California Mother: ఏంటి సంగతీ.. పాప ఏడ్చింది.. అయితే వుడ్‌వడ్స్ పట్టమని అమ్మతో చెప్పు.. 1990, 2000 దశకంలో వచ్చిన ఈ యాడ్ అందరికీ గుర్తుండే ఉంటుంది. పాప ఏడిస్తే.. వుడ్‌వడ్స్ పడితే తగ్గిపోతుందని సదరు కంపెనీ మార్కెటింగ్ చేసింది. ఈ ప్రకటన చాలా మందిని ఆకట్టుకుంది. చంటి పిల్లలు ఏడవడం సహజం. చిన్న చీమ కుట్టినా.. ఏదైన పెద్ద శబ్దం వచ్చినా.. కడుపులో నొప్పిగా ఉన్నా.. చెవిలో నొప్పి ఉన్నా.. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉన్నా ఆగకుండా ఏడుస్తూనే ఉంటారు. ఏం జరుగుతుందో అర్థం చేసుకోలేరు. మాట్లాడి చెప్పలేరు. కానీ చేష్టలతో కొన్ని విషయాలు తల్లులకు అర్థమవుతాయి. కానీ, ఇక్కడ ఆ తల్లికి ఏమర్థమైందో ఏమో.. బిడ్డ ఏడుస్తుందని పాలు పట్టాల్సిన తల్లి.. పాలకు బదులు మందు పట్టింది.
పిల్లల భవిష్యత్ కోసం..
నవ మాసాలు మోసి పురిటి నొప్పుల బాధ భరించి బిడ్డను ప్రపంచానికి పరిచయం చేస్తుంది తల్లి. పిల్లల భవిష్యత్ కోసం ఎన్నో కలలు వ తేది కంటూ పిల్లలే లోకంగా బతుకుతుంది. తల్లి బిడ్డను లాలిస్తూ బుజ్జగిస్తూ అల్లారు ముద్దుగా పెంచుతుంది. తమ పిల్లలకు ఏ చిన్న ఆపద వచ్చినా విలవిలలాడిపోతుంది. బిడ్డలకు ఏ హానీ జరగకుండా కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. తను పస్తులుండిమరి బిడ్డల కడుపు నింపుతుంది. పసి బిడ్డ ఏడ్చినప్పుడల్లా పాలు పట్టి పాప ఏడవకుండా చేస్తారు తల్లులు. కానీ ఓ తల్లి బిడ్డ పదే పదే ఏడుస్తుందని పాల డబ్బాలో మద్యాన్ని నింపి పాపాయికి తాగించింది.
ఏం జరిగిందంటే..
కాలిఫోర్నియాకు చెందిన హోనెస్టి డి లా టోర్రే అనే మహిళ రెండు నెలల వయసున్న తన పాపతో కార్ డ్రైవింగ్ చేస్తుంది. ఆ సమయంలో పాప గుక్కపెట్టి ఏడవడం మొదలు పెట్టింది. దీంతో చిర్రెత్తిపోయిన ఆ మహిళ పాల డబ్బాలో ఆల్కాహాల్ నింపి బిడ్డకు పట్టించింది. దానిని తాగిన తర్వాత ఆ చిన్నారి మత్తులోకి జారుకుని అనారోగ్యానికి గురయ్యింది. వెంటనే పాపను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.
పాప ఏడుపు ఆపడం కోసం పసి బిడ్డకు తల్లి మందు పట్టించిన విషయం తెలుసుకోని షాక్ అయ్యారు. పాప ఆరోగ్యానికి హాని కలిగించేలా వ్యవహరించిన హోనెస్టి డి లా టోర్రేను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.