగా బ్రదర్ నాగబాబు తోడయ్యారు. ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం ఆయన జనసేన ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తూ జనసేన బలోపేతానికి కృషి చేస్తున్నారు. మిగతా పార్టీలతో పోల్చుకుంటే కుటుంబ సపోర్టు తక్కువ. పరోక్షంగా ఆశీస్సులు ఉన్నా.. ప్రత్యక్షంగా మాత్రం ఎవరు జనసేన కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. ఈ తరుణంలో పవన్ కు లోటు స్పష్టంగా కనిపిస్తోంది. దానిని ఈ ఎన్నికల్లో భర్తీ చేస్తారని ప్రచారం జోరుగా సాగుతోంది.
ఈ మధ్యనే చిరంజీవికి సంబంధించి రెండు కార్యక్రమాలు జరిగాయి. భోళా శంకర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో జబర్దస్త్ ఆర్టిస్ట్ ఆది కీలక ప్రసంగం చేశారు. మెగా ఫ్యామిలీ అంతా ఒక్కటేనని చెప్పుకొచ్చారు. పవన్ కు చిరు అన్ని విధాలా సపోర్ట్ చేస్తారని అర్థం వచ్చేలా మాట్లాడారు. అక్కడకు రెండు రోజులు తర్వాత వాల్తేరు వీరయ్య 200 రోజుల సక్సెస్ మీట్ లో చిరంజీవి వైసీపీ సర్కార్ పై స్పందించారు. ప్రత్యేక హోదా ఎక్కడని గట్టిగా నిలదీశారు. కేవలం రెండే రెండు నిమిషాలు మాట్లాడి వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను గుర్తు చేశారు. దీంతో చిరంజీవి రూట్ మార్చారన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి.
ఒక్క చిరంజీవే కాదు.. మెగా కాంపౌండ్ వాల్ హీరోలంతా ఎన్నికల్లో రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ ఇప్పటికే ఓపెన్ స్టేట్మెంట్లు ఇచ్చారు. తామంతా పవన్ వెంటే నడుస్తామని ప్రకటించారు. ఇప్పుడు ఏకంగా మెగా ఫ్యామిలీ మూల స్తంభం చిరంజీవి ఏపీ రాజకీయాలను టచ్ చేశారు. తనకు రాజకీయాలు సూట్ కావంటూనే వైసీపీ సర్కార్కు గట్టి ఝలక్ ఇచ్చారు. ఈసారి ఎలాగైనా జనసేన గెలిపించుకోవాలన్న ఆత్రంలో భాగంగా చిరు ఈ వ్యాఖ్యలు చేశారని విశ్లేషణలు వెలువడుతున్నాయి. మొత్తానికైతే మెగా కాంపౌండ్ వాల్ మొత్తం జనసేన వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. ప్రత్యక్షంగా కాకున్నా.. పరోక్షంగా నైనా రంగంలోకి దిగుతామన్న సంకేతాలు పంపించడంలో మెగా ఫ్యామిలీ సక్సెస్ అయ్యింది.