MBBS Students: దేశ జనాభా నానాటికి పెరిగిపోతోంది. మరో కొన్ని సంవత్సరంలో డ్రాగన్ దేశాన్ని మనం అధిగమించబోతున్నామని ఐక్యరాజ్యసమితి చెబుతోంది. ఇలాంటి సమయంలో అందరికీ వైద్యం అందించాలంటే అది కత్తి మీద సామే. పైగా కోవిడ్ ప్రబలినప్పుడు మన వైద్య విధానంలో ఉన్న లోపాలు ఒక్కసారిగా కళ్ళకు కట్టాయి. ఈ క్రమంలో ఆ లోపాల నుంచి గుణపాఠాలు నేర్చుకున్న కేంద్ర ప్రభుత్వం అందుకు అనుగుణంగా మార్పులు, చేర్పులకు శ్రీకారం చుట్టింది. వైద్యానికి రక్షణశాఖ తర్వాత బడ్జెట్లో అగ్రతాంబూలం ఇస్తున్నది. ఈ క్రమంలో ప్రజలకు వైద్య సేవలను మరింత చేరువ చేసేందుకు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం వినూత్న ఆలోచనకు తెరతీసింది.

ఇంతకీ ఏం చేస్తారంటే
ప్రస్తుతం వైద్య విద్య అభ్యసిస్తున్న విద్యార్థులు ఇకముందు ఫ్యామిలీ డాక్టర్ లు గా మారిపోనున్నారు. నేరుగా గ్రామాల్లోని ప్రజల వద్దకే వెళ్లి.. కొన్ని కుటుంబాలను దత్తత తీసుకొనున్నారు. ఆ కుటుంబాల యోగక్షేమాలను తెలుసుకోవడం, రెండు వారాలకు ఒకసారి ఇంటికి వచ్చి ఆరోగ్యాన్ని పర్యవేక్షించడం, అవసరమైన మందులు సూచించడం, మరీ అవసరమైతే ఆస్పత్రులకు రిఫర్ చేయడం ద్వారా ఆరోగ్యాన్ని పరి రక్షించనున్నారు. వైద్య విద్య సిలబస్ లో భాగంగా కుటుంబాల దత్తత కార్యక్రమాన్ని చేపట్టాలని గతంలో చేసిన సిఫారసులను జాతీయ వైద్య కమిషన్ తాజాగా అమల్లోకి తీసుకువచ్చింది. ఈ మేరకు వైద్య విద్య క్యాలెండర్లో కుటుంబాల దత్తత ను ప్రధాన అంశంగా ప్రస్తావించింది.
తెలిసి తెలియని వైద్యం వల్ల ప్రాణాలు పోతున్నాయి
ఇప్పటికీ మారుమూల గ్రామాల్లో ప్రైవేట్ ప్రాక్టీషనర్లు, ఆర్ఎంపీలు మాత్రమే వైద్య సేవలు చేస్తున్నారు.. కొందరు తెలిసి తెలియని వైద్యం చేస్తుండటం వల్ల రోగుల ప్రాణాలు పోతున్నాయి.. వాస్తవానికి ప్రాక్టీషనర్లు ప్రాథమిక వైద్య మాత్రమే చేయాల్సి ఉండగా.. కొందరు సర్జరీలు, ప్రసవాల వంటివి చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా విచ్చలవిడిగా నొప్పుల మాత్రలు, యాంటీ బయోటిక్స్, ఇతర మందులు ఇస్తున్నారనే అపవాదులు ఉన్నాయి. ఈ క్రమంలో అటు గ్రామీణ ప్రజలకు మంచి వైద్యం అందించడం, ఇటు వైద్య విద్యార్థులకు క్షేత్రస్థాయిలో పరిస్థితులు, వివిధ వ్యాధులపై అవగాహన, ప్రాక్టీస్ లభించేందుకు కుటుంబాల దత్తత కార్యక్రమాన్ని పాఠ్యాంశంగా చేర్చాలని జాతీయ వైద్య కమిషన్ గతంలోనే సిఫారసు చేసింది. తాజాగా దేనిని అమల్లోకి తీసుకువచ్చింది. దీనివల్ల పలుచోట్ల గ్రామీణ ప్రాంతాల వారికి నాణ్యమైన వైద్య సేవలు అందుతాయని వైద్య వర్గాలు చెబుతున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు అనే తేడా లేకుండా ఒక్కో బ్యాచ్ విద్యార్థులు ఒక్కో గ్రామాన్ని దత్తత తీసుకోవాలి.

బ్యాచ్ లోని ఒక్కో విద్యార్థికి ఐదు నుంచి ఏడు కుటుంబాల వరకు కేటాయిస్తారు. ప్రతి 25 మంది విద్యార్థుల బృందాన్ని పర్యవేక్షించేందుకు ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉంటారు. వైద్య విద్యార్థులకు స్థానికంగా ఆశా కార్యకర్తల సాయం లభించేలా అధికారులు ఏర్పాటు చేస్తారు. ఇక వైద్య విద్యార్థులు ఆయా కుటుంబాల్లోని వారి ఆరోగ్య పరిస్థితులను పర్యవేక్షించాల్సి ఉంటుంది. అత్యవసరమైతే టెలీ మెడిసిన్ పద్ధతిలో అవసరమైన వైద్య సలహాలు సూచనలు ఇవ్వచ్చు. ఇక వైద్య విద్య కోర్సులో మొదటి ఏడాదిలో కనీసం 10 సార్లు అయినా వారికి కేటాయించిన కుటుంబాల వద్దకు విద్యార్థులు వెళ్లాల్సి ఉంటుంది. ఈ మొత్తాన్ని కూడా కోర్సులో భాగంగానే చూస్తారు. ఇలా చేయడం వల్ల గ్రామీణ ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుతాయని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. కోవిడ్ ప్రబలిన మొదటి దశలోనే నరేంద్ర మోడీ దేశంలో వైద్య విధానంలో సమూల మార్పులు తీసుకొస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. అప్పటి హామీ ప్రకారం తన మాటను ఈ విధంగా ని లుపుకుంటున్నారు. ఇప్పటికే ఈ విధానం గురించి రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ విద్యా సంవత్సరం నుంచి దీనిని అమలు చేసేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది.