May Day 2023- YCP: భారత జాతీయ జెండా దేశానికి గర్వకారణం. అందరూ గౌరవించే పతాకం. శ్రద్ధాశక్తులతో ఎగరవేయడం అనేది ఒక బాధ్యత. జాతీయ దినోత్సవాలకు గౌరవంగా జెండాలను ఎగరవేయడం చూస్తూనే ఉన్నాం. పొరపాట్లు, తప్పులు, ఉల్లంఘనలు అసలు ఉండకూడదు. ఫ్లాగ్ కోడ్ ను తప్పనిసరిగా పాటించాలి. అమలు చేయాల్సిన అవసరం ఉంది. అయితే, ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ నాయకులు చేసిన చిన్న పొరపాటు ఇప్పుడు హాట్ టాపిగ్గా మారింది.
మేడే సందర్భంగా గుంటూరు జిల్లాలోని వైసీపీ కార్యాలయంలో జాతీయ జెండా ఎగరవేయాలనుకున్నారు. దానిని సులభంగా కట్టే పద్ధతులు ఉన్నాయి. దానిని మరవడంతో ఈ పొరపాటు జరిగింది. మంత్రి అంబటి రాంబాబు, జిల్లాలోని ఎమ్మెల్యేలు, నాయకులు జెండా ఎగరవేసే కార్యక్రమానికి హాజరయ్యారు. కార్మిక దినోత్సవాన్ని స్మరించుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించతలపెట్టారు.
అయితే, అంబటి రాంబాబు జెండాను ఎగరవేసేందుకు ప్రయత్నించగా, ఎగరలేదు. పైగా ఊడి కిందపడింది. దానిని జాగ్రత్తగా ఆయన పట్టుకున్నప్పటికీ జెండాను గౌరవించడం ఇలాగేనా అన్న విమర్శలు మొదలయ్యాయి. మరలా జెండా కర్రను కిందకు దింపి జెండా కట్టి ఎగరవేశారు. ఈ దృశ్యాన్ని అక్కడ ఉన్న వారెవరో చిత్రీకరించారు. సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారిపోయింది.
జెండా వందనం నిబంధనల విషయంలో చాలా జాగురతతో వ్యవహరించాలి. ఎగరవేసే ముందుకు ఒకటికి రెండుసార్లు సరిచూసుకోవాలి. లేకపోతే రాజ్యాంగ స్పూర్తికి విరుద్ధంగా వ్యవహరించినట్లవుతంది. ఈ విషయాలు తెలిసినా నిర్లక్ష్యంగా వ్యవహరించడం అనేది క్షమించరానిది. అయితే, అధికార పార్టీ అవడం వల్ల పోలీసులు, అధికారులకు తెలిసినా చూసీచూడనట్లు వ్యవహరించారన్న ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. ఏది ఏమైనా వైసీపీ జెండా ఎగరవేయడంలో ఉన్న నిబంద్ధత కంటే జాతీయ జెండాపై మరింత ఎక్కువగా ఉంచాలన్న స్పృహ ఇప్పటికైనా కలిగాలని కోరుకుందాం.