ఈ నాన్నలు అంతే ఉన్నారు.. నేటి యువతరం అలాగే పాడైంది. తమకు నచ్చిన వాడిని చేసుకుందామని యువత.. లేదు వాడికి ఆస్తి పాస్తి ఉద్యోగం లేదని తల్లిదండ్రులు చీ కొడుతున్నారు. బలవంతపు పెళ్లిళ్లకు సిద్ధమవుతున్నారు. యువత ఊరుకుంటుందా? మధ్యలోనే లేచిపోయి తలవంపులు తెస్తున్నారు. ఈ కారణంగా పాపం వారిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్న వరుడు/వధువు నవ్వుల పాలవుతున్నారు.
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ కు చెందిన బీటెక్ 3వ సంవత్సరం చదువుతున్న యువతికి తాజాగా మహబూబ్ నగర్ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన యువకుడితో పెళ్లి ఖాయమైంది. ఆదివారం పెళ్లిపీటల పై ఉన్న వధువుకు తరచూ సెల్ ఫోన్ లో మాట్లాడుతూ చాటింగ్ చేస్తూ పెళ్లికి వచ్చిన యువకుడికి సైగలు చేస్తూ కనిపించింది. అనుమానం వచ్చిన బంధువులు ఎవరితో మాట్లాడుతున్నావ్ అని నిలదీశారు. అనుమానాస్పదంగా పెళ్లిలో కనిపించిన యువకుడిని పట్టుకొని చితకబాదారు. దీంతో వారి ప్రేమ విషయం బయటపడింది.
అమ్మాయికి ఈ పెళ్లి అస్సలు ఇష్టం లేదని.. మూడేళ్లుగా అదే గ్రామానికి చెందిన ఓ అబ్బాయిని ప్రేమిస్తోందని.. పెళ్లి అయిన తర్వాత అర్ధరాత్రి వీరిద్దరూ లేచిపోవడానికి ప్లాన్ చేశారన్న విషయం తెలిసింది.
దీంతో వధువును, యువకుడిని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. పెళ్లి తర్వాత వీరిద్దరూ రాత్రి లేచిపోదామని ప్లాన్ చేశారని విచారణలో తేలింది. ఏకంగా పెళ్లి కూతురును వెంటాడుతూ యువకుడు పెళ్లి మండపం వద్దకు వచ్చి ఇలా చేసినట్టు తేలింది.
రాత్రి వరకు పోలీసులు వారితో చర్చలు జరిపారు. చివరకు వరుడు ఆ అమ్మాయిని వదిలేసి వెళ్లిపోయాడు. ఎవరూ కేసులు పెట్టుకోలేదు. ఇరువర్గాల అంగీకారంతో వధూవరులను ఎవరింటికి వాళ్లను పంపించేశారు.