Traffic Challan AP: ఏపీలో ఇప్పుడు బైక్ వేసుకుని రోడ్డెక్కాలంటే హడలిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఫైన్లు ఆ రేంజ్‌లో వేస్తున్నారు మరి. హెల్మెట్ లేకపోయినా లేదంటే సీటు బెల్టు లేకపోయినా గతంలో కేవలం రూ.100 ఫైన్ కట్టి వెళ్లిపోయే వాళ్లం. కానీ ఇప్పుడు రూ.1000 దాకా వసూలు చేస్తున్నారండోయ్. దీంతో వాహనదారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలే కరోనా కారణంగా నష్టపోయి ఉంటే.. ఈ కొత్త ఫైన్లు ఏంటని మండిపడుతున్నారు.
వాస్తవానికి కేంద్రం మోటారు వాహన సవరణ చట్టం 2019లో తీసుకు వచ్చింది. దీనిపై అప్పట్లో అన్ని రాష్ట్రాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఆ తర్వాత కేంద్రం కూడా కొంత వెనక్కు తగ్గి రాష్ట్రాలు మార్పులు చేసుకునే విధంగా అవకాశం కల్పించింది. ఇక ఏపీలో జగన్ ప్రభుత్వం 37 సెక్షన్లలో అనేక మార్పులు చేసిన తర్వాత 2020 అక్టోబర్ 21న జీవో జారీ చేసింది. కానీ కరోనా కారణంగా కేంద్రం కొత్త ఫైన్లను వాయిదా వేస్తూ మినహాయింపు ఇచ్చింది. అంటే బైక్ మీద హెల్మెట్ లేకపోయినా లేదంటే ఇతర రూల్స్ పాటించకపోయినా కొత్త ఫైన్లు వేయొద్దంటూ ఉత్తర్వులు ఇచ్చింది.
Also Read: సినీ పరిశ్రమ వేడుకోళ్లపై పవన్ వ్యాఖ్యల కలకలం.. చిరంజీవి వంగివంగి దండాలపైనేనా?
అయితే గతేడాది 2021 అక్బోబర్ దాకా మాత్రమే దీన్ని అమలు చేసింది కేంద్ర ప్రభుత్వం. ఆ తర్వాత పొడిగించకపోవడంతో.. కొత్త వాహన చట్టాలను అమలు చేస్తోంది ఏపీ ప్రభుత్వం. ఈ జీవోలతో రవాణాశాఖ అధికారులు రంగంలోకి దిగారు. అన్ని జిల్లాల్లో పర్యటిస్తూ తనిఖీలు చేస్తున్నారు. హెల్మెట్, సీటుబెల్టు లేకపోతే రూ.1000, పర్మిట్ లేని వాహనాలకు రూ.10వేలు, గూడ్స్, పెద్ద వాహనాల్లో మోతాదుకు మించి సరుకులను తరలిస్తే ఏకంగా రూ.20వేలు ఫైన్లు వేస్తున్నారు.
ఇక ప్రభుత్వం కూడా రవాణా శాఖకు టార్గెట్ ఇచ్చినట్టే రోజుకు రూ.కోటి దాకా ఫైన్లు వసూలు చేస్తున్నారు. దీంతో సామాన్య జనం బెంబేలెత్తిపోతున్నారు. అయితే పోలీసులు మాత్రం పాత పద్ధతిలోనే ఫైన్లు వసూలు చేస్తున్నారు. ఎందుకంటే వారి సాఫ్ట్ వేర్‌లో ఇంకా మార్పులు చేయలేదు. దీంతో పోలీసులు అలా వసూలు చేస్తుంటే.. మీరెందుకు ఇంత ఫైన్లు వేస్తున్నారంటూ రవానాశాఖ అధికారులతో జనాలు గొడవలకు దిగుతున్నారు.
తామేమీ చేయట్లేదని ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల మేరకు ఫైన్లు వేస్తున్నామని అంటున్నారు రవాణా శాఖ అధికారులు. మొత్తం మీద ఇటు ప్రజలకు అటు అధికారులకు పెద్ద వివాదమే చెలరేగుతోంది. అసలే కరోనా కష్టాలతో నానా ఇబ్బందులు పడుతుంటే.. ఈ కొత్త ఫైన్లు ఏంటని కడిగిపారేస్తున్నారు జనాలు. దీనిపై పెద్ద ఎత్తున ఆందోళనలు కూడా జరిగే అవకాశం ఉంది.