IPS Transfers In Telangana: తెలంగాణ కొత్త పోలీస్ బాస్ విధుల్లో చేరిన నాలుగు రోజుల్లోనే తన మార్కు చూపించుకున్నారు. మంగళవారం ఉదయం టీఎస్‌ఎస్పీ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. వివిధ అంశాల ఆధారంగా బెటాలియన్లకు ట్రోఫీలు ఇస్తామని ప్రకటించారు. రాత్రి భారీగా ఐపీఎస్‌లను బదిలీ చేశారు. ఈమేరకు అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం రాష్ట్రంలో 29 మంది ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.

బదిలీల్లో మార్క్ ఎవరిది?
కాగా, పోలీస్ బదిలీల్లో ఎవరి మార్క్ అన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది. బాధ్యతలు చేపట్టిన నాలుగు రోజులకే అంజనీకుమార్ తన మార్కు చూపించారా లేక, ఎన్నికల ఏడాది నేపథత్యంలో అప్పటికే ప్రభుత్వం సిద్ధం చేసిన జాబితాపై అంజనీకుమార్ సంతకం చేశారా అన్న చర్చ జరుగుతోంది. హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా రాజీవ్ రతన్ , పోలీసు అకాడమీ డైరెక్టర్‌గా సందీప్ శాండిల్య, ఆర్గనైజేషన్, లీగల్ అదనపు డీజీగా శ్రీనివాస్‌రెడ్డి, రైల్వే అదనపు డీజీగా శివధర్‌రెడ్డి, పోలీసు సంక్షేమం, క్రీడల అదనపు డీజీగా అభిలాష బిస్తు, హోంగార్డు అదనపు డీజీగా అభిలాష బిస్తుకు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇక మహిళా భద్రత, షీటీమ్స్ అదనపు డీజీగా షికా గోయల్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీఆర్‌లో ఉన్న పలువురికి పోస్టింగ్ ఇచ్చారు.
గులాబీ బాస్ జాబితానే..
29 మంది ఐపీఎస్‌ల తాజా బదిలీల్లో డీజీపీ అంజనీకుమర్ కంటే.. సీఎం కేసీఆర్ మార్కే ఎక్కువగా ఉందన్న అభిప్రాయం పోలీస్ వర్గాల్లో వ్యక్తమవుతోంది. మహేందర్‌రెడ్డి డీజీపీగా ఉన్నప్పుడే బదిలీల జాబితా రూపొందించినట్లు తెలిసింది. పోతూ పోతూ కేసీఆర్‌కు అనుకూలంగా బదిలీలు చేశారని తెలుస్తోంది. ఈ ఏడాదిలో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో సర్కార్‌కు అనుకూలులకు కీలక పోస్టింగ్ ఇచ్చారని సమాచారం. అందులో భాగంగానే వీఆర్‌లో ఉన్నవారికీ పోస్టింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మహేందర్‌రెడ్డి రూపొందించిన జాబితాపై అంజనీకుమార్ సంతకం చేశారన్న చర్చ ఐపీఎస్‌లలో జరుగుతోంది.

మొత్తానికి పోలీస్ శాఖలో మార్పు yీ జీపీతోనే ఆగిపోలేదు.. కేసీఆర్ తనదైన మార్కుతో వ్యవస్థనే మారుస్తున్నారు. మరి ఇది ఎవరికి లాభిస్తుందో చూడాలి.