Mastodon Twitter : మైక్రో బ్లాగింగ్ యాప్ ట్విట్టర్ ను ఎలాన్ మస్క్ కొనుగోలు చేయడం, బ్లూ టిక్ కోసం ఇయర్లీ ఫీజు వసూలు చేస్తామని చెప్పడం, ఉద్యోగులను తొలగించడంతో ఇప్పుడు చాలా మంది యూజర్లు ప్రత్యామ్నాయం వెతుక్కుంటున్నారు. కొందరు దీనిని బాహాటంగానే విమర్శిస్తున్నారు. పొట్టి వాక్యాల్లో సందేశాన్ని అందించే ట్విట్టర్ నుంచి వైదొలుగుతున్నారు. పెద్ద పెద్ద సెలబ్రిటీలు కూడా ట్విట్టర్ నుంచి ట్విట్టర్ నుంచి బయటకు వెళ్తున్నారు. ఇప్పుడు వారికి ఆశా దీపంలా కనిపిస్తోంది మాస్టడాన్.

-ఏమిటి ఈ మాస్టడాన్?
ఇది ఒక ఓపెన్ సోర్స్ మైక్రో బ్లాగింగ్ సర్వీస్. కొత్తదేమీ కాదు. యూజెన్ రొఖో అనే వ్యక్తి దీనిని 2016లో సృష్టించాడు. ఇప్పుడు తాజా పరిణామాల నేపథ్యంలో బహుళ ప్రజాదరణ పొందుతున్నది. ఇది ట్విట్టర్ మాదిరి కేంద్రీయ విధానంలో ఉండదు. పైగా ఇది వివిధ స్వతంత్య్ర యూజర్ మేనేజ్డ్ సర్వర్ల తో కలిసి పని చేస్తుంది. దీనిని ట్విట్టర్ మాదిరే ఉపయోగించుకోవచ్చు. ఇతరులనూ ట్యాగ్ చేయవచ్చు. మీడియా కు షేర్ చేయవచ్చు. ఇతరుల ఖాతాలను ఫాలో కావొచ్చు. ఇప్పటికే పెద్ద పెద్ద సెలబ్రిటీలు ఇందులో జాయిన్ అయ్యారు. ఇవే గాక చాలా మైక్రో బ్లాగింగ్ యాప్స్ ఉన్నాయి.
-కూ
ఇది మన దేశానికి చెందిన మైక్రో బ్లాగింగ్ యాప్. కోవిడ్ సమయంలో పురుడు పోసుకుంది. ఇది 5 కోట్ల యూజర్లను కలిగి ఉంది. 10 భాషల్లో అందుబాటులో ఉంది. అభిప్రాయాలను పంచుకోవడమే కాదు.. తాజా వార్తల పై చర్చలు, వ్యక్తిగత సమాచార అప్డేట్లు, అత్యంత ఆసక్తికరమైన రోజువారి అంశాలను పంచుకోవడం వంటివి చేయొచ్చు. సెలబ్రిటీలు ఇతరుల ఖాతాలను అనుసరించవచ్చు. ఇతరులతో చాట్ చేయవచ్చు కూడా.
-టంబ్లర్
దీనిని ఒక బ్లాగ్ లాగా వాడుకోవచ్చు. కానీ ఇతరులను అనుసరించేందుకు, వారి తాజా పోస్టులను చూసేందుకు అనుమతిస్తుంది. తమ టెక్స్ట్, ఫోటో లేదా జిప్ లను జోడించి సొంత విషయాలూ పోస్ట్ చేసుకోవచ్చు. ఇందులో 53 కోట్ల బ్లాగ్ లు ఉన్నాయి. తమ అంశాలు ఏ సమయంలో పోస్ట్ కావాలో నిర్ణయించుకోవచ్చు. ట్యాగ్స్ ను జోడించడం ద్వారా ఆయా అంశాలకు సంబంధించిన పోస్ట్ లను వినియోగదారులకు చేరువయ్యేలా చూసుకోవచ్చు. ఇవే గాక కౌంటర్ సోషల్, బ్లూ స్కై, క్లబ్ హౌస్ వంటి యాప్స్, రెడిట్, కో హోస్ట్ వంటివి కూడా ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి.