Manchu Vishnu- MAA Building: ఎట్టకేలకు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ భవన నిర్మాణంపై అధ్యక్షుడు మంచు విష్ణు ప్రతిపాదనలు చేశారు. దీనికి ఆయన రెండు సూచనలు చేశారు. ఫిల్మ్ ఛాంబర్ నుండి అరగంట ప్రయాణం చేస్తే ఒక స్థలం ఉంది, అక్కడ మా బిల్డింగ్ నిర్మాణం చేపట్టడం. లేదంటే ఫిల్మ్ ఛాంబర్ ఆవరణలోనే మా బిల్డింగ్ నిర్మాణం చేపట్టడం. ఫిల్మ్ ఛాంబర్ ని కూల్చివేసి కొత్త బిల్డింగ్ నిర్మించి, అందులో ‘మా’ కోసం స్పేస్ తీసుకోవడమని మంచు విష్ణు రెండు సూచనలు చేశారు. వేరే చోట మా బిల్డింగ్ నిర్మించడం కంటే ఫిల్మ్ ఛాంబర్ కొత్తగా నిర్మించి అందులో కొంత స్పేస్ తీసుకోవడానికే సభ్యులు మొగ్గు చూపించారు. ఆ ఆప్షన్ కే ఓటు వేయడం జరిగింది.

దీంతో త్వరలో ఫిల్మ్ ఛాంబర్ కూల్చివేసి కొత్త భవనం నిర్మించనున్నారు. అందులో మా బిల్డింగ్ కి కావలసిన స్పేస్ దానికి అయ్యే ఖర్చు మంచు విష్ణు సొంత డబ్బులతో భరిస్తానని హామీ ఇచ్చారు. దీనికి ఫిల్మ్ ఛాంబర్ సభ్యులు అంగీకరించాల్సి ఉంది. మొత్తానికి మా బిల్డింగ్ నిర్మాణం వైవు ఒక అడుగుపడింది. అది ఎంత వరకు కార్యరూపం దాల్చుతుంది అనేది చూడాలి. ఎందుకంటే పాత బిల్డింగ్ కూల్చడానికి కొత్తది నిర్మించడానికి మూడేళ్ళ సమయం పడుతుందని మంచు విష్ణు వెల్లడించారు.
మా అధ్యక్షుడిగా మంచు విష్ణు పదవీ కాలం మరో ఏడాది మాత్రమే ఉంది. వచ్చే సంవత్సరం మా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. మంచు విష్ణు మరలా మా అధ్యక్ష ఎన్నికల్లో నిల్చుంటారా? నిల్చున్నా గెలుస్తారా? అనే సందేహాలు మొదలయ్యాయి. కాగా ఎన్నికల సమయంలో ఇచ్చిన 90 శాతం హామీలు నెరవేర్చినట్లు మంచు విష్ణు వెల్లడించారు. అదే సమయంలో మా సభ్యులకు ఎలాంటి సమస్యలు ఉన్నా కమిటీకి చెప్పాలన్నారు.

అలా కాకుండా ప్రెస్ మీట్లు పెట్టి ఆరోపణలు చేస్తే సభ్యత్వం రద్దు చేస్తామని హెచ్చరించారు. 2021 లో మా అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. మంచు విష్ణుకు పోటీగా ప్రకాష్ రాజ్ బరిలో దిగారు. మెగా ఫ్యామిలీ ప్రకాష్ రాజ్ కి పూర్తి మద్దతు ప్రకటించినా ఆయన విజయం సాధించలేకపోయారు. మా ఎన్నికలు సార్వత్రిక ఎన్నికలను తలపించగా… తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసుకున్నారు. ఎన్నికల అనంతరం కూడా హైడ్రామా నడిచింది. ప్రకాష్ రాజ్ ఎన్నికలు సజావుగా జరగలేదన్నారు. నాగబాబు తన మా సభ్యత్వానికి రాజీనామా ప్రకటించారు.